mRganaabhi
10.1-1732-సీ.
మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ; జలకము
లాడదు జలజగంధి;
ముకురంబు చూడదు ముకురసన్నిభముఖి; పువ్వులుదుఱుమదు
పువ్వుఁబోఁడి;
వనకేళిఁ గోరదు వనజాతలోచన; హంసంబుఁ
బెంపదు హంసగమన;
లతలఁ బోషింపదు లతికాలలితదేహ; తొడవులు
తొడువదు తొడవుతొడవు;
ఆ. తిలకమిడదు
నుదుటఁ దిలకినీతిలకంబు;
గమలగృహముఁ జొరదు కమలహస్త;
గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవుమాలి యనుచు.
10.1-1732-see.
mRganaabhi
yala@Mdadu mRgaraajamadhyama; jalakamu laaDadu jalajagaMdhi;
mukuraMbu
chooDadu mukurasannibhamukhi; puvvulu du~rumadu puvvu@MbO@MDi;
vanakaeLi@M
gOradu vanajaatalOchana; haMsaMbu@M beMpadu haMsagamana;
latala@M
bOshiMpadu latikaalalitadaeha; toDavulu toDuvadu toDavutoDavu;
aa.
tilakamiDadu nuduTa@M dilakineetilakaMbu;
gamalagRhamu@M
joradu kamalahasta;
gaaraviMchi
tannu@M garuNa@M gaikona vana
maali
raa@MDu tagavumaali yanuchu.
పోతన భాగవతంలో అతి సుందర మైన ఘట్టం రుక్మిణీ కల్యాణం. ఇది కథా పరంగాను, కవనం
పరంగాను తలమానిక మైన సాహితీ కుసుమం, భక్తి శృంగారాలకు అటపట్టు అయినది ఈ అద్భుత ఘట్టం.
పండిత పామరుల మది చూరగొన్నది కనుకే ‘ఖగనాథుం’ నుంచి ‘అనఘా ఆదిలక్ష్మి’ వరకు
వారి నోళ్ళల్లో నానుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా కల్యాణం శీఘ్రంగా జరగాలని
ఆశించేవారికి అద్భుతమైన మహా మంత్రం. దీనిని పవిత్రంగా పారాయణ చేసే ఆచారం పెద్దల
నుంచి వస్తున్నదే. ఈ రుక్మిణీ కల్యాణంలో ఉన్న అమృతగుళికలలో ఎన్న దగ్గ ఈ ‘మృగనాభి’
పద్యం ఉభయాలంకార సంశోభితం. రుక్మిణీకన్య శ్రీకృష్ణుణ్ణి వలచింది. చెప్పినా అన్న రుక్మి విన డని
గ్రహించి మురళీధరుడికి స్వయంవరానికి ముందే రాయబారం పంపింది. ముహూర్తం దగ్గరకి
వచ్చేసింది. రమణుని రాకకోసం బెంగ పెట్టుకొన్న భీష్మకసుత –
వన మాలలు
ధరించే ఆ కృష్ణమూర్తి తన కోరికను గౌరవించి దయతో తన్ను చేపట్టుటకు రావటం లేదు. అతను
తగవు తప్పాడు అని, సన్నని నడుము గల ఆ అన్నులమిన్న కస్తూరి గంధం ఒంటికి రాసకోదు; అద్దం లాంటి
ముఖం ఉన్న ముద్దుగుమ్మ అద్దం చూసుకోదు. పువ్వు లాంటి సుకుమారి జడలో పూలు
పెట్టుకోదు. కమలాల లాంటి కన్నులు లున్న కన్యకామణి జలక్రీడ లాడదు. హంస నడకల అందగత్తె
హంసలను సాకదు. లత లాంటి నెలత లతలలను సాకదు. అలంకారాలకే అలంకారం అయిన ఆ అతివ
ఆభరణాలు ధరించదు. చెలువలకే సిగబంతి అయిన ఆ ఇంతి నుదుట బొట్టు దిద్దుకోదు. కలువల
వంటి కరములు గల కలికి రుక్మిణి ఈత కొలనులోకి దిగదు.
మృగనాభి = కస్తూరి; అలదదు = రాసుకొనదు; మృగరాజ = సింహము వంటి; మధ్యమ = నడుము కలామె; జలకము లాడదు = స్నానము చేయదు; జలజ = పద్మముల వంటి; గంధి = సువాసన కలామె; ముకురంబున్ = అద్దములో; చూడదు = చూసుకొనదు; ముకుర = అద్దము; సన్నిభ = లాంటి; ముఖి = మోము కలామె; పువ్వులున్ = పూలను; తుఱుమదు = తలలో పెట్టుకోదు; పువ్వు = పూల వంటి; పోడి = దేహము కలామె; వన = వనములలో; కేళిన్ = విహారములను; కోరదు = ఇష్టపడదు; వనజాత = పద్మము వంటి; లోచన = కన్నులు కలామె; హంసంబున్ = హంసలను; పెంపదు = సాకదు; హంస = హంస వంటి; గమన = నడక కలామె; లతలన్ = తీగలను; పోషింపదు = పెంచదు; లతికా = తీగ వలె; లలిత = మనోజ్ఞ మైన; దేహ = దేహము కలామె; తొడవులు = ఆభరణములను; తొడువదు = తొడుగుకొనదు, ధరించదు; తొడవు = భూషణములకే; తొడవు = భూషణప్రాయ మైనామె; తిలకము = తిలకముబొట్టు; ఇడదు = పెట్టుకొనదు; నుదుటన్ = నుదురుమీద; తిలకినీ = స్త్రీలలో {తిలకిని - తిలకము ధరించునామె, స్త్రీ}; తిలకంబు = ఉత్తమురాలు; కమలగృహమున్ = చెరువులందు {కమలగృహము - పద్మములకు నిలయము, సరస్సు}; చొరదు = ప్రవేశింపదు; కమల = పద్మరేఖ; హస్త = చేతిలో కలామె; గారవించి = మన్నించి; తన్నున్ = ఆమెను; కరుణన్ = దయతోటి; కైకొనన్ = చేపట్టుటకు; వనమాలి = కృష్ణుడు {వనమాలి - వనమాల ధరించువాడు, కృష్ణుడు}; రాడు = వచ్చుటలేదు; తగవు = న్యాయము; మాలి = లేనివాడై; అనుచున్ = అని.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment