Thursday, November 26, 2015

ప్రహ్లాద చరిత్ర - త్రిప్పకుమన్న


7-158-ఉత్పలమాల
త్రిప్పకు మన్న మా మతము, దీర్ఘములైన త్రివర్గపాఠముల్
ప్పకు మన్న, నేఁడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్
చెప్పినరీతి గాని మఱి చెప్పకు మన్న విరోధిశాస్త్రముల్,
విప్పకుమన్న దుష్టమగు విష్ణుచరిత్రకథార్థజాలముల్.
7-159-వచనము
అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికిం దోడితెచ్చిన.
            నాయనా! ప్రహ్లాదా! ఇవాళ మీ తండ్రిగారి దగ్గర మేం చెప్పిన చదువులకు వ్యతిరేకంగా చెప్పకు. గొప్పవైన ధర్మశాస్త్రం అర్ధశాస్త్రం కామశాస్త్రం అనే త్రితయాల పాఠాలు అడిగినవి జాగ్రత్తగా మరచిపోకుండా చెప్పు. మేం చెప్పిన నీతిపాఠాలు తప్పించి వేరేవి మాట్లాడకు. మన విరేధి విష్ణుమూర్తి మాటమాత్రం ఎత్తకు. దుష్టమైన ఆ విష్ణుకథలను గురించి అసలు మాట్లాడనే మాట్లాడ వద్దు. మరచిపోకు నాయనా!” అని గురువులు ప్రహ్లాదుడిని నచ్చజెప్పి, హిరణ్యకశిప మహారాజు ఆస్థానానికి తీసుకొచ్చారు.
          త్రిప్పకుము = మార్చేయకుము; అన్న = నాయనా; మా = మా యొక్క; మతమున్ = విధానమును; దీర్ఘములు = పెద్దవి; ఐన = అయినట్టి; త్రివర్గ = ధర్మార్థకామములగురించిన; పాఠముల్ = చదువులను; తప్పకుము = వదలివేయకుము; అన్న = నాయనా; నేడు = దినమున; మన = మన యొక్క; దైత్యవరేణ్యుని = హిరణ్యకశిపుని {దైత్యవరేణ్యుడు - దైత్య (రాక్షసులలో) వరేణ్యుడు (శ్రేష్ఠుడు), హిరణ్యకశిపుడు}; మ్రోలన్ = ముందట; నేము = మేము; మున్ = ఇంతకుముందు; చెప్పిన = నేర్పిన; రీతిన్ = విధముగ; కాని = తప్పించి; మఱి = మరి యితరమైనవి; చెప్పకుము = చెప్పకుము; అన్న = నాయనా; విరోధి = శత్రువుల యొక్క; శాస్త్రముల్ = శాస్త్రములను; విప్పకుము = చెప్పకుము; దుష్టము = చెడ్డది; అగు = అయిన; విష్ణు = నారాయణుని; చరిత్ర = వర్తనలు; కథ = గాథలు; అర్థ = విషయముల; జాలమున్ = సమూహములను.
           అని = అని; బుజ్జగించి = నచ్చచెప్పి; దానవేశ్వరుని = హిరణ్యకశిపుని; సన్నిధి = దగ్గర; కున్ = కు; తోడి = కూడా; తెచ్చి = తీసుకొచ్చి.
७-१५८-उत्पलमाल
त्रिप्पकु मन्न मा मतमु, दीर्घमुलैन त्रिवर्गपाठमुल्
दप्पकु मन्न, नँडु मन दैत्यवरेण्युनि म्रोल नेमु मुन्
चेप्पिनरीति गानि मर्रि चेप्पकु मन्न विरोधिशास्त्रमुल्,
विप्पकुमन्न दुष्टमगु विष्णुचरित्रकथार्थजालमुल्.
७-१५९-वचनमु
अनि बुज्जगिंचि दानवेश्वरुनि सन्निधिकिं दोडितेच्चिन.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: