Wednesday, August 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౭(307)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-608-వ.
ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండునైన నారాయణుం డశేష తీర్థోపమానంబయిన మునీంద్రపాద తీర్థంబు ధరించినవాఁడయి, సుధాసారంబులైన మితభాషణంబుల నారదున కిట్లనియె.
10.2-609-క.
"ఏ పని పంచినఁ జేయుదుఁ
దాపసవర!" యనుడు నతఁడు "దామోదర! చి
ద్రూపక! భవదవతార
వ్యాపారము దుష్టనిగ్రహార్థము గాదే!
10.2-610-తే.
అఖిలలోకైకపతివి, దయార్ద్రమతివి,
విశ్వసంరక్షకుండవు, శాశ్వతుఁడవు
వెలయ నే పనియైనఁ గావింతు ననుట
యార్త బంధుండ విది నీకు నద్భుతంబె!
10.2-611-తే.
అబ్జసంభవ హర దేవతార్చనీయ,
భూరిసంసారసాగరోత్తారణంబు,
నవ్యయానందమోక్షదాయకము నైన
నీ పదధ్యాన మాత్మలో నిలువనీవె "

భావము:
అలా దేవదేవుడూ, అర్జునుడి చెలికాడూ, నారాయణుడూ అయిన నల్లనయ్య సమస్త పుణ్యతీర్ధాలకూ సాటివచ్చే నారదమునీంద్రుడి పాదజలాన్ని తన తలపై ధరించి, అమృతం చిలికే పలుకులతో ఇలా అన్నాడు. “ఓ తాపసోత్తమా! మీరు ఏ పని చేయమని ఆజ్ఞాపిస్తే ఆ పని చేస్తాను. సెలవీయండి.” ఇలా పలికిన కృష్ణుడితో నారదుడు ఇలా అన్నాడు. “ఓ దామోదరా! నీ అవతార లక్ష్యం దుర్మార్గులను శిక్షించడానికే కదా! నీవు సమస్తలోకాలకూ ప్రభుడవు; దయా పూరిత మానసుడవు; ప్రపంచాన్ని రక్షించేవాడవు; ఆర్తులకు బాంధవుడవు; అయిన నీవు ఏ పని అయినా చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కాదు. బ్రహ్మ, శివుడు మొదలైన దేవతల చేత పూజింపబడే ఓ కృష్ణా! సంసారసాగరాన్ని దాటడానికి సాధనము; మోక్షాన్ని ప్రసాదించేదీ; ఐన నీ పదధ్యానం నా ఆత్మలో నిలిచి ఉండేలా అనుగ్రహించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=611

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: