(దక్షాధ్వర ధ్వంసము )
4-122-సీ.
అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు;
గైకొని దక్షు వక్షంబుఁ ద్రొక్కి
ఘనశితధారాసిఁ గొని మేను వొడిచియు;
మంత్రసమన్విత మహిత శస్త్ర
జాలావినిర్భిన్న చర్మంబు గల దక్షుఁ;
జంపఁగా లేక విస్మయము నొంది
తద్వధోపాయంబు దన చిత్తమునఁ జూచి;
కంఠనిష్పీడనగతిఁ దలంచి
4-122.1-తే.
మస్తకముఁ దున్మి యంచితామర్షణమున
దక్షిణాలనమున వేల్చెఁ దదనుచరులు
హర్షమును బొంద; నచటి బ్రాహ్మణజనంబు
లాత్మలను జాల దుఃఖంబు లందుచుండ.
4-123-వ.
ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజ నివాసంబైన కైలసంబునకుఁ జనియె నయ్యవసరంబున.
4-124-చ.
హరభటకోటిచేత నిశి తాసి గదా కరవాల శూల ము
ద్గర ముసలాది సాధనవిదారిత జర్జరితాఖిలాంగులై
సురలు భయాకులాత్ము లగుచున్ సరసీరుహజాతుఁ జేరి త
చ్చరణ సరోరుహంబులకు సమ్మతిఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై.
4-125-క.
తము ధూర్జటి సైనికు లగు
ప్రమథులు దయమాలి పెలుచ బాధించుట స
ర్వముఁ జెప్పి" రనుచు మైత్రే
య మునీంద్రుఁడు విదురుతోడ ననియెన్; మఱియున్.
భావము:
వీరభద్రుడు సాటిలేని దర్పంతో విజృంభించి దక్షుణ్ణి పడవేసి రొమ్ము త్రొక్కిపట్టి వాడి అంచు కలిగిన కత్తితో ఒడలంతా తూట్లు పొడిచాడు. కాని మంత్రపూతాలయిన అనేక శస్త్రాస్త్రాలతో గట్టిపడిన చర్మం కలిగిన దక్షుణ్ణి చంపలేక ఆశ్చర్యపడి, అతణ్ణి చంపే ఉపాయాన్ని ఆలోచించి మెడ నులిమి, శిరస్సు తునిమి దక్షిణాగ్ని కుండంలో వేసి భస్మం చేశాడు. అది చూచి వీరభద్రుని అనుచరులు సంతోషించగా, అక్కడి బ్రాహ్మణులు మనస్సులో ఎంతో బాధపడ్డారు. ఈ విధంగా వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి తన నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివభటుల చేతుల్లోని వాడి కత్తులు, గదలు, శూలాలు, ఇనుపగుదియలు, రోకళ్ళు మొదలైన ఆయుధాల దెబ్బలకు అవయవాలన్నీ గాయపడగా దేవతలు భయంతో గుండె చెదరి బ్రహ్మదేవుణ్ణి సమీపించి, అతని పాదపద్మాలకు మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారాలు చేసి, వినయంతో శివుని సైనికులైన ప్రమథులు విజృంభించి నిర్దాక్షిణ్యంగా తమను బాధించిన విషయాన్నంతా చెప్పారు” అని మైత్రేయ మునీంద్రుడు విదురునితో చెప్పాడు. ఇంకా...
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=124
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment