(శివుడనుగ్రహించుట )
4-131-సీ.
పూని యే దేవుని బొమముడి మాత్రన;
లోకపాలకులును లోకములును
నాశ మొందుదు; రట్టి యీశుండు ఘన దురు;
క్త్యస్త్ర నికాయ విద్ధాంతరంగుఁ
డును బ్రియా విరహితుండును నైనవాఁ డమ్మ;
హాత్మునిఁ ద్రిపుర సంహారకరుని
మఖపునస్సంధానమతి నపేక్షించు మీ;
రలు చేరి శుద్ధాంతరంగు లగుచు
4-131.1-తే.
భక్తినిష్ఠలఁ దత్పాద పద్మ యుగళ
ఘన పరిగ్రహ పూర్వంబుగాఁగ నతని
శరణ మొందుఁ డతండు ప్రసన్నుఁ డయినఁ
దివిరి మీ కోర్కి సిద్ధించు దివిజులార!"
4-132-వ.
అని మఱియు నిట్లనియె;అద్దేవుని డాయం జన వెఱతు మని తలంపకుండు; అతనిఁ జేరు నుపాయం బెఱింగిపుమంటి రేని, నేను నింద్రుండును మునులును మీరలును మఱియు దేహధారు లెవ్వ రేని నమ్మహాత్ముని రూపంబు నతని బలపరాక్రమంబుల కొలఁదియు నెఱుంగజాలము; అతండు స్వతంత్రుండు గావునఁ దదుపాయం బెఱింగింప నెవ్వఁడు సమర్థుం డగు; అయిన నిపుడు భక్తపరాధీనుండును శరణాగత రక్షకుండు నగు నీశునిఁ జేరం బోవుదము;" అని పలికి పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులం గూడి కైలాసాభిముఖుఁ డై చనిచని.
భావము:
ఏ మహాదేవుడు కోపంతో కనుబొమలు ముడిస్తే లోకాలూ, లోకపాలకులూ నశిస్తారో ఆ మహనీయుని మనస్సు దక్షుని దురుక్తులు అనే బాణాలు గ్రుచ్చుకొని ఇదివరకే నొచ్చింది. ఇప్పుడు ఆ మహాత్మునికి భార్యావియోగం కూడా ప్రాప్తించింది. తిరిగి యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయాలనే కోరిక మీకు ఉన్నట్లయితే త్రిపుర సంహారుడైన ఆ హరుని, ఆ మహాదేవుని, ఆ మహానుభావుని నిండుహృదయంతో, నిర్మల భక్తితో ఆశ్రయించండి. ఆయన పాదపద్మాలపై బడి శరణు వేడండి. ఆ దయామయుడు దయ దలిస్తే మీ కోరిక నెరవేరుతుంది. ” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు “మేము ఆయనను సమీపించటానికి భయపడుతున్నాము అని భావించకండి. ఆయన దగ్గరకు పోయే ఉపాయం నన్ను చెప్పమంటారా? నేను, దేవేంద్రుడు, మునులు, మీరు, దేహధారులు ఎవరుకూడా ఆ మహాత్ముని స్వరూపాన్నీ, ఆయన బలపరాక్రమాల పరిమాణాన్నీ తెలుసుకోలేము. ఆయన సర్వస్వతంత్రుడు. కాబట్టి ఆయనను సమీపించే ఉపాయం చెప్పటానికి ఎవ్వరూ సమర్థులు కారు. అయినా ఆయన భక్తులకు అధీనుడు. శరణు జొచ్చిన వారిని రక్షించేవాడు. అందుచేత ఆయన వద్దకు మనం అందరం కలిసి వెళ్ళటం మంచిది” అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలను, పితృదేవతలను, ప్రజాపతులను వెంటబెట్టుకొని కైలాసానికి బయలుదేరి పోయి పోయి...
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=131
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment