Thursday, August 19, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౪(314)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-633-క.
అని తద్వచనసుధాసే
చనమున ముది తాత్ముఁ డగుచు సంయమి చిత్తం
బునఁ దన్మూర్తిం దగ నిడు
కొని చనియెను హరినుతైకకోవిదుఁ డగుచున్.
10.2-634-క.
ఈ పగిది లోకహితమతి
నా పరమేశ్వరుఁడు మానవాకృతిఁ ద్రిజగ
ద్దీపితచారిత్రుఁడు బహు
రూపములం బొందె సుందరుల నరనాథా!
10.2-635-చ.
అని హరి యిట్లు షోడశసహస్రవధూమణులం బ్రియంబునన్
మనసిజకేళిఁ దేల్చిన యమానుషలీల సమగ్రభక్తితో
వినినఁ బఠించినం గలుగు విష్ణుపదాంబుజభక్తియున్ మహా
ధన పశు పుత్త్ర మిత్ర వనితాముఖ సౌఖ్యములున్ నరేశ్వరా! "

భావము:
ఇలా పలికి, నారదుడు వాసుదేవ వాగామృతధారలలో మునిగి సంతుష్టాంతరంగుడు, విష్ణు కీర్తనలు వాడుటలో అమిత నేర్పరి అయి, ఆ మంగళమయ స్వరూపాన్ని తన మనసులో నిలుపుకుని వెళ్ళిపోయాడు. ఓ పరీక్షిత్తు మహారాజా! లోకానికి మేలుచేకూర్చాలని మానవాకారాన్ని ధరించిన ఆ శ్రీకృష్ణుడు ఆ సుందరాంగులు అందరికీ ఆ విధంగా అనేక రూపాలతో చెందాడు. శ్రీకృష్ణుడు పదహారువేల మంది స్త్రీలను ఆదరించిన మానవాతీత లీలలను వినినా, చదివినా విష్ణుదేవుడి పాదాలపై భక్తి ప్రాప్తించటమే కాకుండా ధన, పశు, పుత్ర, మిత్ర, కళత్రాది సౌఖ్యాలు సైతం లభిస్తాయి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=635

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: