Tuesday, December 31, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 157

buddhimaMtu@M

9-386-ఆ.
బుద్ధిమంతుఁ డయిన బుధుఁడు పుత్రుండైన
మేను పెంచి రాజు మిన్నుముట్టె;
బుద్ధిగల సుతుండు పుట్టినచోఁ దండ్రి
మిన్నుముట్టకేల మిన్నకుండు?

          బుద్ధిమంతుడైన కొడుకు పుడితే తండ్రి సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోతాడు. అన్ని విధాల బుద్ధిమంతుడైన బుధుడు తన కొడుకని వృద్ధిచెంది చంద్రుడు ఆకాశాన్ని అందుకున్నాడుట.
తారకి చంద్రుని వలన పుట్టిన వాడు బుధుడు. కవి మిన్నుముట్టు అనే జాతీయాన్ని, సంతోషంతో ఉప్పొంగుట అని, మిన్ను అంటే ఆకాశం ముట్టు అంటే అందుకోడం అనే అర్థాలని, బుధుడు అంటే బుద్ధిమంతుడు అనే అర్థాన్ని చమత్కారంగా ప్రయోగించిన చక్కటి నడక గల పద్యం ఇది.
రెండు లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తు అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఇక్కడ ఉన్నది మిన్నుముట్ట యమకం అందం.

9-386-aa.
buddhimaMtu@M Dayina budhu@MDu putruMDaina
maenu peMchi raaju minnumuTTe;
buddhigala sutuMDu puTTinachO@M daMDri
minnumuTTakaela minnakuMDu?

          బుద్దిమంతుడు = బుద్దిమంతుడు; అయిన = ఐనట్టి; బుధుడు = బుధుడు; పుత్రుండు = కొడుకు; ఐనన్ = కాగా; మేను = శరీరము; పెంచి = పెంచుకొని; రాజు = చంద్రుడు; మిన్నుముట్టెన్ = ఆకాశాన్నందుకొన్నాడు; బుద్ది = వివేకము; కల = కలిగిన; సుతుండు = పుత్రుడు; పుట్టినచోన్ = కలిగిన యెడల; తండ్రి = తండ్రి; మిన్నుముట్టక = గర్వించకుండ; ఏలన్ = ఎందుకు; మిన్నకుండు = ఊరకుండును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, December 30, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 156

saMtasa

1-210-ఉ.
సంతస మింత లేదు మృగశాపవశంబునఁ బాండు భూవిభుం
డంతము నొందియుండ మిము ర్భకులం గొనివచ్చి కాంక్షతో
నింతలవారిఁగాఁ బెనిచె నెన్నఁడు సౌఖ్యముపట్టు గాన దీ
గొంతి యనేక దుఃఖములఁ గుందుచు నుండును భాగ్య మెట్టిదో.

          అంపశయ్యమీద ఉన్న భీష్మాచార్యుల వారు పాండవులతో మాట్లాడుతున్నారు. పాపం! మీ తల్లి కుంతీదేవికి సంతోష రవ్వంతైనా లేదు. పాండురాజు మృగరూపంలో ఉన్న ముని శాపకారణం వలన మరణించడంతో పసికందులైన మిమ్మలను అరచేతిలో పెట్టుకొని పెంచుకొచ్చింది. యింతవారిని చేసింది. ఏ ఒక్కరోజు సౌఖ్యమన్న మాట ఎరుగదు. ఈవిడ దురదృష్టం ఎలాంటిదో కాని జీవితమంతా కష్టాలతో కాపరం గానే  గడుస్తోంది.

1-210-u.
saMtasa miMta laedu mRgaSaapavaSaMbuna@M baaMDu bhoovibhuM
DaMtamu noMdiyuMDa mimu narbhakulaM gonivachchi kaaMkshatO
niMtalavaari@Mgaa@M beniche nenna@MDu saukhyamupaTTu gaana dee
goMti yanaeka du@hkhamula@M guMduchu nuMDunu bhaagya meTTidO.

          సంతసము = సంతోషము; ఇంతన్ = కొంచెము కూడ; లేదు = లేదు; మృగ = మృగము యొక్క; శాప = శాపము; వశంబునన్ = వలన; పాండు = పాండు; భూవిభుండు = రాజు; అంతమున్ = మరణమును; ఒంది = పొంది; ఉండన్ = ఉండగ; మిమున్ = మిమ్ములను; అర్భకులన్ = పసిబిడ్ఢలను; కొనివచ్చి = తీసుకొనివచ్చి; కాంక్ష = బలీయమైన కోరిక; తోన్ = తో; ఇంతలవారిఁగాన్ = ఇంతవారిగ; పెనిచెన్ = పెంచినది; ఎన్నఁడున్ = ఎప్పుడుకూడ; సౌఖ్యము = సుఖము; పట్టున్ = ఒక్కపట్టు కూడ / రవ్వంతయైన; కానదు = ఎరుగదు; = ; గొంతి = కుంతి {గొంతి - కుంతి - కుంతల దేశ ఇంతి}; అనేక = అనేకమైన; దుఃఖములన్ = బాధలతో; కుందుచున్ = కృంగిపోతూ; ఉండును = ఉంటుంది; భాగ్యము = అదృష్టము; ఎట్టిదో = ఎలాంటిదో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, December 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 155

iMtitaMtai

8-622-శా.
ఇంతింతై, వటుఁ డింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
          బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, కొంచం కొంచం ఎదగటం మొదలెట్టాడు. అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు. అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు. అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు. అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు. మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. చూడండి అప్పుడే మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.
భక్తివేదాంతాలతో అలవోకగా పండిత పామరులను అలరిస్తూ సాగే మన బమ్మెరవారి భాగవతంలో మధురాతి మధుర మైనది వామన చరిత్ర. మత్యావతా రాదులు ఎత్తి, మొట్టమొదటి మానవునిగా అవతరించిన పొట్టివాడైనా గట్టివాడిగా బ్రహ్మాండం అంతా వ్యాపించిన మహాద్భుత అవతార చరిత్ర ఇది. అంతేనా మహా మంత్ర పూరితం. కష్టనష్ట నాశకం. శుభప్రదాయకం. అంతటి కథకి సారాంశం ఈ పద్యం. పద్యం నడకలో, పద బందాలలో అలా పెరగటాన్ని ఎంతో అందంగా ప్రతిఫలింపజేసారు పోతనామాత్యులు.
8-622-Saa.
iMtiMtai, vaTu@M DiMtayai maRiyu@M daa niMtai nabhOveethipai
naMtai tOyadamaMDalaagramuna kallaMtai prabhaaraaSipai
naMtai chaMdruni kaMtayai dhruvunipai naMtai maharvaaTipai
naMtai satyapadOnnatuM Daguchu brahmaaMDaaMta saMvardhiyai.
          ఇంతింత = కొంచం మరికొంచం; = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరికొంచం; = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొచం; = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అల్లంత = ఆవత లంత; = అయ్యి; ప్రభారాశి = వెలుగులరాశి, పాలపుంత; పైన్ = కంటె ఎక్కువ ఎత్తు; అంత = అంత; = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; = అయ్యి; ధ్రువుని = ధ్రువుడి కంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; = అయ్యి; మహర్వాటిన్ = మహర్లోకము కంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకము కంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కలవాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివర వరకు; సంవర్ధి = నిండిపోయిన వాడు; = అయ్యి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~