Wednesday, February 12, 2020

దక్ష యాగము - 31


(దక్షాధ్వర ధ్వంసము )

4-112-చ.
సరభసవృత్తి నట్లరుగు సైన్యపదాహత ధూత ధూళి ధూ
సరిత కుబేరదిక్తటము సభ్యులు దక్షుఁడుఁ జూచి "యెట్టి భీ
కర తమ" మం చనం "దమముగాదు, రజఃపటలం" బటంచు ని
వ్వెఱపడి పల్కి రాత్మల వివేకవిహీనతఁ బొంది వెండియున్.
4-113-సీ.
ఈ ధూళి పుట్టుట కెయ్యది హేతువో? ;
విలయ సమీరమా? పొలయ దిపుడు;
ప్రాచీనబర్హి ధరాపతి మహితోగ్ర;
శాసనుఁ డిపుడు రాజ్యంబు సేయఁ
జోర సంఘములకో రారాదు; మఱి గోగ;
ణాళి రాకకు సమయంబు గాదు;
కావున నిప్పుడు కల్పావసానంబు;
గాఁబోలుఁ; గా దటు గాక యున్న
4-113.1-తే.
నిట్టి యౌత్పాతిక రజ మెందేనిఁ గలదె?'
యనుచు మనముల భయమంది రచటి జనులు
సురలు దక్షుఁడు; నంతఁ బ్రసూతి ముఖ్యు
లయిన భూసురకాంత లిట్లనిరి మఱియు.
4-114-క.
"తన కూఁతులు సూడఁగ నిజ
తనయను సతి ననపరాధఁ దగవఱి యిట్లె
గ్గొనరించిన యీ దక్షుని
ఘనపాప విపాక మిదియుఁ గాఁదగు ననుచున్."


భావము:
మహావేగంగా వస్తున్న వీరభద్రుని సైన్యం కాళ్ళ తొక్కిళ్ళచేత రేగిన ధూళికి కమ్మిన ఉత్తరపు దిక్కును, యజ్ఞశాలలోని సభ్యులూ, దక్షుడూ చూసారు; “అబ్బా! ఎంత భయంకరమైన కారుచీకటో” అని అనుకున్నారు; మళ్ళీ “కారుచీకటి కాదు, రేగిన దుమ్ము” అనుకుంటూ భయపడ్డారు; వివేకం కోల్పోయారు; ఇంకా ఇలా అనుకోసాగారు. “ఈ దుమ్ము పుట్టడానికి కారణమేమిటి? ప్రళయ వాయువులా? కాని ఇది ప్రళయకాలం కాదు. చండశాసనుడైన ప్రాచీనబర్హి రాజ్యం చేస్తున్నందున దొంగలగుంపు వచ్చే అవకాశం లేదు. ఆవుల మంద వచ్చే సాయంకాల సమయం కాదు. ఇది కల్పాంతమే కావచ్చు. కాకుంటే ఉత్పాతాన్ని సూచించే ఇంతటి ధూళి ఎలా వస్తుంది?” అని అక్కడి జనులు, దేవతలు, దక్షుడు తమ మనస్సులలో భయపడ్డారు. అప్పుడు ప్రసూతి మొదలైన బ్రాహ్మణస్త్రీలు ఇలా అన్నారు. “ఈ విధంగా తన కుమార్తెలు చూస్తుండగా ఏ అపరాధమూ ఎరుగని తన కూతురు సతీదేవిని అన్యాయంగా అవమానించిన ఈ దక్షుని మహాపాపానికి ఫలితం ఈ ధూళి అయి ఉంటుంది” అంటూ...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=113

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: