( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )
4-97-సీ.
వరుసఁ బ్రాణాపాన వాయునిరోధంబు;
గావించి వాని నేకముగ నాభి
తలమునఁ గూర్చి యంతట నుదానము దాఁక;
నెగయించి బుద్ధితో హృదయపద్మ
మున నిల్పి వాని మెల్లన కంఠమార్గము;
నను మఱి భ్రూమధ్యమున వసింపఁ
జేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే;
నాథునిఁ దక్క నన్యంబుఁ జూడ
4-97.1-తే.
కమ్మహాత్ముని యంక పీఠమ్మునందు
నాదరంబున నుండు దేహంబు దక్షు
వలని దోషంబునను విడువంగఁ దలఁచి
తాల్చెఁ దనువున ననిలాగ్ని ధారణములు.
4-98-వ.
ఇట్లు ధరియించి గతకల్మషంబైన దేహంబు గల సతీదేవి నిజయోగ సమాధి జనితం బయిన వహ్నిచేఁ దత్క్షణంబ దగ్ధ యయ్యె; అంత.
4-99-క.
అది గనుఁగొని "హాహా"ధ్వని
వొదలఁగ నిట్లనిరి మానవులుఁ ద్రిదశులు "నీ
మదిరాక్షి యకట దేహము
వదలెఁ గదా! దక్షుతోడి వైరము కతనన్."
4-100-వ.
మఱియు నిట్లనిరి.
భావము:
ప్రాణాపానాలనబడే వాయువులను నిరోధించి, వాటి నొక్కటిగా చేసి బొడ్డుతో కలిపి, ఉదానస్థానం వరకు ఎక్కించి, బుద్ధిపూర్వకంగా హృదయపద్మంలో నిలిపి, మెల్లగా కంఠమార్గంలో భ్రూమధ్య భాగానికి చేర్చి, మనస్సులో శివుని పాదపద్యాలను ధ్యానిస్తూ అతన్ని తప్ప ఇతరములైనవేవీ చూడక అతని ఒడిలో ఆదరంతో ఉండే దేహాన్ని దక్షుని కారణంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకొని, యోగాగ్నిని రగుల్కొల్పింది. ఈ విధంగా దోషాలను పోగొట్టుకొన్న దేహం కలిగిన ఆ సతీదేవి తన యోగసమాధి నుండి పుట్టిన అగ్నిచేత వెంటనే కాలిపోయింది. అప్పుడు అది చూచి అక్కడి మానవులు, దేవతలు హాహాకారాలు చేస్తూ “అయ్యో! ఈ సతీదేవి దక్షునిమీది కోపంతో తన శరీరాన్ని విడిచిపట్టినది కదా!” అన్నారు. ఇంకా ఇలా అన్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=97
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment