(శివుడనుగ్రహించుట )
4-139-వ.
మఱియును.
4-140-సీ.
అంచిత వామపాదాంభోరుహము దక్షి;
ణోరుతలంబున నొయ్య నునిచి
సవ్యజానువుమీఁద భవ్యబాహువు సాఁచి;
వలపలి ముంజేత సలలితాక్ష
మాలిక ధరియించి మహనీయ తర్కము;
ద్రాయుక్తుఁ డగుచుఁ జిత్తంబులోన
నవ్యయం బయిన బ్రహ్మానందకలిత స;
మాధి నిష్ఠుఁడు వీతమత్సరుండు
4-140.1-తే.
యోగపట్టాభిరాముఁడై యుచిత వృత్తి
రోషసంగతిఁ బాసి కూర్చున్న జముని
యనువునను దర్భరచిత బ్రుస్యాసనమున
నున్న మునిముఖ్యు నంచిత యోగనిరతు.
4-141-క.
అలఘుని నభవుని యోగీం
ద్రులు వినుచుండంగ నారదునితోఁ బ్రియ భా
షలు జరుపుచున్న రుద్రుని
సలలిత పన్నగ విభూషు సజ్జనపోషున్.
4-142-క.
కని లోకపాలురును ముని
జనులును సద్భక్తి నతని చరణంబులకున్
వినతు లయి, రప్పు డబ్జా
సనుఁ గని యయ్యభవుఁ డధిక సంభ్రమ మొప్పన్.
భావము:
ఇంకా ఆ మహేశ్వరుడు కుడితొడపై ఎడమకాలును మోపి, ఎడమ మోకాలిపై ఎడమచేతిని చాచి కూర్చున్నాడు. కుడి ముంజేతిలో జపమాలను ధరించాడు. మహనీయమైన ధ్యానముద్రను ధరించి బ్రహ్మానందంతో నిండిన మనస్సు కలవాడై సమాధి నిష్ఠలో ఉన్నాడు. అతడు మాత్సర్యం లేనివాడు. యోగపట్టంతో ఒప్పుతూ కోపం విడిచిపెట్టి కూర్చున్న యమునివలె దర్భాసనం మీద యోగనిమగ్నుడై ఉన్నాడు. ఆఢ్యుడు, అభవుడు, నాగభూషణుడు, సజ్జన పోషకుడు, యోగీంద్రులు వింటూ ఉండగా నారదునితో ఇష్టసంభాషణం చేస్తున్న ఆ శివుణ్ణి లోకపాలకులూ, మునులూ సద్భక్తితో అతని పాదాలకు నమస్కరించారు. అప్పుడు బ్రహ్మను చూచి ఆ శివుడు సంభ్రమంతో…
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=140
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment