10.2-623-క.
చతురానననందనుఁ డం
చితమతిఁ జని కాంచె నొక్క చెలిగేహమునం
గ్రతుకర్మాచరణుని నా
శ్రితభయహరణున్ సురేంద్రసేవితచరణున్.
10.2-624-క.
వృత్రారినుతునిఁ బరమ ప
విత్రుని నారదుఁడు గాంచె వేఱొక యింటం
బుత్రక పౌత్త్రక దుహితృ క
ళత్రసమేతుని ననంతు లక్షణవంతున్.
10.2-625-క.
సుందరమగు నొక సుందరి
మందిరమునఁ బద్మభవకుమారుఁడు గాంచెన్
నందితనందున్ సుజనా
నందున్ గోవిందు నతసనందు ముకుందున్.
భావము:
బ్రహ్మదేవుడి కుమారుడైన నారదుడు యజ్ఞకర్మలు ఆచరిస్తున్న వాడూ, ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడూ, దేవేంద్రుడి చేత పూజింపబడే పాదాలు కలవాడూ అయిన కృష్ణుడిని ఒక ఇష్టసఖి ఇంటిలో చూసాడు. మరో మందిరంలో దేవేంద్రుడి చేత స్తుతింపబడే వాడూ పరమ పవిత్రుడూ నందుడి కుమారుడూ అయిన కృష్ణుడిని కొడుకులూ, మనుమళ్ళూ, కూతుళ్ళూ, భార్యలు మున్నగు వారితో కలసి (సామాన్య గృహస్థు వలె) ఉండగా దర్శించాడు. ఒక అందగత్తె అందమైన ఇంటిలో సజ్జనుల చేత కీర్తించబడేవాడూ, సనకసనందాదుల వందనాలు అందుకునేవాడూ, అయిన గోవిందుడిని బ్రహ్మదేవుడి పుత్రుడైన నారదుడు దర్శించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=625
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment