Wednesday, August 12, 2015

బ్రహ్మవరములిచ్చుట - గాలిం

7-90-శార్దూల విక్రీడితము
గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్,
రేలన్, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ
వ్యా ళాదిత్య, నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర
స్త్రాళిన్, మృత్యువులేని జీవనము లోకాధీశ! యిప్పింపవే.
            సమస్త లోకాలకు అధిపతివి అయిన బ్రహ్మదేవా! గాలిలోగాని; నేలమీద కాని; నిప్పుతో కాని; నీటిలో కాని; ఆకాశంలో కాని; దిక్కులలో కాని; రాత్రి సమయంలో కాని; పగటి సమయంలో కాని; చీకట్లో కాని; వెలుగులో కాని; జంతువులచే కాని; జలజంతువులచే కాని; పాములచే కాని; రాక్షసులు, దేవతలు, మానవులు మున్నగు వారితో యుద్దంలో కాని, సమస్త అస్త్రాలు, శస్త్రాలు వలన కాని మరణం లేని వరం ప్రసాదించు.
            గమనిక ఆయన ఏదో వరం కోరుకోమన్నాడు సరేఅది తను పట్టుపడితేనే కదా. ఈయన పద్దెనిమిది (18) కోరికలు కలిపి కూరేసి వరం అని కోరుతున్నాడు. ఇంతే కాదుట ఇంకో మూడు ఉన్నాయిట (తరువాత వచనంలో). తన కోసం కాదట తమ్ముడి మరణానికి ప్రతీకారం కోసం అజరామరత్వం అది (7-71-.) అట. అది కూడా ప్రతీకారం ఎవరి మీద తీర్చుకోవాలో వారి కొడుకును వరాలు కోరుతున్నాడు. (విష్ణుమూర్తి నాభి కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు) అందుకే హిరణ్యాక్షవరాలు అని అసంబద్ధ కోరికలు అంటారు ఏమో?
७-९०-शार्दूल विक्रीडितमु
गालिं, गुंभिनि, नग्नि, नंबुवुल, नाकाशस्थलिन, दिक्कुलन,
रेलन, घस्रमुलं, दमःप्रभल, भूरिग्राह, रक्षो, मृग
व्या ळादित्य, नरादि जंतु कलहव्याप्तिन, समस्तास्त्र श
स्त्राळिन, मृत्युवुलेनि जीवनमु लोकाधीश! यिप्पिंपवॅ.”
          గాలిన్ = వాయువునందు; కుంభినిన్ = నేలయందు; అంబువులన్ = నీటిలోను; ఆకాశస్థలిన్ = ఆకాశప్రదేశములోను; దిక్కులన్ = దిక్కులందు; రేలన్ = రాత్రికాలమునందు; ఘస్రములన = పగటికాలమునందు; తమః = చీకటియందును; ప్రభలన్ = వెలుగునందు; భూరి = గొప్పగొప్ప; గ్రాహ = మొసళ్ళు; రక్షః = రాక్షసులు; మృగ = క్రూరమృగములు; వ్యాళ = పాములు; ఆదిత్య = దేవతలు {ఆదిత్యులు - అదితి పుత్రులు, దేవతలు}; నర = మానవులు; ఆది = మొదలగు; జంతు = జంతువులతో; కలహ = పోరాటము; వ్యాప్తిన్ = సంభవించినప్పుడు; సమస్త = అన్నిరకముల; అస్త్ర = అస్త్రముల; శస్త్ర = శస్త్రముల; ఆవళిన్ = సమూహముచేతను; మృత్యువు = చావు; లేని = లేనట్టి; జీవనమున్ = బ్రతుకును; లోకాధీశ = బ్రహ్మదేవుడా {లోకాధీశుడు - లోకా (లోకములన్నిటికి) అధీశ (ప్రభువు), బ్రహ్మ}; ఇప్పించవే = అనుగ్రహించుము.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: