Sunday, May 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 296


మావారిభస్మరాసుల

9-221-క.
మా వారి భస్మరాసుల
నీ వారిం గలిపికొనుము; నెఱి మావారల్
నీ వారిఁ గలయ నాకము
మావారికిఁ గలుగు నిది ప్రమాణము తల్లీ!
          ఓ యమ్మా గంగమ్మతల్లి! మా పూర్వీకుల భస్మరాసులను నీ నీటిలో కలిపేసుకో. అలా చక్కగా నీ పవిత్రజలాలలో కలిస్తే మా వాళ్ళకు స్వర్గలోకప్రాప్తి కలుగుతుంది. ఇది యథార్థం.
భాగీరథ ఘట్టంలోని పద్యమిది. భాగీరథ ప్రయత్నం అంటే బహుతర కష్టసాధ్యమని పేరు పడింది. పవిత్ర గంగానది భాగీరథి అనికూడ ప్రసిద్ధికెక్కింది. అంతటి మహనీయుడు భాగీరథుడు. గంగాదేవి కోసం తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను ఇలా వరం వేడుకుంటున్నాడు. ప్రాస, ఉత్తర స్థానాలలో నాలుగు పాదాలలోను అవే అక్షరాలు వాడిన తీరు ప్రత్యేక అందానిచ్చింది.
9-221-ka.
maa vaari bhasmaraasula
nee vaari@M galipikonumu; neRi maavaaral
nee vaari@M galaya naakamu
maavaariki@M galugu nidi pramaaNamu tallee!
          మా = మా యొక్క; వారి = ఆత్మీయుల; భస్మ = బూడిద; రాసులన్ = గుట్టలను; నీ = నీ యొక్క; వారిన్ = నీటి యందు; కలిపికొనుము = కలిపేసుకొనుము; నెఱిన్ = చక్కగా; మా = మా యొక్క; వారల్ = తండ్రులు; నీ = నీ యొక్క; వారిన్ = నీటిలో; కలయన్ = కలయుట చేత; నాకమున్ = స్వర్గము; మా = మా యొక్క; వారి = తండ్రుల; కిన్ = కు; కలుగున్ = లభించును; ఇది = ఇది; ప్రమాణము = యథార్థము; తల్లీ = అమ్మా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: