Monday, February 1, 2016

ప్రహ్లాదుని జన్మంబు - అని యిట్లు ప్రహ్లాదుండు

7-250-వ.
అని యిట్లు ప్రహ్లాదుండు రహస్యంబున న య్యైవేళల రాక్షస కుమారులకు నపవర్గమార్గం బెఱింగించిన; వారును గురుశిక్షితంబులైన చదువులు చాలించి నారాయణభక్తి చిత్తంబులం గీలించి యుండుటం జూచి వారల యేకాంతభావంబు దెలిసి వెఱచి వచ్చి శుక్రనందనుండు శక్రవైరి కిట్లనియె.
టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు {ప్రహ్లాదుడు - మిక్కలి హ్లాదము (సంతోషము)గలవాడు, హిరణ్యకశిపుని పుత్రుడు}; రహస్యంబునన్ = ఏకాంతములో; అయ్యై = ఆయా; వేళలన్ = సమయములందు; రాక్షస = రాక్షస; కుమారుల్ = పిల్లల; కున్ = కు; అపవర్గ = మోక్షపు; మార్గంబున్ = మార్గమును; ఎఱింగిచినన్ = తెలుపగా; వారును = వారుకూడ; గురు = గురువుచే; శిక్షితంబులు = నేర్పబడినవి; ఐన = అయిన; చదువులున్ = శాస్త్రాధ్యయనములను; చాలించి = ఆపివేసి; నారాయణ = విష్ణుని; భక్తిన్ = భక్తిని; చిత్తంబులన్ = మనసులలో; కీలించి = నాటుకొనజేసి; ఉండుటన్ = ఉండుటను; చూచి = తెలిసికొని; వారల = వారియొక్క; ఏకాంత = అంతరంగిక; భావంబున్ = ఆలోచనలు; తెలిసి = తెలిసికొని; వెఱచి = బెదిరిపోయి; వచ్చి = దగ్గరకు వచ్చి; శుక్రనందనుండు = శుక్రాచార్యుని కొడుకు; శక్రవైరి = హిరణ్యకశిపున {శక్రవైరి - శక్రుడు (ఇంద్రుడు) యొక్క వైరి (శత్రువు), హిరణ్యకశిపుడు}; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
అని ఇలా రహస్యంగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా, అనేక అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు మోక్ష మార్గాన్ని బోధించసాగాడు. అప్పుడు వాళ్ళందరు గురువులు దగ్గర చెప్పే తమ చదువులను ఆపేశారు. తమ హృదయాలను శ్రీమన్నారాయణుని వైపు మళ్లించారు. భక్తి మార్గం పట్టారు. ఇది వాళ్ళ గురువులు గమనించారు, శిష్యుల భావాలు తెలుసుకుని భయపడ్డారు. శుక్రాచార్యుని కొడుకులు చండామార్కులు తమ మహారాజు, ఇంద్రుడి శత్రువు అయిన హిరణ్యకశిపుడి వద్దకు చేరి ఇలా అన్నారు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: