10.2-629-ఆ.
పరమభాగవతుఁడు పరమేష్ఠితనయుండు
మనుజలీలఁ జెంది మహితసౌఖ్య
చిత్తుఁడైన యా హృషీకేశు యోగమా
యాప్రభావమునకు నాత్మ నలరి.
10.2-630-క.
"మాయురె? హరిహరి! వరద! య
మేయగుణా!" యనుచు నాత్మ మెచ్చి మునీంద్రుం
డా యదునాయకు సుజన వి
ధేయుని కిట్లనియె దేవ! త్రిజగములందున్.
10.2-631-క.
"నీ మాయఁ దెలియువారలె
తామరసాసన సురేంద్ర తాపసు లైనన్
ధీమంతులు నీ భక్తిసు
ధామాధుర్యమునఁ బొదలు ధన్యులు దక్కన్. "
భావము:
పరమ భాగవతోత్తముడు, బ్రహ్మ మానసపుత్రుడు అయిన నారదుడు మానవ రూపుడు అయి సామాన్య మానువుని వలె భౌతిక సౌఖ్యాలలో తేలియాడుతున్న ఆ సర్వేంద్రియములకు ఈశ్వరుడు అయిన శ్రీకృష్ణభగవానుడి యోగమాయా ప్రభావాన్ని పరీక్షించి చూసి చాలా సంతోషించి నారదుడు తన మనసులో “ఆహా! హరీహరీ! సుప్రసన్నా! ఉన్నత గుణ సుసంపన్నా!” అంటూ మెచ్చుకుంటూ కృష్ణుడితో ఇలా అన్నాడు. “నీ భక్తి అనే అమృతములోని తీయదనములో తేలియాడుతుండే పుణ్యాత్ములు మాత్రమే నీ తత్వాన్ని తెలుసుకోగలరు. అంతే తప్ప, ముల్లోకాలలో బ్రహ్మేంద్రాది దేవతలూ మహర్షులూ సహితంగా ఇతరులు నీ మాయను తెలుసుకోలేరు.”
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=631
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment