Sunday, February 9, 2020

దక్ష యాగము - 28


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-103-క.
ఆ రవ మపు డీక్షించి మ
హారోషముతోడ భృగుమహాముని క్రతు సం
హారక మారక మగు ' నభి
చారకహోమం ' బొనర్చె సరభసవృత్తిన్.
4-104-వ.
ఇట్లు దక్షిణాగ్ని యందు వేల్చిన నందుఁ దపం బొనర్చి సోమలోకంబున నుండు సహస్ర సంఖ్యలు గల 'ఋభు' నామధేయు లైన దేవత లుదయించి బ్రహ్మతేజంబునం జేసి దివ్య విమానులై యుల్ముకంబులు సాధనంబులుగా ధరియించి రుద్రపార్షదులయిన 'ప్రమథ' 'గుహ్యక' గణంబులఁ బాఱందోలిన వారును బరాజితులైరి; తదనంతరంబ నారదు వలన నభవుండు దండ్రిచే నసత్కృతురా లగుటం జేసి భవాని పంచత్వంబునొందుటయుం 'బ్రమథగణంబులు' 'ఋభునామక దేవతల'చేఁ బరాజితు లగుటయు విని.


భావము:
ఆ సందడిని చూసి అధ్వర్యుడైన భృగుమహర్షి మిక్కిలి కోపంతో యజ్ఞనాశకులను సంహరించే అభిచారక హోమాన్ని వెంటనే చేశాడు. ఈ విధంగా భృగువు దక్షిణాగ్నిలో వ్రేల్వగా తపస్సు చేసి సోమలోకాన్ని పొందిన ఋభువులు అనే దేవతలు వేలకొలదిగా పుట్టి, బ్రహ్మతేజస్సుతో దివ్యవిమానా లెక్కి, మండుతున్న కొరవులు ఆయుధాలుగా ధరించి, రుద్రుని అనుచరులైన ప్రమథులను, గుహ్యకులను తరిమివేశారు. ఆ తరువాత తండ్రిచేత అవమానింపబడి భవాని మరణించిందని, ప్రమథాదులు ఋభువులచేత ఓడిపోయారని నారదుని వలన శివుడు విన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=104

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: