Tuesday, May 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 298

లాలనమున

10.1-366-క.
లాలనమున బహుదోషము
లోలిం బ్రాపించుఁ దాడనోపాయములన్
జాల గుణంబులు గలుగును
బాలురకును దాడనంబ పథ్యం బరయన్.
          గారాబం ఎక్కువ చేస్తే చివరికి పిల్లలు బాగ చెడిపోతారు. అప్పుడప్పుడు కొట్టి దండించటం అనే ఉపాయం ప్రయోగిస్తుంటే చాల మంచి గుణాలు అలవడతాయి. పిల్లల దుడుకుతనానికి దండోపాయమే మంచి మందు.
బాల కృష్ణుని శైశవ క్రీడా లీలలోని అల్లరి పనులు చూసి యశోద దెబ్బ పడితేగాని బుద్ధిగా ఉండడని భావిస్తూ ఇలా ప్రసిద్ధమైన నీతి సూత్రాన్ని తలచింది; తరిమి పట్టుకొని కొట్టడానికి చేతులు రాక “వీరెవ్వరు శ్రీకృష్ములు గారా అంటు” కట్టేసింది; “ఱోలను కట్టుబడియు న బ్బాలుడు ” మద్ధిచెట్ల జతను కూల్చాడు.
10.1-366-ka.
laalanamuna bahudOshamu
lOliM braapiMchu@M daaDanOpaayamulan
jaala guNaMbulu galugunu
baalurakunu daaDanaMba pathyaM barayan.
          లాలనమునన్ = గారాబముచేత; బహు = అనేకమైన; దోషములు = లోపములు; ఓలిన్ = క్రమముగా; ప్రాపించున్ = కలుగును; తాడనోపాయములన్ = దండోపాయములచేత; చాలన్ = మిక్కిలిగ; గుణంబులున్ = సుగుణములు; కలుగును = లభించును; బాలురు = మగపిల్లల; కును = కు; తాడనంబ = కొట్టి దండించుటయే; పథ్యంబు = తగిన పని, మందు; అరయన్ = తరచి చూసినచో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, May 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 296


మావారిభస్మరాసుల

9-221-క.
మా వారి భస్మరాసుల
నీ వారిం గలిపికొనుము; నెఱి మావారల్
నీ వారిఁ గలయ నాకము
మావారికిఁ గలుగు నిది ప్రమాణము తల్లీ!
          ఓ యమ్మా గంగమ్మతల్లి! మా పూర్వీకుల భస్మరాసులను నీ నీటిలో కలిపేసుకో. అలా చక్కగా నీ పవిత్రజలాలలో కలిస్తే మా వాళ్ళకు స్వర్గలోకప్రాప్తి కలుగుతుంది. ఇది యథార్థం.
భాగీరథ ఘట్టంలోని పద్యమిది. భాగీరథ ప్రయత్నం అంటే బహుతర కష్టసాధ్యమని పేరు పడింది. పవిత్ర గంగానది భాగీరథి అనికూడ ప్రసిద్ధికెక్కింది. అంతటి మహనీయుడు భాగీరథుడు. గంగాదేవి కోసం తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను ఇలా వరం వేడుకుంటున్నాడు. ప్రాస, ఉత్తర స్థానాలలో నాలుగు పాదాలలోను అవే అక్షరాలు వాడిన తీరు ప్రత్యేక అందానిచ్చింది.
9-221-ka.
maa vaari bhasmaraasula
nee vaari@M galipikonumu; neRi maavaaral
nee vaari@M galaya naakamu
maavaariki@M galugu nidi pramaaNamu tallee!
          మా = మా యొక్క; వారి = ఆత్మీయుల; భస్మ = బూడిద; రాసులన్ = గుట్టలను; నీ = నీ యొక్క; వారిన్ = నీటి యందు; కలిపికొనుము = కలిపేసుకొనుము; నెఱిన్ = చక్కగా; మా = మా యొక్క; వారల్ = తండ్రులు; నీ = నీ యొక్క; వారిన్ = నీటిలో; కలయన్ = కలయుట చేత; నాకమున్ = స్వర్గము; మా = మా యొక్క; వారి = తండ్రుల; కిన్ = కు; కలుగున్ = లభించును; ఇది = ఇది; ప్రమాణము = యథార్థము; తల్లీ = అమ్మా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

తెలుగు భాగవత తేనె సోనలు – 297


సూనృతంబుగాని

 8-643-ఆ.
సూనృతంబుఁ గాని నుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు జేసి పెట్టు నిర్మలాత్మ!
          ఓ పుణ్యాత్ముడా! నా నాలుక సత్యాన్ని తప్ప పలుకనే పలుకదు. అబద్దమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్య మన్నది లేదు. నీ మూడవ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా!
మూడడుగులు దానంగా గ్రహించిన, వామనుడు త్రివిక్రమావతారం ధరించి రెండు అడుగులలో మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావు చూపించమన్నాడు. పరమ దానశీలుడు, సత్యసంధుడు అయిన బలిచక్రవర్తి ‘నీ పాదం నా తలమీద పెట్టు పరమేశా!’ అని ఇలా సమాధానం చెప్తున్నాడు
8-643-aa.
soonRtaMbu@M gaani nuDiyadu naa jihva
boMka@Mjaala; naaku boMku laedu;
nee tRteeyapadamu nijamu naa Siramuna
nelavu jaesi peTTu nirmalaatma!
          సూనృతంబు = సత్యమైన దానిని; కాని = తప్పించి; నుడియదు = పలుకదు; నా = నా యొక్క; జిహ్వ = నాలుక; బొంకజాల = అబద్దము చెప్పలేను; నా = నా; కున్ = అందు; బొంకు = అసత్యము; లేదు = లేదు; నీ = నీ యొక్క; తృతీయ = మూడవ (3); పదమున్ = అడుగును; నిజమున్ = తథ్యముగా; నా = నా యొక్క; శిరమునన్ = తలపైన; నెలవు = వసించునట్లు; చేసి = చేసి; పెట్టు = పెట్టుము; నిర్మల = స్వచ్ఛమైన; ఆత్మ = మనసు కలవాడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~