Friday, August 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౧(321)

( భూసురుని దౌత్యంబు )

10.2-652-క.
అభవుఁ డవయ్యును జగతిం
బ్రభవించుట లీల గాక భవమందుటయే
ప్రభువులకుం బ్రభుఁడవు మము
సభయాత్ముల నరసి కావఁ జను నార్తిహరా!
10.2-653-క.
కదనమున నీ భుజావలి
కెదిరింపఁగ లేక పాఱఁడే విక్రమ సం
పద సెడఁగ జరాసంధుఁడు
పదునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్.
10.2-654-వ.
ఇట్లు తనపడిన బన్నములం దలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు చందంబున మమ్ముం జెఱపట్టి బాధించుచున్న యప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధుల మగు మా నిర్బంధంబులు వాపి, సుత దార మిత్ర వర్గంబులం గూర్చి యనన్యశరణ్యులమైన మమ్ము రక్షింపు”మని విన్నవించి" రని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున.

భావము:
దుఃఖనాశకుడా! శ్రీకృష్ణా! పుట్టుకే లేని నీవు దేవాధిదేవుడవు ఇలా లోకంలో అవతరించడం మావంటి భయపీడితులను రక్షించుటకే కదా. ఆ జరాసంధుడు నీ భుజపరాక్రమాన్ని ఎదిరించ లేక రాజులంతా నవ్వుతుండగా పదునెనిమిదిసార్లు యుద్ధరంగం నుండి పారిపోయాడు కదా. అయినా, వాడు తాను పడిన కష్టాలను నష్టాలను గుర్తు పెట్టుకోడంలేదు. మదపుటేనుగులను అరికట్టి విఱ్ఱవీగే సింహంలా మమ్మల్ని చెరపట్టి మిడిసిపడుతున్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మా నిర్బంధాలను విడిపించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేలా అనుగ్రహించి, మరో దిక్కులేని మమ్మల్ని కాపాడు” అని ఆ రాజులందరూ నీకు విన్నవించమన్నారు” అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో విజ్ఞాన విశారదుడైన నారదుడు అచ్చటికి వేంచేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=52&Padyam=654

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: