Sunday, December 31, 2017

ద్వారక అస్తమయం - 14

11-23-వ.
మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొనిచని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పిత మాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె.
11-24-క.
"మది సెడి కన్నులుగానక
మదయుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం
గదిసి కులక్షయకారణ
విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?

భావము:
గర్వంతో ఉద్రేకించి చెలరేగిన యాదవబాలురు మునుల శాపం విని భయపడి వడ వడ వణుకుతూ సాంబుడి పొట్టచుట్టూ చుట్టిన చీరల ముడులు విప్పసాగారు. ఆ చీరల పొరలలో నుంచి ఇనుపరోకలి ఒకటి నేల మీద పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుల వారి సన్నిధిలో పెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసినా కూడ, ఏమి తెలియనివాడిలా వాళ్ళతో వాసుదేవుడు ఇలా అన్నాడు. “మీ బుద్ధిచెడి పోయింది. కళ్ళు మూసుకుపోయి, పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెర్రివాళ్ళు ఎవరైనా ఉంటారా. అనుభవించండి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&padyam=24

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, December 30, 2017

ద్వారక అస్తమయం - 13

11-21-క.
యదుడింభకులను గనుఁగొని
మదయుతులై వచ్చి రనుచు మదిలో రోషం
బొదవఁ గనుఁగొనల నిప్పులు
సెదరఁగ హాస్యంబు సనునె చేయఁగ ననుచున్‌.
11-22-క.
"వాలాయము యదుకుల ని
ర్మూలకరం బైన యట్టి ముసలం బొక టీ
బాలిక కుదయించును బొం
డాలస్యము లే ద"టంచు నటఁబల్కుటయున్‌.


భావము:
యాదవబాలురను చూసి ఆ మునుల మనసులలో వీళ్ళు మదంతో మైమరచి వచ్చారని రోషం ఉదయించింది. కనులగొలకుల నిప్పులు చెదరగా “ఇలా హాస్యాలు చేయొచ్చా?” అని అంటూ... “యదువంశాన్ని నాశనం చేసే రోకలి (ముసలం) ఒకటి ఈ బాలికకు తప్పక పుడుతుంది ఆలస్యం కాదు. ఇక పొండి.” అని పలికారు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Friday, December 29, 2017

ద్వారక అస్తమయం - 12

11-19-క.
దర్పించి యాదవులు తమ
నేర్పునఁ గొమరారు సాంబు నెలఁతుకరూపం
బేర్పడ శృంగారించియుఁ
గర్పూర సుగంధి పోల్కిఁ గావించి యొగిన్‌.
11-20-ఉ.
మూఁకలుగూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచుం
బోకలఁ బోవుచున్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచుం
"బ్రాకటమైన యీ సుదతి భారపుగర్భమునందుఁ బుత్త్రుఁడో
యేకత మందు బాలికయొ యేర్పడఁ జెప్పు" డటన్న నుగ్రులై.


భావము:
అక్కడ ఆ మునివేరేణ్యులను చూసిన యాదవ బాలకులలో కొందరు పొగరెక్కి తమ నేర్పుతో సాంబుడికి అందమైన స్త్రీవేషం వేసారు. కడుపుతో ఉండి కర్పూరపు తాంబూలాలు వేసుకోవటంతో ఆ సువాసనలు కలిగిన కలికిలా తీర్చిదిద్దారు. యాదవబాలురు గుంపులు గుంపులుగా చేరి తుళ్ళింతలతో, నవ్వులతో, కేరింతలతో ఆడవేషం వేసిన సాంబుడిని ముందుంచుకుని వెళ్ళారు. మునిసమూహానికి సాగిలపడి మ్రొక్కారు. “ప్రస్ఫుటముగా కనపడుతున్న గర్భం కల ఈ అమ్మాయి కడుపులో మగపిల్లవాడు ఉన్నాడా ఆడపిల్ల ఉందా చెప్పండి?” అని ఆ మునులను అడిగారు. వారి అపహాస్యానికి మునులకు బాగా కోపం వచ్చింది.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Thursday, December 28, 2017

ద్వారక అస్తమయం - 11

11-18-వ.
అని యనేకవిధంబులం బ్రస్తుతించిన మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి, పుండరీకాక్షుం డిట్లనియె; “మదీయధ్యాన నామస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదిక శరణంబులును, మంగళకరణంబులును నగు” ననియును, “నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబులఁ బరిహరించు పురుషుల నైశ్వర్యసమేతులంగాఁ జేయుదు” ననియును, యోగీశ్వరేశ్వరుం డయిన యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ “మీర లిచ్చటికివచ్చిన ప్రయోజనంబేమి?” యనిన వారలు “భవదీయ పాదారవింద సందర్శనార్థంబు కంటె మిక్కిలి విశేషం బొండెద్ది?” యని వాసుదేవవదనచంద్రామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి యథేచ్ఛా విహారులై ద్వారకానగరంబున కనతి దూరంబున నుండు పిండారకం బను నొక్క పుణ్యతీర్థంబున కరిగి; రంత.

భావము:
ఈ విధంగా మునివరులు అనేక విధాల స్తుతించారు. దయగల కడకంటిచూపులతో వారిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నా ధ్యాన నామస్మరణలు పునర్జన్మలు అనే భవరోగాలను హరిస్తాయి. బ్రహ్మ రుద్రుడు మొదలైన వారందరికి శరణమైనవి. సకల మంగళ ప్రదములు. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలగించేవారికి ఐశ్వర్యం కలిగిస్తాను.” అని యోగీశ్వరుడైన ఈశ్వరుడు ఆనతిచ్చి “మీరిక్కడికి ఎందుకు వచ్చారు.” అని అడిగాడు. అందుకు వారు “మీ పాదపద్మాలను దర్శించుట కంటే వేరే విశేషము ఏముంటుంది.” అని పలికి, వాసుదేవుని ముఖచంద్రామృతాన్ని తమ కనులనే చకోరాలతో త్రావి తమ ఇష్టానుసారం విహరించేవారు ద్వారకకు దగ్గరలోని పిండారకము అనే పుణ్యతీర్ధానికి వెళ్ళారు. అప్పుడు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&padyam=18

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, December 25, 2017

ద్వారక అస్తమయం - 10

11-17-క.
శ్రీనాయక! నీ నామము
నానాభవరోగకర్మనాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
కానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా! "


భావము: 
పద్మాపతీ! పద్మలోచన! నీ నామం పునర్జన్మలనే రోగము నశింపజేసే విన్నాణమైన మందు దుష్టాత్ములు పాపం! దీనిని గ్రహించలేరు.”



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం :




Sunday, December 24, 2017

ద్వారక అస్తమయం - 9

11-15-క.
తరణంబులు భవజలధికి
హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు
శరణంబులు, నీదు దివ్యచరణంబు లిలన్‌.
11-16-మత్త.
ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై
పెక్కురూపులు దాల్తు నీ దగు పెంపు మాకు నుతింపఁగా
నక్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!

భావము:
నీ దివ్యమైన పాదములు భవసముద్రం దాటించే నావలు; పాపాలతీగలను హరించేవి; ఆగమములకు అలంకారాలు; ఆర్తులకు శరణములు. పద్మలోచన! లక్ష్మీవల్లభ! ఒకమాటు అణువంత చిన్న రూపం పొందుతావు. ఒకమాటు పెద్ద ఆకృతి దర్శిస్తావు. అంతా నీవై అనేక రూపాలు దర్శిస్తావు. నీ మహిమ స్తోత్రం చేయడానికి అలవిగాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&padyam=15

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, December 23, 2017

ద్వారక అస్తమయం - 8

11-13-క.
వచ్చిన మునిసంఘములకు
విచ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్‌
మెచ్చగు కనకాసనముల 
నచ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌.
11-14-క.
"జనములు నిను సేవింపని
దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం
దనువులు నిలుకడ గావఁట
వనములలో నున్ననైన వనరుహనాభా!


భావము:
అలా వచ్చిన శ్రీకృష్ణుడు మునులకు ఆర్ఘ్యం పాద్యం మొదలైన మర్యాదలు విస్తృతంగా చేసాడు. అటుపిమ్మట వారు మేలిమి బంగారు ఆసనాల మీద ఆసీనులై పద్మనేత్రుడైన కృష్ణుడితో ఇలా అన్నారు.
“పద్మనాభా! నిను సేవించని దినములు సర్వం మానవులకు ప్రయోజన శూన్యములు; అడవులలో ఉన్నా దేహాలకు నిలుకడలు లేనివి.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::