(దక్షాధ్వర ధ్వంసము )
4-118-వ.
అని యి వ్విధంబున భయవిహ్వలలోచనలై పలుకుచున్న సమయంబున మహాత్ముండైన దక్షునకు భయావహంబులై సహస్ర సంఖ్యాతంబు లైన మహోత్పాతంబులు భూనభోంతరంబులఁ గానంబడుచుండె; ఆ సమయంబున రుద్రానుచరులు నానావిధాయుధంబులు ధరియించి కపిల పీత వర్ణంబులు గలిగి వామనాకారులు, మకరోదరాననులు నై యజ్ఞశాలాప్రదేశంబునం బరువులుపెట్టుచుఁ గదియం జనుదెంచి దక్షాధ్వర వాటంబులు విటతాటంబులు చేయుచుం, గొందఱు ప్రాగ్వంశంబును, గొందఱు పత్నీశాలయు, కొందఱు సదస్య శాలయుఁ, గొంద ఱాగ్నీధ్ర శాలయు, కొందఱు యజమాన శాలయుఁ, గొందఱు మహానస గృహంబును విధ్వంసంబులు గావించిరి; మఱియుఁ గొందఱు యజ్ఞపాత్రంబుల నగ్నులం జెఱచిరి; వెండియుఁ గొందఱు హోమాగ్ను లార్చిరి; పదంపడి కొందఱు హోమకుండంబుల యందు మూత్రంబులు విడిచిరి; కొంద ఱుత్తరవేదికా మేఖలలు ద్రెంచిరి; కొందఱు మునుల బాధించిరి; కొందఱు తత్పత్నుల వెఱపించిరి; మఱికొందఱు దేవతా నిరోధంబుఁ గావించిరి; అంత మణిమంతుండు భృగువును, వీరభద్రుండు దక్షునిఁ, జండీశుండు పూషుని, భగుని నందీశ్వరుండును బట్టిరి; ఇవ్విధంబున సదస్య దేవ ఋత్విఙ్నికాయంబుల శిలల ఱువ్వియు, జానువులఁ బొడిచియు, నఱచేతుల నడచియు, గుల్ఫంబులఁ బొడిచియు వివిధ బాధలు పఱచిన వారు కాందిశీకు లై యెక్కడెక్క డేనిం జనిరి; మఱియును.
4-119-క.
మును దక్షుఁ డభవుఁ బలుకఁ "గఁ
గను గీఁటిన" భగునిఁ బట్టి కన్నులు పెకలిం
చెను నందీశ్వరుఁ; డచ్చటి
జనములు హాహారవముల సందడి గొలుపన్.
భావము:
అని ఈ విధంగా భయంతో వెఱ్ఱిచూపులు చూస్తూ పలుకుతుండగా గొప్పవాడైన దక్షునకు భయాన్ని కలిగిస్తూ వేలకొలది అపశకునాలు భూమిపైనా ఆకాశంలోనూ కనిపించసాగాయి. ఆ సమయంలో గోరోజనం వంటి రంగు కలవారు, పసుపుపచ్చని రంగు కలవారు, పొట్టివారు, మొసలిపొట్ట వంటి ముఖాలు కలవారు అయిన ప్రమథగణాలు రకరకాలైన ఆయుధాలను ధరించి పరుగున వచ్చి దక్షుని యజ్ఞశాలను సమీపించి, యజ్ఞవాటికలను చెల్లాచెదరు చేశారు. కొందరు ప్రాగ్వంశాన్ని (యజ్ఞశాల ప్రాంత గృహాన్ని), కొందరు పత్నీశాలను (యజ్ఞ యజమాని భార్య ఉండే శాలను), కొందరు సదస్యశాలను (సభాస్థలి శాలను), కొందరు అగ్నీధ్రశాలను (అగ్నిని ధరంచే ఋత్విక్కుల శాలను), కొందరు యజమానశాలను (యజ్ఞ యజమాని అయిన దక్షుని శాలను), కొందరు వంటశాలను నాశనం చేశారు. మరికొందరు యజ్ఞపాత్రలను, అగ్నిగుండాలను ధ్వంసం చేశారు. ఇంకా కొందరు హోమాగ్నులను ఆర్పివేశారు. ఆ తరువాత కొందరు హోమకుండాలలో మూత్రవిసర్జన చేశారు. కొందరు ఉత్తర దిక్కున ఉన్న వేదిక యొక్క తోరణాలను త్రెంచివేశారు. కొందరు మునులను బాధించారు. కొందరు వారి భార్యలను భయపెట్టారు. మరికొందరు దేవతలను అడ్డుకున్నారు. అప్పుడు మణిమంతుడు భృగువును, వీరభద్రుడు దక్షుని, చండీశుడు పూషుని, నందీశ్వరుడు భగుని పట్టుకొన్నారు. ఈ విధంగా సదస్యులైన దేవతల, ఋత్విక్కుల సమూహాన్ని రాళ్ళతో కొట్టి, మోకాళ్ళతో పొడిచి రకరకాల బాధలు పెట్టగా వాళ్ళంతా కాందిశీకులై ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. పూర్వం దక్షుడు శివుని నిందించినప్పుడు కన్ను గీటిన భృగుని పట్టుకొని నందీశ్వరుడు అక్కడి జనం హాహాకారాలు చేస్తుండగా అతని కన్నులను పెకలించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=118
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment