Sunday, February 9, 2020

దక్ష యాగము - 27


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-101-సీ.
"సకల చరాచర జనకుఁ డై నట్టి యీ;
దక్షుండు దన కూర్మి తనయ మాన
వతి పూజనీయ యీ సతి దనచే నవ;
మానంబు నొంది సమక్ష మందుఁ
గాయంబు దొఱఁగంగఁ గనుఁగొను చున్నవాఁ;
డిట్టి దురాత్ముఁ డెందేనిఁ గలఁడె?
యనుచుఁ జిత్తంబుల నాశ్చర్యములఁ బొంది, ;
రదియునుఁ గాక యి ట్లనిరి యిట్టి
4-101.1-తే.
దుష్టచిత్తుండు బ్రహ్మబంధుండు నయిన
యీతఁ డనయంబుఁ దా నపఖ్యాతిఁ బొందు
నిందఁబడి మీఁద దుర్గతిఁ జెందుగాక!"
యనుచు జనములు పలుకు నయ్యవసరమున.
4-102-క.
దేహము విడిచిన సతిఁ గని
బాహాబల మొప్ప రుద్రపార్షదులును ద
ద్ద్రోహిం ద్రుంచుటకై యు
త్సాహంబున లేచి రసిగదాపాణులునై.


భావము:
సకల చరాచరాలను సృష్టించే ఈ దక్షుడు అభిమానవతి, పూజ్యురాలు అయిన తన ప్రియపుత్రిక సతీదేవి తన చేత అవమానింపబడి, తన ఎదుటనే శరీరాన్ని విడవడం చూస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుడు ఎక్కడైనా ఉన్నాడా?” అని ఆశ్చర్యపడ్డారు. ఇంకా ఇలా అన్నారు “ఇటువంటి దుష్టుడు పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు. ఇతడు తప్పక అపకీర్తిని పొంది, నిందల పాలయి, నరకంలో పడతాడు” అని దూషించే సమయంలో మరణించిన సతీదేవిని చూసి శివుని అనుచరులైన ప్రమథగణాలు అతిశయించిన బాహుబలంతో కత్తులు గదలు చేతుల్లో ధరించి దక్షుని సంహరించడానికి ఉత్సాహంతో లేచారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=101

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: