Saturday, February 1, 2020

దక్ష యాగము - 23


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-87-సీ.
"అనయంబు శివ యను నక్షరద్వయ మర్థి;
వాక్కునఁ బలుక భావమునఁ దలఁప
సర్వజీవుల పాపసంఘముల్ చెడు; నట్టి;
మహితాత్మునందు నమంగళుండ
వగు నీవు విద్వేషి వగుట కాశ్చర్యంబు;
నందెద; వినుము; నీ వదియుఁ గాక
చర్చింప నెవ్వని చరణపద్మంబుల;
నరసి బ్రహ్మానంద మను మరంద
4-87.1-తే.
మతుల భక్తిని దమ హృదయంబు లనెడి
తుమ్మెదలచేతఁ గ్రోలి సంతుష్టచిత్తు
లగుదు రత్యంత విజ్ఞాను; లట్టి దేవు
నందు ద్రోహంబు చేసి; తే మందు నిన్ను?
4-88-క.
మఱియును నమ్మహితాత్ముని
చరణ సరోజాత యుగము సకలజగంబుల్
నెఱిఁ గొలువఁ గోరు కోర్కులు
దరమిడి వర్షించు నతనిఁ దగునే తెగడన్?
4-89-చ.
పరగఁ జితాస్థిభస్మ నృకపాలజటాధరుఁడుం బరేత భూ
చరుఁడు పిశాచయుక్తుఁ డని శర్వు నమంగళుగాఁ దలంప రె
వ్వరు; నొకఁ డీవు దక్క, మఱి వాక్పతి ముఖ్యులు నమ్మహాత్ము స
చ్చరణ సరోజ రేణువులు సమ్మతిఁ దాల్తురు మస్తకంబులన్.


భావము:
ఎల్లప్పుడూ శివ అనే రెండక్షరాలను ఆసక్తితో నోటితో పలికినా, మనస్సులో తలచినా సమస్త ప్రాణుల పాపలన్నీ నశిస్తాయి. అటువంటి మహాత్ముని అమంగళుడవైన నీవు ద్వేషించడం చూచి ఆశ్చర్యాన్ని పొందుతున్నాను. తండ్రీ! విను. గొప్ప విజ్ఞానులు అయినవారు ఏ దేవుని పాదారవిందాలను ధ్యానిస్తూ బ్రహ్మానందమనే మకరందాన్ని తమ మనస్సులనే తుమ్మెదల ద్వారా భక్తిపారవశ్యంతో గ్రోలి తృప్తిపొందుతారో అటువంటి దేవునికి ద్రోహం చేశావు. నిన్నేమనాలి? అంతేకాక ఆ మహాత్ముని పాదపద్మాలు లోకాలన్నీ కొలివగా కోరిన కోర్మెలన్నింటినీ కురిపిస్తుండగా అతన్ని నిదించడం న్యాయమా? చితిలోని ఎముకలను, బూడిదను, మానవకపాలాన్ని ధరించి, పిశాచాలతో కూడి శ్మశానంలో తిరిగినా శివుణ్ణి నీవు తప్ప మరెవ్వరూ అమంగళుడని భావించరు. బ్రహ్మ మొదలైనవారు ఆ మహాత్ముని పాదధూళిని తమ శిరస్సులపై సంతోషంతో ధరిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=89

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: