Friday, August 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౫(315)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-636-వ.
అని చెప్పి యప్పారాశర్యనందనుం డభిమన్యునందను కిట్లనియె; “నా నిశావసానంబునఁ బద్మబాంధవాగమనంబును గమలినీ లోకంబునకు మునుకలుగ నెఱింగించు చందంబునం గలహంస సారస రథాంగ ముఖ జలవిహంగంబుల రవంబులు సెలంగ నరుణోదయంబున మంగళపాఠకసంగీత మృదుమధుర గాన నినదంబును లలితమృదంగ వీణా వేణు నినాదంబును, యేతేర మేలుకని తనచిత్తంబునఁ జిదానందమయుం బరమాత్ము నవ్యయు నవికారు నద్వితీయు నజితు ననంతు నచ్యుతు నమేయు నాఢ్యు నాద్యంతవిహీనుఁ బరమబ్రహ్మంబునైన తన్నుందా నొక్కింత చింతించి యనంతరంబ విరోధి రాజన్య నయన కల్హారంబులు ముకుళింప భక్తజననయనకమలంబులు వికసింప నిరస్త నిఖిల దోషాంధకారుం డైన గోవిందుండు మొగిచిన లోచనసరోజంబులు వికసింపఁ జేయుచుఁ దల్పంబు డిగ్గి చనుదెంచి యంత.

భావము:
ఈ విధంగా పదహారువేల స్త్రీల సాంగత్య లీలలు చెప్పి ఆ వ్యాసభగవానుని పుత్రుడు శుకుడు, అభిమన్యుడి పుత్రుడు అయిన పరీక్షిత్తుతో మళ్ళా ఇలా అన్నాడు. “పద్మమిత్రుడైన సూర్యుడి రాకను పద్మములకు ముందుగా తెలుపుతున్నాయేమో అన్నట్లు రాజహంసలు, సారసపక్షులు, చక్రవాకాలు మున్నగు నీటిపక్షులు చేస్తున్న కలధ్వనులనూ; మృదుమధురాలైన మంగళపాఠకుల సుస్వర పఠనాలనూ; మనోహరమైన మృదంగ, వేణు, వీణా రవాలనూ ఆలకించుతూ అరుణోదయ సమయాననే శ్రీకృష్ణుడు మేలుకొన్నాడు. చిదానంద స్వరూపుడు, పరమాత్మ, నాశ రహితుడు, వికార శూన్యుడు, తనకు ఇతరమైనది లేని వాడు, జయింపరాని వాడు, దేశ కాలాది పరిచ్ఛేద రహితుడు, అచ్యుతుడు, అమేయుడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు, మొదలు తుది లేని వాడు, పరబ్రహ్మస్వరూపము అయిన తనను తానే ధ్యానించుకుంటూ కన్నులు తెరచి శయ్యను దిగాడు. ఆయన కన్నులు తెరవగానే పగవారి కనుగలువలు ముకుళించాయి. భక్తుల కన్నులు అనే పద్మాలు వికసించాయి. పాపాలనే చీకట్లు పటాపంచలు అయ్యాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=636

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: