Thursday, September 19, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 60



kshONitalaMbunan


1-6-ఉ.
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీక చయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
          నేలకు నెన్నుదరు సోకేలా సాగిలపడి మొక్కి, సైకతశ్రోణి అలినీలవేణి తామరలచే సమావృత అయిన సరస్వతీదేవికి సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి సుధలు వర్షించే తన సుమధుర వాక్కులతో అరవిందభవుని అంతరంగాన్ని అలరిస్తుంది. అక్షమాల రామచిలుక తామరపువ్వు పుస్తకాలను నాలుగు చేతులలో ముచ్చటగా ధరిస్తుంది. తన చల్లని చూపులతో సుర నికరాన్ని కనికరిస్తుంది.
1-6-u.
kshONitalaMbunan nuduru sO@Mka@Mga mrokki nutiMtu saikata
SrONiki@M jaMchareeka chaya suMdaravaeNiki rakshitaamara
SraeNiki@M dOyajaatabhava chitta vaSeekaraNaika vaaNikin
vaaNiki nakshadaama Suka vaarija pustaka ramya paaNikin.
          క్షోణితలంబునన్ = నేలకు; నుదురు = లలాటము; సోఁకఁగన్ = ఆనేలా; మ్రొక్కి = నమస్కరించి; నుతింతున్ = స్తుతిస్తాను; సైకత = ఇసక తిన్నెల లాంటి; శ్రోణి = పిరుదులు గలామె; కిన్ = కు; చంచరీక = తుమ్మెదల; చయ = గుంపు లాంటి; సుందర = అందమైన; వేణి = జుట్టు గలామె; కిన్ = కు; రక్షి = రక్షణ వలయంలా; తామర = పద్మాల; శ్రేణి = సమూహము గలామె; కిన్ = కి; తోయజాతభవ = నీటిలో పుట్టిన (పద్మం) దానిలో పుట్టిన వాని (బ్రహ్మ) యొక్క; చిత్త = మనసును; వశీకరణ = వశీకరించు కోగల; ఏక = అసహాయ శూర; వాణి = వాక్కు గలామె; కిన్ = కి; వాణి = సరస్వతీదేవి; కిన్ = కి; అక్ష = స్పటికముల; దామ = మాల; శుక = రామ చిలుక; వారిజ = తామర పువ్వు; పుస్తక = పుస్తకము; రమ్య = అందంగా; పాణి = చేత ధరించి నామె; కిన్ = కి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: