Saturday, February 22, 2020

దక్ష యాగము - 40


(శివుడనుగ్రహించుట )

4-136-సీ.
ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడ;
వునుఁ బంచసప్తతి యోజనముల
పఱపును గల్గి యే పట్టునఁ దఱుగని;
నీడ శోభిల్ల నిర్ణీత మగుచుఁ
బర్ణశాఖా సమాకీర్ణమై మాణిక్య;
ములఁ బోలఁగల ఫలములఁ దనర్చి
కమనీయ సిద్ధయోగక్రియామయ మయి;
యనఘ ముముక్షు జనాశ్రయంబు
4-136.1-తే.
భూరిసంసార తాప నివారకంబు
నగుచుఁ దరురాజ మనఁగఁ బెంపగ్గలించి
భక్తజనులకు నిచ్చలుఁ బ్రమద మెసఁగ
వలయు సంపద లందు నావటము వటము.
4-137-వ.
ఆ వృక్షమూలతలంబున.
4-138-సీ.
ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు;
శాంతవిగ్రహుని వాత్సల్యగుణునిఁ
గమనీయ లోకమంగళదాయకుని శివు;
విశ్వబంధుని జగద్వినుత యశుని
గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కు;
బేర సేవితుని దుర్వారబలుని
నుదిత విద్యాతపోయోగ యుక్తుని బాల;
చంద్రభూషణుని మునీంద్రనుతునిఁ
4-138.1-తే.
దాపసాభీష్టకరు భస్మదండలింగ
ఘనజటాజిన ధరుని భక్తప్రసన్ను
వితత సంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న
రక్తవర్ణు సనాతను బ్రహ్మమయుని.

భావము:
వందయోజనాల పొడవు, డెబ్బైయైదు యోజనాల వెడల్పు కలిగిన ఒక మర్రిచెట్టును దేవతలు చూచారు. ఆ చెట్టు నీడ సందులేకుండా అంతటా నిండి ఉంది. ఆ చెట్టు ఆకులతో, కొమ్మలతో అలరారుతూ మాణిక్యాలకు సాటివచ్చే పండ్లతో నిండి ఉన్నది. అది సిద్ధయోగ క్రియలకు ఆలవాలమై దోషరహితమై మోక్షం కోరేవారికి ఆశ్రయమై అలరారుతున్నది. అది సంసారతాపాన్ని తొలగిస్తుంది. ఆ మేటిమ్రాను భక్తులకు ఆనందం కలిగించే ఐశ్వర్యాలకు పుట్టినిల్లు. ఆ మఱ్ఱిచెట్టు క్రింద ప్రసిద్ధులైన సనందుడు మొదలైన సిద్ధులచేత సేవింపబడేవాడు, శాంతమూర్తి, దయాగుణం కలవాడు, లోకాలకు శుభాలను కలిగించేవాడు, శివుడు, విశ్వానికి బంధువైనవాడు, లోకాలు పొగడే కీర్తి కలవాడు, గుహ్యకులూ సాధ్యులూ రాక్షసులూ యక్షులకు రాజైన కుబేరుడూ మున్నగువారిచే సేవింపబడేవాడు, ఎదురులేని బలం కలవాడు, విద్యతో తపస్సుతో యోగంతో కూడినవాడు, నెలవంకను అలంకరించుకున్నవాడు, మునీంద్రులచేత స్తుతింపబడేవాడు, తాపసుల కోరికలను తీర్చేవాడు, విభూతినీ దండాన్నీ జడలనూ గజచర్మాన్నీ ధరించినవాడు, భక్తులను అనుగ్రహించేవాడు, సంధ్యాకాలంలోని మేఘాల కాంతిని పోలిన క్రొత్త ఎర్రని కాంతులతో వెలిగేవాడు, శాశ్వతుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శివుణ్ణి చూశారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=138

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: