Saturday, February 22, 2020

దక్ష యాగము - 39

(శివుడనుగ్రహించుట )
4-135-వ.
అది మఱియును, మందార పారిజాత సరళ తమాల సాల తాల తక్కోల కోవిదార శిరీ షార్జున చూత కదంబ నీప నాగ పున్నాగ చంపక పాట లాశోక వకుళ కుంద కురవక కన కామ్ర శతపత్ర కింశు కైలా లవంగ మాలతీ మధూక మల్లికా పనస మాధవీ కుట జోదుంబు రాశ్వత్థ ప్లక్ష వట హింగుళ భూర్జ పూగ జంబూ ఖర్జూ రామ్రాతక ప్రియాళు నారికే ళేంగుద వేణు కీచక ముఖర తరు శోభితంబును, కలకంఠ కాలకంఠ కలవింక రాజకీర మత్తమధుకర నానా విహంగ కోలాహల నినద బధిరీభూత రోదోంతరాళంబును, సింహ తరక్షు శల్య గవయ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్ర కుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ వన్యసత్త్వ సమాశ్రయ విరాజితంబును, కదళీషండ మండిత కమల కహ్లార కైరవ కలిత పులినతల లలిత కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జలకుక్కుటాది జలవిహంగకుల కూజిత సంకులంబును, సలిలకేళీవిహరమాణ సతీరమణీ రమణీయ కుచమండల విలిప్త మృగమద మిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగాతరంగణీ సమావృతంబును నైన కైలాసపర్వతంబు వొడగని, యరవిందసంభవ పురందరాది దేవగణంబు లత్యద్భుతానందంబులం బొంది ముందటఁ దార హీర హేమమయ విమాన సంకులంబును, పుణ్యజన మానినీ శోభితంబును నైన యలకాపురంబు గడచి; తత్పుర బాహ్యప్రదేశంబునం దీర్థపాదుండైన పుండరీకాక్షు పాదారవిందరజః పావనంబును, రతికేళీ వ్యాసంగ పరిశ్రమ నివారక సలిల కేళీవిలోల దేవకామినీ పీనవక్షోజ విలిప్త కుంకుమపంక సంగత పిశంగవర్ణ వారిపూర విలసితంబు నునై; నందాలకనందాభిధానంబులు గల నదీ ద్వితయంబు దాఁటి తత్పురోభాగంబున వనగజ సంఘృష్ట మలయజ పరిమిళిత మలయపవ నాస్వాదన ముహుర్ముహురు న్ముదిత మానస పుణ్యజనకామినీ కదంబంబును, వైదూర్య సోపాన సమంచిత కనకోత్పల వాపీ విభాసితంబును, గింపురుష సంచార యోగ్యంబును నగు సౌగంధిక వన సమీపంబు నందు.

భావము:
ఇంకా ఆ వెండికొండ మందారం, పారిజాతం, తెల్లతెగడ, కానుగు, మద్ది, తాడి, తక్కోలం, ఎఱ్ఱకాంచనం, దిరిసెనం, తెల్లమద్ది, తియ్యమామిడి, కడిమి, మంకెన, నాగవల్లి, సురపొన్న, సంపెంగ, కలిగొట్టు, అశోకం, పొగడ, మొల్ల, ఎఱ్ఱగోరింట, కనకాంబరం, తామర, మోదుగ, ఏలకి, లవంగం, జాజి, ఇప్ప, మల్లె, పనస, పూల గురివెంద, కొండమల్లె, మేడి, రావి, జువ్వి, మఱ్ఱి, ఇంగువ, బుజపత్తిరి, పోక, రాజపూగం, నేరేడు, ఖర్జూరం, ఆమ్రాతకం, మోరటి, కొబ్బరి, అందుగ, గారవెదురు, బొంగువెదురు మొదలైన చెట్లతో శోభిల్లుతున్నది. కోయిలలు, నెమళ్ళు, పావురములు, రామచిలుకలు, గండుతుమ్మెదలు, మొదలైన రకరకాల పక్షుల కలకలంతో భూమ్యాకాశాల మధ్యప్రదేశం ప్రతిధ్వనిస్తున్నది. సింహాలు, సివంగులు, ముళ్ళపందులు, అడవిదున్నలు, శరభమృగాలు, కోతులు, అడవిపందులు, పెద్దపులులు, కుక్కలు, నల్లచారల దుప్పులు, ఎనుబోతులు, తోడేళ్ళు, లేళ్ళు మొదలైన గొప్ప అడవి జంతువులకు ఆశ్రయంగా ఉన్నది. అరటితోపులతోను, తామరపూలతోను, తెల్లకలువలతోను, ఎఱ్ఱకలువలతోను కూడిన ఇసుక ప్రదేశాలతో అందంగా ఉన్న సరోవరాలలో విహరిస్తున్న రాజహంసలు, కొక్కిరాళ్ళు, బెగ్గురుపక్షులు, జక్కవలు, కొంగలు, నీటికోళ్ళు మొదలైన నీటిపక్షుల కూతలతో కలకలంగా ఉంది. జలక్రీడలతో విహరిస్తున్న అందమైన స్త్రీల చనుదోయికి అలదుకొన్న కస్తూరి కలిపిన మంచిగంధపు సువాసనలు కలిగిన గంగానది చేత ఆవరింపబడి ఉన్నది. అటువంటి కైలాసపర్వతాన్ని చూచి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొంది, ఎదురుగా అలకాపురాన్ని చూచారు. అది చుక్కలతో, మంచుతో, బంగారంతో కూడిన విమానాలతో, పుణ్యస్త్రీ సమూహంతో శోభిల్లుతున్నది. ఆ నగరం వెలుపల పూజ్యపాదుడైన విష్ణువు యొక్క పాదపద్మాల ధూళిచేత పవిత్రమై, రతికేళిచేత కలిగిన శ్రమను తొలగించే జలక్రీడలో మునిగిన దేవతాస్త్రీల ఎత్తైన స్తనాలకు అలదుకున్న కుంకుమతో కూడిన గోరోజనం రంగును పొందిన నంద, అలకనంద అనే రెండు నదులున్నాయి. వాటిని దాటి ఎదుట సౌగంధికవనాన్ని చూశారు. ఆ వనంలో ఏనుగులు రాచుకొనడం వల్ల మంచి గంధపుచెట్లనుండి వెలువడే సువాసనలతో కలిసిన గాలిని ఆస్వాదిస్తూ యక్షకన్యలు మాటిమాటికి సంతోషిస్తున్నారు. పచ్చలు పొదిగిన మెట్లు కల దిగుడు బావుల్లో బంగారు కలువలు ప్రకాశిస్తున్నాయి. కింపురుషులు సంచరించడానికి అనువైన ఆ సౌగంధికవనంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=135

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: