Sunday, December 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 155

iMtitaMtai

8-622-శా.
ఇంతింతై, వటుఁ డింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
          బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, కొంచం కొంచం ఎదగటం మొదలెట్టాడు. అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు. అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు. అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు. అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు. మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. చూడండి అప్పుడే మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.
భక్తివేదాంతాలతో అలవోకగా పండిత పామరులను అలరిస్తూ సాగే మన బమ్మెరవారి భాగవతంలో మధురాతి మధుర మైనది వామన చరిత్ర. మత్యావతా రాదులు ఎత్తి, మొట్టమొదటి మానవునిగా అవతరించిన పొట్టివాడైనా గట్టివాడిగా బ్రహ్మాండం అంతా వ్యాపించిన మహాద్భుత అవతార చరిత్ర ఇది. అంతేనా మహా మంత్ర పూరితం. కష్టనష్ట నాశకం. శుభప్రదాయకం. అంతటి కథకి సారాంశం ఈ పద్యం. పద్యం నడకలో, పద బందాలలో అలా పెరగటాన్ని ఎంతో అందంగా ప్రతిఫలింపజేసారు పోతనామాత్యులు.
8-622-Saa.
iMtiMtai, vaTu@M DiMtayai maRiyu@M daa niMtai nabhOveethipai
naMtai tOyadamaMDalaagramuna kallaMtai prabhaaraaSipai
naMtai chaMdruni kaMtayai dhruvunipai naMtai maharvaaTipai
naMtai satyapadOnnatuM Daguchu brahmaaMDaaMta saMvardhiyai.
          ఇంతింత = కొంచం మరికొంచం; = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరికొంచం; = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొచం; = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అల్లంత = ఆవత లంత; = అయ్యి; ప్రభారాశి = వెలుగులరాశి, పాలపుంత; పైన్ = కంటె ఎక్కువ ఎత్తు; అంత = అంత; = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; = అయ్యి; ధ్రువుని = ధ్రువుడి కంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; = అయ్యి; మహర్వాటిన్ = మహర్లోకము కంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకము కంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కలవాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివర వరకు; సంవర్ధి = నిండిపోయిన వాడు; = అయ్యి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

2 comments:

Anonymous said...

First line may be relooked. It is iis not inthi thanthai rather it shall inthinthai

vsrao5- said...

ధన్యవాదాలు అజ్ఞాత సహకారిగారు. దోషం సరిదిద్దుకున్నా. ధన్యా మీకు మరొక్కమారు ధన్యవాదాలు.