Saturday, August 8, 2015

బ్రహ్మవరములిచ్చుట - ఇట్లు దైత్యేశ్వరుండు

7-86-వచనము
ఇట్లు దైత్యేశ్వరుండు దివి నున్న హంసవాహనునకు ధరణీతలంబున దండప్రణామంబు లాచరించి సంతోషబాష్పసలిలసంవర్ధిత పులకాంకురుండై యంజలి జేసి కంజాతగర్భునిమీఁద దృష్టి యిడి గద్గదస్వరంబున నిట్లని వినుతించె.
            ఇలా హిరణ్యకశిప రాక్షస రాజు ఆకాశంలో హంసవాహనుడై ఉన్న బ్రహ్మదేవుడికి నేలమీద పడిపడి నమస్కారాలు చేసాడు. ఆనంద భాష్పాలతో, పులకరించిన ఒంటితో అంజలి ఘటించి నమస్కారం చేసి, కమలాసనుపైనే దృష్టి నిలుపుకొని బొంగురుపోయిన కంఠంతో ఇలా స్తుతించసాగాడు.
७-८६-वचनमु
इट्लु दैत्येश्वरुंडु दिवि नुन्न हंसवाहनुनकु धरणीतलंबुन दंडप्रणामंबु लाचरिंचि संतोषबाष्पसलिलसंवर्धित पुलकांकुरुंडै यंजलि जेसि कंजातगर्भुनिमीँद दृष्टि यिडि गद्गदस्वरंबुन निट्लनि विनुतिंचे.
          ఇట్లు = విధముగ; దైత్యేశ్వరుండు = హిరణ్యకశిపుడు {దైత్యేశ్వరుడు - దైత్య (రాక్షసుల)కు ఈశ్వరుండు(ప్రభువు),హిరణ్యకశిపుడు}; దివిన్ = ఆకాశమున; ఉన్న = ఉన్నట్టి; హంసవాహనున్ = బ్రహ్మదేవుని {హంసవాహనుడు - హంస వాహనముగా కలవాడు, బ్రహ్మ}; కున్ = కి; ధరణీతలంబునన్ = నేలపైన; దండప్రణామంబులు = దండవన్నమస్కారములు {దండప్రణామము - కర్రవలె సాగి మ్రొక్కుట}; ఆచరించి = చేసి; సంతోష = ఆనందపు; బాష్పసలిల = కన్నీటిచే; సంవర్ధిత = అతిశయించిన; పులకాంకురుండు = గగుర్పాటుగలవాడు; = అయ్యి; అంజలి = నమస్కారము; చేసి = పెట్టి; కంజాతగర్భుని = బ్రహ్మదేవుని {కంజాకగర్భుడు - కంజాత (నీటపుట్టినది పద్మము) గర్భుడు(పుట్టినవాడు), బ్రహ్మ}; మీదన్ = పైన; దృష్టి = చూపు; ఇడి = పెట్టి; గద్గదస్వరంబునన్ = డగ్గుతికతో; ఇట్లు = విధముగ; అని = పలికి; వినుతించె = స్తోత్రము చేసెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: