Saturday, February 15, 2020

దక్ష యాగము - 36

(శివుడనుగ్రహించుట )

4-126-తే.
ఇంతయును మున్ను మనమున నెఱిఁగి యున్న
కతన విశ్వాత్మకుండును గమలలోచ
నుండు నన నొప్పు నారాయణుండు నజుఁడుఁ
జూడ రారైరి మున్ను దక్షుని మఖంబు.
4-127-వ.
అని చెప్పి “సుర లిట్లు విన్నవించినఁ జతుర్ముఖుండు వారల కిట్లనియె.
4-128-క.
"ఘన తేజోనిధి పురుషుం
డనయంబుఁ గృతాపరాధుఁ డయినను దా మ
ల్లన ప్రతికారముఁ గావిం
చిన జనులకు లోకమందు సేమము గలదే?"
4-129-వ.
అని మఱియు నిట్లనియె.
4-130-క.
"క్రతుభాగార్హుం డగు పశు
పతి నీశ్వరు నభవు శర్వు భర్గుని దూరీ
కృత యజ్ఞభాగుఁ జేసిన
యతి దోషులు దుష్టమతులు నగు మీ రింకన్.


భావము:
“ఇదంతా ముందే మనస్సులో తెలుసుకొని ఉండడం చేత విశ్వస్వరూపుడు, కమలాక్షుడు అయిన నారాయణుడు, బ్రహ్మదేవుడు దక్షుని యజ్ఞాన్ని చూడటానికి రాలేదు.” అని చెప్పి మైత్రేయుడు ఇంకా ఇలా అన్నాడు “దేవతలు ఈ విధంగా విన్నవించగా బ్రహ్మ వారితో ఇలా అన్నాడు. “మహాతేజస్సంపన్నుడైనవాడు అపరాధం చేసినా తిరిగి అతనికి అపకారం చేసేవారికి ఈ లోకంలో క్షేమం ఉంటుందా?” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. యజ్ఞంలో హవిర్భాగం అందుకొనడానికి యోగ్యుడైన పశుపతి, ఈశ్వరుడు, అభవుడు, శర్వుడు, భర్గుడు అయిన పరమేశ్వరుణ్ణి యజ్ఞభాగానికి దూరం చేయడం అనే గొప్ప దోషాన్ని చేసిన దుష్టులు మీరు

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=128

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: