Friday, January 31, 2020

దక్ష యాగము - 22


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-85-క.
జనకుం డవమానించుట
యును సోదరు లర్థిఁ దనకు నుచితక్రియఁ జే
సిన పూజల నందక శో
భన మరసిన మాఱుమాట పలుకక యుండెన్.
4-86-వ.
ఇట్లు తండ్రిచే నాదరింపబడనిదై విభుండైన యీశ్వరు నందు నాహ్వాన క్రియాశూన్యత్వరూపంబైన తిరస్కారంబును, నరుద్ర భాగంబైన య జ్ఞంబునుం గనుంగొని నిజరోషానలంబున లోకంబులు భస్మంబు చేయంబూనిన తెఱంగున నుద్రేకించి 'రుద్రద్వేషియుఁ గ్రతుకర్మాభ్యాస గర్విష్ఠుండు నగు దక్షుని వధియింతు' మనుచు లేచిన భూతగణంబుల నివారించి రోషవ్యక్తభాషణంబుల నిట్లనియె; "లోకంబున శరీరధారులైన జీవులకుఁ బ్రియాత్మకుండైన యీశ్వరునకుఁ బ్రియాప్రియలును నధికులును లేరు; అట్టి సకల కారణుండును నిర్మత్సరుండును నైన రుద్రు నందు నీవు దక్క నెవ్వండు ప్రతికూలం బాచరించు? నదియునుం గాక మిముబోఁటి వారలు పరులవలని గుణంబు లందు దుర్గుణంబులన యాపాదింతురు; మఱియుం గొందఱు మధ్యస్థులైన వారలు పరుల దుర్గుణంబుల యందు దోషంబుల నాపాదింపరు; కొందఱు సాధువర్తనంబు గలవారలు పరుల దోషంబుల నైన గుణంబులుగా ననుగ్రహింతురు; మఱియుం గొందఱుత్తమోత్తములు పరుల యందు దోషంబుల నాపాదింపక తుచ్ఛగుణంబులు గలిగినను సద్గుణంబులుగాఁ గైకొందురు; అట్టిమహాత్ముల యందు నీవు పాపబుద్ధి గల్పించితి” వని; వెండియు నిట్లను “మహాత్ములగు వారల పాదధూళిచే నిరస్తప్రభావులై జడ స్వభావంబుగల దేహంబునాత్మ యని పల్కు కుజను లగువారు మహాత్ముల నిందించుట కార్యంబు గాదు: అదియు వారి కనుచితం బగు” నని వెండియు నిట్లనియె.

భావము:
తండ్రి అవమానించడంతో తోబుట్టువులు చేసిన గౌరవాన్ని సతీదేవి అందుకొనక, వారికి బదులు చెప్పలేక పోయింది. ఈ విధంగా సతీదేవి తన తండ్రి ఆదరాన్ని పొందనిదై, తన భర్తను యజ్ఞానికి ఆహ్వానించకుండా తిరస్కరించడాన్ని, శివునికి భాగం కల్పించకుండా జరుపుతున్న యజ్ఞాన్ని చూసి, తన కోపాగ్ని జ్వాలలతో లోకాలను బూడిద చేయాలన్నంత ఉద్రేకాన్ని పొంది, శివుని ద్వేషించి క్రతువు చేస్తున్నానని గర్వపడుతున్న దక్షుణ్ణి హతమారుస్తామని లేచిన ప్రమథగణాలను నివారించి, రోషావేశంతో ఇలా అన్నది. “లోకంలోని ప్రాణులందరికీ ఇష్టమైన శివునకు ఇష్టమైనవారు అనీ, ఇష్టం లేనివారు అనీ ఎవరూ లేరు. అతనికంటె అధికులు లేరు. సకల విశ్వానికి కారణమైన ఈశ్వరునకు ఎవరియందూ ద్వేషము లేదు. అలాంటి రుద్రుని నీవు తప్ప లోకంలో ఇంకెవరు ద్వేషిస్తారు? అంతేకాక నీవంటివాళ్ళు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదిస్తారు. కొందరు మధ్యస్థులు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదించరు. కొందరు సత్పురుషులు ఇతరుల దోషాలనైనా గుణాలుగా గ్రహిస్తారు. ఇంకా కొందరు ఉత్తమోత్తములు ఇతరులలో దోషాలను ఆరోపించక వారి నీచగుణాలను సైతం సద్గుణాలుగా స్వీకరిస్తారు. అటువంటి మహాత్ములలో నీవు పాపబుద్ధిని కలిగించావు.” అని చెప్పి ఇంకా ఇలా అన్నది. “మహాత్ముల పాదధూళిముందు వెలవెలబోయిన తేజస్సు కలిగి, జడపదార్థమైన దేహాన్నే ఆత్మ అని వాదించే దుర్జనులు సజ్జనులను నిందించడంలో ఆశ్చర్యం లేదు. అది వారి తగినదే” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.


http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=86

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: