(శివుడనుగ్రహించుట )
4-133-ఉ.
భాసురలీలఁ గాంచిరి సుపర్వులు భక్తజనైక మానసో
ల్లాసముఁ గిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా
వాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూవికాసి కై
లాసముఁ గాంతి నిర్జిత కులక్షితిభృత్సుమహద్విభాసమున్.
4-134-సీ.
ధాతు విచిత్రితోదాత్త రత్నప్రభా;
సంగ తోజ్జ్వల తుంగ శృంగములును;
గిన్నర గంధర్వ కింపురుషాప్సరో;
జన నికరాకీర్ణ సానువులును;
మానిత నిఖిల వైమానిక మిథున స;
ద్విహరణైక శుభ ప్రదేశములును;
గమనీయ నవమల్లికా సుమనోవల్లి;
కామతల్లీ లసత్కందరములు;
4-134.1-తే.
నమర సిద్ధాంగనా శోభితాశ్రమములు;
విబుధజన యోగ్య సంపన్నివేశములును
గలిగి బహువిధ పుణ్యభోగముల నొప్పు
వినుత సుకృతములకు దండ వెండికొండ.
భావము:
ఆ విధంగా వెళ్ళిన దేవతలు భక్తుల మనస్సులకు అమితమైన ఆనందాన్ని కలిగించేదీ, కిన్నరస్త్రీలు విలాసంగా విహరించేదీ, శాశ్వతాలైన ఐశ్వర్యాలకూ శుభాలకూ స్థానమైనదీ, సిద్ధులూ యక్షులూ నివసించేదీ, వెండి వెలుగులతో నిండినదీ, తన అనంతకాంతులతో కులపర్వతాల శోభావైభవాన్ని పరాభూతం చేసేదీ అయిన కైలాస పర్వతాన్ని కనులపండువుగా దర్శించారు. ధాతుద్రవాలతో పలురంగులు కలిగిన రతనాల కాంతులతో ఆ వెండికొండ ఎత్తైన శిఖరాలు ప్రకాశిస్తున్నాయి. ఆ కొండచరియలు కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అప్సరసలు మున్నగువారితో నిండి ఉన్నాయి. దేవతలు తమ భార్యలతో కూడి విమానాలపై ఆయా ప్రదేశాలలో విహరిస్తున్నారు. గుహలచుట్టూ చిక్కని విరజాజి పూలతీగలు అల్లుకొని ఉన్నాయి. అక్కడి ఆశ్రమాలలో దేవతాస్త్రీలు, సిద్ధస్త్రీలు ఉంటున్నారు. దేవతలు సంచరించటానికి అక్కడి చోట్లన్నీ తగి ఉన్నాయి. చేసిన పుణ్యాలకు పెక్కురకాల భోగాలను అక్కడ అనుభవిస్తున్నారు. ఆ వెండికొండ పుణ్యాల పూలదండగా ఉన్నది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=134
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment