Friday, November 28, 2014

రుక్మిణీకల్యాణం – ఆయెలనాగ నీకుఁదగు

35- ఉ.
యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; ప్పదు జాడ్యము లేల? నీవు నీ
తోమువారుఁ గూడుకొని తోయరుహాననఁ దెత్రు గాని వి
చ్చేయుము; శత్రులన్నుఱుము జేయుము చేయుము శోభనం బిలన్
          ఆ యువతి రుక్మణీదేవి నీకు తగినది. ఆమెకు వాసుదేవ! నీవు తగిన వాడవు. మా గురువు మీద ఒట్టు. మీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు. నువ్వు నీ వాళ్ళతో కలిసి కన్యను తీసుకొచ్చెదవుగాని రమ్ము. శత్రువుల్ని నుగ్గునుగ్గుచేయుము. లోకానికి శుభాలు కలిగించుము.
35- u.
aa yelanaaga neekuM~ dagu; naMganakuM dagu deevu maa yupaa
dhyaayula yaana peMDli yaguM~; dappadu jaaDyamu lEla? neevu nee
tOyamuvaaruM~ gooDukoni tOyaruhaananaM~ detru gaani vi
chchEyumu; shatrula nnuRrumu jEyumu chEyumu shObhanaM bilan
          ఆ = ఆ యొక్క; ఎలనాగ = యువతి {ఎలనాగ - లేతవయస్కురాలు, వనిత}; నీకున్ = నీకు; తగున్ = సరిపడును; అంగన = వనిత {అంగన - మంచి అంగములు కలామె, స్త్రీ}; కున్ = కు; తగుదువు = సరిపడుదువు; ఈవు = నీవు; మా = మా యొక్క; ఉపాధ్యాయుల = గురువుల మీద; ఆన = ఒట్టు; పెండ్లి = వివాహము; అగున్ = జరుగును; తప్పదు = తథ్యమిది; జాడ్యములు = ఆలసించుటలు; ఏలన్ = ఎందుకు; నీవున్ = నీవు; నీ = నీ యొక్క; తోయమువారు = తోటివారు; కూడుకొని = కలిసి; తోయరుహాననన్ = పద్మాక్షిని; తెత్రుగాని = తీసుకొచ్చెదరు గాని; విచ్చేయుము = రమ్ము; శత్రులన్ = విరోధులను; నుఱుము = పొడిగా, మర్ధించుట; చేయుము = చేయుము; చేయుము = చేయుము; శోభనంబు = శుభములను; ఇలన్ = లోకమునకు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: