7-122-సీస పద్యము
శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన యట్లైన, ; జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు;
నసురారి దన మ్రోల నాడిన యట్లైన, ; నసురబాలురతోడ నాడ మఱచు;
భక్తవత్సలుఁడు సంభాషించినట్లైన, ; బరభాషలకు మాఱుపలుక మఱచు;
సురవంద్యుఁ దనలోనఁ జూచినయట్లైనఁ, ; జొక్కి సమస్తంబుఁ జూడ మఱచు;
7-122.1-తేటగీతి
హరిపదాంభోజయుగ చింతనామృతమున; నంతరంగంబు నిండినట్లైన, నతఁడు
నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి; జడత లేకయు నుండును జడుని భంగి.
మహారాజా! ఆ ప్రహ్లాదుడు విష్ణువు తనను చెంది ఉన్నప్పుడు స్నేహితులతో చేరడు. శ్రీహరి
తన ఎదురుగా మెదలుతూ ఉన్నప్పుడు తోటి రాక్షసుల పిల్లలతో ఆటలాడడు. ఆయన తనతో మాట్లాడుతున్నప్పుడు
ఇతరులతో మాట్లాడడు. ఆయనను తనలో ధ్యానించుకునే సమయంలో మరింక దేనిని చూడడు. హరిధ్యానముతో
మనసు నిండి ఉన్నప్పుడు అతడు ఆనందపూర్ణుడై అన్ని వదిలేసి, మోహము లేకపోయినా, పిచ్చివాడి
లాగ కనబడతాడు.
శ్రీవల్లభుడు = హరి {శ్రీవల్లభుడు - శ్రీ (లక్ష్మీదేవి) యొక్క వల్లభుడు (భర్త), విష్ణువు}; తన్నున్ = తనను; చేరిన = వద్దకు వచ్చిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; చెలికాండ్రన్ = స్నేహితులను; ఎవ్వరిన్ = ఎవరినికూడ; చేరన్ = కలియుటను; మఱచున్ = మరచిపోవును; అసురారి = హరి {అసురారి - అసుర (రాక్షసుల) అరి (శత్రువు), విష్ణువు}; తన = తన యొక్క; మ్రోలన్ = ఎదుట; ఆడిన = మెలగిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; అసుర = రాక్షస; బాలుర = పిల్లలు; తోడన్ = తోటి; ఆడన్ = క్రీడించుట; మఱచున్ = మరచిపోవును; భక్తవత్సలుడు = హరి {భక్తవత్సలుడు - భక్తుల యెడల వాత్సల్యముగలవాడు, విష్ణువు}; సంభాషించిన = మాట్లాడిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచే; పర = ఇతరమైన; భాషల్ = మాటల; కున్ = కు; మాఱు = బదులు; పలుకన్ = చెప్పుట; మఱచున్ = మరచిపోవును; సురవంద్యున్ = హరిని {సురవంద్యుడు - సుర (దేవతలచే) వంద్యుడు (మొక్కబడినవాడు), విష్ణువు}; తన = తన; లోనన్ = అందు; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; చొక్కి = సోలిపోయి; సమస్తంబున్ = అఖిలమును; చూడన్ = చూచుట; మఱచున్ = మరచిపోవును.
హరి = హరి; పద = పాదములు యనెడి; అంభోజ = పద్మముల; యుగ = జంటను; చింతన = స్మరించుట యనెడి; అమృతమున్ = అమృతముతో; అంతరంగంబు = హృదయము; నిండిన = నిండిపోయిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; అతడు = అతడు; నిత్య = నిత్య; పరిపూర్ణుడు = సంతృప్తిచెందినవాడు; అగుచన్ = అగుచు; అన్నియున్ = సర్వమును; మఱచి = మరచిపోయి; జడత = చేష్టలుడుగుట; లేకయున్ = లేకుండగ; ఉండును = ఉండును; జడుని = వెఱ్ఱివాని; భంగిన్ = వలె.
७-१२२-सीस पद्यमु
श्रीवल्लभुँडु दन्नुँ जेरिन यट्लैन, ; जेलिकांड्र नेव्वरिँ जेर मर्रचु;
नसुरारि दन म्रोल नाडिन यट्लैन, ; नसुरबालुरतोड
नाड मर्रचु;
भक्तवत्सलुँडु संभाषिंचिनट्लैन, ; बरभाषलकु
मार्रुपलुक मर्रचु;
सुरवंद्युँ दनलोनँ जूचिनयट्लैनँ, ; जोक्कि
समस्तंबुँ जूड मर्रचु;
७-१२२.१-तेटगीति
हरिपदांभोजयुग चिंतनामृतमुन; नंतरंगंबु निंडिनट्लैन, नतँडु
नित्य परिपूर्णुँ डगुचु नन्नियुनु मर्रचि; जडत लेकयु
नुंडुनु जडुनि भंगि.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment