10.2-626-క.
జలజభవసుతుఁడు గనె నొక
నలినాక్షినివాసమందు నతభద్రేభున్
జలదాభున్ గతలోభు
న్నలకాళిజితద్విరేఫు నంబుజనాభున్.
10.2-627-మ.
ఒకయింటం గజవాజిరోహకుఁడునై యొక్కింట భుంజానుఁడై
సకలాత్ముండు పరుండు షోడశసహస్రస్త్రీనివాసంబులం
దొక బోటింటను దప్పకుండ నిజమాయోత్సాహుఁడై యుండ న
య్యకలంకున్వరదున్, మహాపురుషు, బ్రహ్మణ్యున్నతాబ్జాసనున్,
10.2-628-క.
అస్తోకచరితు, నమిత స
మస్త సుధాహారు వేద మస్తకతల వి
న్యస్త పదాంబుజయుగళు, న
పాస్తశ్రితనిఖిలపాపుఁ, బరము, ననంతున్.
భావము:
ఆ బ్రహ్మపుత్రుడైన నారదుడు ఒక పద్మాక్షి గృహంలో గజేంద్రపాలకుడిని, నీలమేఘ శ్యాముడిని, లోభ రహితుడిని, పద్మనాభుడిని, శ్రీకృష్ణుడిని తిలకించాడు. మహాపురుషుడైన శ్రీకృష్ణుడు పదహారువేల స్త్రీల నివాసాలలోనూ ఏ స్త్రీ ఇంటిని వదిలిపెట్టకుండా, ప్రతి ఇంట తన మాయా ప్రభావంతో తానే ఉంటూ; ఒక ఇంటిలో ఏనుగులపై గుఱ్ఱాలపై స్వారీచేస్తున్నాడు. ఒక ఇంటిలో భోజనం చేస్తున్నాడు. ఇంకొక ఇంటిలో నిద్రిస్తున్నాడు. ఇలా ఉన్న నిర్మలుడూ, కోరిన వరాలను అనుగ్రహించే వాడూ, బ్రాహ్మణ్యుడూ అయిన ఆ కృష్ణపరమాత్మను నారదుడు దర్శించాడు. ఉదాత్త చరిత్రుడు; వేదాంతముల యందు ప్రతిపాదింపబడిన ఆది మూలమైన వాడు; దేవతలు అందరకు ఆరాధ్యుడు; ఆశ్రితుల పాపాలను పోగొట్టే వాడు; అనంతుడు అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=628
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment