10.2-637-సీ.
మలయజకర్పూరమహితవాసితహేమ-
కలశోదకంబుల జలకమాడి
నవ్యలసన్మృదు దివ్యవస్త్రంబులు-
వలనొప్ప రింగులువాఱఁ గట్టి
మకరకుండల హార మంజీర కేయూర-
వలయాది భూషణావలులు దాల్చి
ఘనసార కస్తూరికా హరిచందన-
మిళితపంకము మేన నలర నలఁది
10.2-637.1-తే.
మహితసౌరభ నవకుసుమములు దుఱిమి
పొసఁగ రూపైన శృంగారరస మనంగ
మూర్తిఁ గైకొన్న కరుణాసముద్ర మనఁగ
రమణ నొప్పుచు లలితదర్పణము చూచి.
10.2-638-తే.
కడఁగి సారథి తెచ్చిన కనకరథము
సాత్యకి హిత ప్రియోద్ధవ సహితుఁ డగుచు
నెక్కి నిజకాంతి దిక్కులఁ బిక్కటిల్లఁ
బూర్వగిరిఁ దోఁచు భానునిఁ బోలి వెలిఁగె.
భావము:
అనంతరం, ఆ నందనందనుడు చందన కర్పూరాల పరిమళాలతో గుమగుమలాడే కాంచనకలశ జలాలతో స్నానం చేసాడు. సన్నని మృదువైన క్రొత్త బట్టలు ధరించాడు. కర్ణ కుండలాలు, హార, భుజకీర్తులు మున్నగు భూషణాలను అలంకరించుకున్నాడు. పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం కలిపిన మైపూతను అలదుకున్నాడు సువాసనలు వెదజల్లే పూలమాలలను ధరించాడు. రూపం దాల్చిన శృంగార రసమూ, ఆకారం దాల్చిన అనురాగ సముద్రమూ అన్నట్లుగా అలరారుతున్న శ్రీకృష్ణుడు అద్దంలో చూసుకున్నాడు. సాత్యకితోనూ మిత్రుడైన ఉద్ధవునితోనూ కలసి సారథి తెచ్చిన బంగారురథాన్ని అధిరోహించి, తూర్పుకొండపై ఉదయించే సూర్యుడిలా శోభిస్తూ, శ్రీకృష్ణుడు తన శోభ నలుదిక్కులా విరజిమ్ముతూ ప్రకాశించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=637
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment