Monday, October 21, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 92

kaTi viraajita


3-538-సీ.
కటి విరాజిత పీతకౌశేయ శాటితో; వితత కాంచీ గుణ ద్యుతి నటింప
నాలంబి కంఠహారావళి ప్రభలతోఁ; గౌస్తుభ రోచులు గ్రందుకొనఁగ
నిజకాంతి జిత తటి ద్వ్రజ కర్ణకుండల; రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ
మహనీయ నవరత్నయ కిరీట ప్రభా; నిచయంబు దిక్కులనిండఁ బర్వ
తే. వైనతేయాంస విన్యస్త వామహస్త
కలిత కేయూర వలయ కంణము లొప్ప
నన్య కరతల భ్రమణీకృ తానుమోద
సుంద రాకార లీలారవింద మమర.
          దేవర్షులు సనకసనందనాదులు విష్ణుమూర్తిని దర్శించా లని కుతూహలంతో ఐదేళ్ళ బాలా కుమారులలా వైకుంఠం వచ్చారు. ఆరు ప్రాకారాలు దాటి ఏడవ ప్రాకారం దగ్గరకి వచ్చారు. అక్కడి ద్వారపాలకులు జయ విజయులు యిద్దరు అడ్డగించారు. వారిని సనకసనంద నాదులు (సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతు లనే బ్రహ్మ కుమారులు నలుగురు) మీరు భూలోకంలో అరిషడ్వర్గాలకు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యా లను శత్రువులు ఆరుగురు) లోనయ్యే జన్మలు పొందుదురు గాక అని శపించారు. అప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో సహా ప్రత్యక్ష మయ్యాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి ఎలా ఉన్నాడంటే –
ఆ విష్ణుమూర్తి నడుంచుట్టూ ప్రకాశించే పచ్చని పట్టుపంచెమీది బంగారు మొలతాడు ప్రకాశిస్తు ఉంది. మెడలో వేళ్ళాడుతున్నరత్నాలహారాల కాంతులతో కౌస్తుభమణి కాంతులు కలిసిపోయాయి. మెరపుతీగలవలె మిరుమిట్లు గొలిపే మకర కుండలాల ధగధగలుతో చెక్కిళ్ళ నిగనిగలు చెలిమి చేస్తున్నాయి. గరుత్మంతుని మూపుమీద ఆనించిన ఆయన ఎడమ చెయ్యి; ఆ చేతికి అలంకరించిన భుజకీర్తి, కడియాలు, కంకణాలు ముచ్చటగా వెలుగొందు తున్నాయి. ఆయన కుడి చేతిలో తిప్పు తున్న అందమైన లీలారవిందం విలాసిల్లుతున్నది.
3-538-see.
kaTi viraajita peetakauSaeya SaaTitO; vitata kaaMchee guNa dyuti naTiMpa
naalaMbi kaMThahaaraavaLi prabhalatO@M; gaustubha rOchulu graMdukona@Mga
nijakaaMti jita taTi dvraja karNakuMDala; ruchulu gaMDadyutul prOdisaeya
mahaneeya navaratnamaya kireeTa prabhaa; nichayaMbu dikkulaniMDa@M barva
tae. vainataeyaaMsa vinyasta vaamahasta
kalita kaeyoora valaya kaMkaNamu loppa
nanya karatala bhramaNeekR taanumOda
suMda raakaara leelaaraviMda mamara.
           కటి = మొల ప్రాంతమున; విరాజిత = విరాజిల్లుతున్న; పీత = పచ్చని; కౌశేయ = పట్టు; శాటి = వస్త్రము; తోన్ = తో; వితత = మించుతున్న; కాంచీగుణ = మొలతాడు; ద్యుతి = ప్రకాశము; నటింపన్ = విరజిమ్ముతుండగా; ఆలంబి = వేలాడే; కంఠ = మెడలోని; హార = హారముల; ఆవళి = వరుసలు యొక్క; ప్రభలన్ = ప్రకాశము; తోన్ = తో; కౌస్తుభ = కౌస్తుభమణి; రోచులు = కాంతులు; క్రందుకొనగన్ = కమ్ముకొనగా; నిజ = తన; కాంతి = ప్రకాశముచే; జిత = జయింపబడిన; తటిత్ = మెరుపుతీగల; వ్రజ = సమూహములు కల; కర్ణ = చెవి; కుండల = కుండలముల; రుచులు = కాంతి; గండ = చెక్కిళ్ల; ద్యుతుల్ = కాంతులు; ప్రోదిసేయన్ = కలిసిపోగా; మహనీయ = గొప్ప; నవరత్న = నవరత్నములు {నవరత్నములు - తొమ్మిది జాతుల మణులు, 1 మౌక్తికము (ముత్యము) 2 పద్మరాగము (కెంపు) 3 వజ్రము 4 ప్రవాళము (పగడము) 5 మరకతము (గరుడ పచ్చ, పచ్చ) 6 నీలము 7 గోమేధికము 8 పుష్యరాగము 9 వైడూర్యము}; మయ = పొదిగిన; కిరీట = కిరీటము యొక్క; ప్రభా = కాంతుల; నిచయంబున్ = సమూహములు; దిక్కులన్ = నలుదిక్కులను {నలుదిక్కులు - 1తూర్ప, 2దక్షిణము, 3పడమర, 4ఉత్తరములు}; నిండ = నిండుగా; పర్వన్ = వ్యాపించగా; వైనతేయ = గరుత్మంతుని {వైనతేయుడు - వినతా దేవి యొక్క పుత్రుడు, గరుత్మంతుడు}; అంస = మూపుపై; విన్యస్త = ఉంచబడిన; వామ = ఎడమ; హస్త = చేతికి; కలిత = ఉన్నట్టి; కేయూర = భుజకీర్తులు; వలయ = మురుగులు; కంకణముల్ = కంకణములు; ఒప్పన్ = ఒప్పియుండగా; అన్య = ఇంకొక; కరతల = అరచేతిలో; భ్రమణీ = తిప్పుతూ; కృతా = ఉన్నట్టి; అనుమోద = సంతోషముతో కూడిన; సుందర = అంద మైన; ఆకార = ఆకారముతో; లీలన్ = విలాసమున కైన; అరవిందము = పద్మము; అమరన్ = అమరి ఉండగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: