Tuesday, August 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౫(305)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-602-సీ.
పటికంపుఁ గంబముల్‌ పవడంపుఁ బట్టెలు-
  మరకత రచితముల్‌ మదురు లమర
వైడూర్యమణిగణవలభులఁ బద్మరా-
  గంబుల మొగడుల కాంతు లొలయ
సజ్ఞాతివజ్ర లసజ్జాల రుచులతో-
  భాసిల్లు నీలసోపానములును
గరుడపచ్చల విటంకములును ఘనరుచి-
  వెలసిన శశికాంత వేదికలును
10.2-602.1-తే.
వఱలు మౌక్తికఘటిత కవాటములును
బ్రవిమలస్వర్ణమయ సాలభంజికలును
మించు కలరవ మెసఁగఁ గ్రీడించు మిథున
లీలనొప్పు కపోతపాలికలుఁ గలిగి.
10.2-603-తే.
చేటికానీకపద తులాకోటిమధుర
నినదభరితమై రుచిరమాణిక్య దీప
మాలికయుఁ గల్గి చూపట్టఁ గ్రాలు నొక్క
జలజలోచన నిజసౌధతలము నందు.
10.2-604-తే.
కనక కంకణ ఝణఝణత్కార కలిత
చంద్రబింబాననా హస్తజలజ ఘటిత
చామరోద్ధూత మారుత చలిత చికుర
పల్లవునిఁ గృష్ణు వల్లవీ వల్లవునిని.

భావము:
స్ఫటికపు స్తంభములు, పగడాల పట్టెలు, మరకత మణుల కప్పులు, శోభిల్లగా వైఢూర్యాల ముంజూరులు, వజ్రాల కిటికీలు కాంతులీనగా; పద్మరాగాల నడికొప్పులూ, నీలాల సోపానాలు విలసిల్లగా; చంద్రకాంత వేదికలు గరుడపచ్చల గువ్వగూండ్లు ప్రకాశింపగా; ఆణిముత్యాలు కూర్చిన తలుపులు, సువర్ణమయ సాలభంజికలు, పావురాల జంటల కువకువలతో కూడిన గూళ్ళు కలిగిన ద్వారకానగరాన్ని నారదుడు దర్శించాడు. చెలికత్తెల కాలిఅందెల మధుర ధ్వనులతో నిండి మంజుల మాణిక్యదీప మాలికలతో వెలుగొందే ఒక అందకత్తె సౌధంలో బంగారు కంకణాలు గలగలలాడుతు ఉండగా, సుందరీమణులు వీస్తున్న వింజామరల గాలికి కదులుతున్న ముంగురులు కల గోపికావల్లభుడు, నల్లనయ్యను నారదుడు చూసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=604

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: