Saturday, November 1, 2014

రుక్మిణీ కల్యాణం - ప్రార్థన

1- క.
శ్రీకంఠచాప ఖండన!
పాకారిప్రముఖ వినుత భండన! విలస
త్కాకుత్స్థవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!

          శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన వారు కీర్తించేలా యుద్దం చేసిన వాడవు. ప్రసిద్దమైన కాకుత్స్థ వంశానికి అలంకారమైన వాడవు. పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.

1- ka.
shreekaMThachaapa khaMDana!
paakaaripramukha vinuta bhaMDana! vilasa
tkaakutsthavaMshamaMDana!
raakEMdu yashOvishaala! raamanRipaalaa!

          శ్రీకంఠచాపఖండన = శ్రీరామ {శ్రీకంఠచాపఖండనుడు - శ్ర్రీకంఠుని (కఱ కంఠుడు యైన శివుని) చాప (విల్లును) ఖండనుడు (విరిచినవాడు), రాముడు}; పాకారిప్రముఖ వినుత భండన = శ్రీరామ {పాకారిప్రముఖ వినుత భండనుడు - (పాకాసురుని శత్రువైన ఇంద్రుడు) మున్నగువారిచేత వినుత (పొగడబడిన) భండన (యుద్ధము కలవాడు), రాముడు}; విలసత్కాకుత్స్థ వంశ మండన = శ్రీరామ {విలసత్కాకుత్స్థ వంశ మండనుడు - విలసత్ (ప్రసిద్ధికెక్కిన) కాకుత్స్థవంశ (కకుత్స్థ మహరాజ వంశమునకు) మండనుడు (అలంకారమైనవాడు), రాముడు}; రాకేందు యశోవిశాల = శ్రీరామ {రాకేందు యశోవిశాలుడు - రాకేందు (నిండుపున్నమిచంద్రుని) వంటి యశః (కీర్తి) విశాలుడు (విరివిగా కలవాడు), రాముడు}; రామ = రాముడు అనెడి {నిండుపున్నమి చంద్రుని పదహారు కళలు - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5పుష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 121శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత}; నృపాల = రాజా.


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: