Sunday, February 21, 2016

ప్రహ్లాదుని జన్మంబు - ఎక్కడగల డేక్రియ

7-272-క.
క్కడఁ గలఁ డే క్రియ నే
క్కటి వర్తించు నెట్టి జాడను వచ్చుం
క్కడఁతు నిన్ను విష్ణునిఁ
బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్."
7-273-వ.
అనిన హరికింకరుండు శంకింపక హర్షపులకాకుంర సంకలిత విగ్రహుండై యాగ్రహంబు లేక హృదయంబున హరిం దలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు జేయుచు నిట్లనియె.
టీకా:
ఎక్కడ = ఎక్కడ; కలడు = ఉన్నాడు; ఏ = ఎట్టి; క్రియన్ = విధముగ; ఏ = ఏ; చక్కటిన్ = స్థలమునందు; వర్తించున్ = తిరుగుచుండును; ఎట్టి = ఎలాంటి; జాడనున్ = దారిలో; వచ్చున్ = వచ్చును; చక్కడతున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్నును; విష్ణునిన్ = విష్ణువును; పెక్కులున్ = అదికముగా; ప్రేలెదవు = వదరెదవు; వాని = అతని; భృత్యుని = సేవకుని, బంటు; పగిదిన్ = వలె.
          అనినన్ = అనగా; హరి = విష్ణు; కింకరుండు = దాసుడు; శంకింపక = జంకక; హర్ష = సంతోషమువలన; పులకాకుర = గగుర్పాటు; సంకలిత = కలిగిన; విగ్రహుండు = రూపముగలవాడు; ఐ = అయ్యి; ఆగ్రహంబు = కోపము; లేక = లేకుండగ; హృదయమున = హృదయమందు; హరిన్ = విష్ణుని; తలంచి = స్మరించి; నమస్కరించి = నమస్కారముచేసి; బాల = చిన్నపిల్లవాని; వర్తనంబునన్ = నడవడికతో; నర్తనంబు = నాట్యము; చేయుచున్ = చేయుచు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
            విష్ణువును సేవకుడిలా తెగపొగడుతున్నావు. అసలు ఎక్కడ ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతు ఉంటాడు? ఏ పద్ధతిలో వస్తుంటాడు? ఊఁ చెప్పు. లేకపోతే నిన్నూ, నీ హరిని సంహరిస్తాను. ముందు సమాధానం చెప్పు
            అలా తండ్రి గద్దిస్తున్నప్పటికి పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుడు ఏ మాత్రం జంకలేదు. పైగా అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. ఆవగింజంత ఆగ్రహం కూడా లేకుండా, హృదయం నిండా హృషీకేశుడిని తలచుకుని నమస్కారాలు చేశాడు. ఆనందంగా ఉన్న బాలురకు సహజమైనట్లుగానే తన సంతోషంలో తాను అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు.
७-२७२-क.
एक्कडँ गलँ डे क्रिय ने
चक्कटि वर्तिंचु नेट्टि जाडनु वच्चुं
जक्कडँतु निन्नु विष्णुनिँ
बेक्कुलु प्रेलेदवु वानि भृत्युनि पगिदिन्."
७-२७३-व.
अनिन हरिकिंकरुंडु शंकिंपक हर्षपुलकाकुंर संकलित विग्रहुंडै याग्रहंबु लेक हृदयंबुन हरिं दलंचि नमस्करिंचि बालवर्तनंबुन नर्तनंबु जेयुचु निट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: