Friday, July 12, 2024

వాల్మీకి తెలుగు రామాయణము - శతతమ సర్గ

 2.100.28.అనుష్టుప్.

కచ్చిత్త్వాం నావజానంతి
      యాజకాః పతితం యథా।
ఉగ్రప్రతిగ్రహీతారమ్
      కామయానమివ స్త్రియః
॥

తాత్పర్యము :-
      కాముకులను స్త్రీలు అవమానించునట్లు, వేదపండితులైన ఋత్విక్కులు

భయకరమైన దానములు కోరు పతితులను నిరసించురీతి నిన్ను అవమానించుటలేదు కదా?

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= ప్రశ్నార్థకము, కదా; త్వాం = నిన్ను; న = లేదు; అవజానంతి = అవమానించుట; యాజకాః = ఋత్విక్కులు; పతితం = పతితుని; యథా = వలె; ఉగ్ర = భయంకరముగ; ప్రతిగ్రహీతారమ్ = దానములు ప్రతిగ్రహించు; కామయానమ్ = కాముకులను; ఇవ = వలె; స్త్రియః = స్త్రీలు.

2.100.29.అనుష్టుప్.

ఉపాయకుశలం వైద్యమ్
      భృత్యసందూషణే రతమ్।
శూరమైశ్వర్యకామం చ
      యో న హంతి స హన్యతే॥

తాత్పర్యము :-
      రాజోద్యోగులకు ప్రభువుపై లేనిపోనివి చెప్పి పుల్లలు పెట్టే భత్యుసందోషణము చేయు దుష్టవర్తన వాడూ, రాజులు ప్రయోగించు సామదానాది చతుర్విధోపాయము లందు నేర్పు కలవాడూ ఐన విద్యావంతుని. మఱియు సంపదలందు వెంపర్లాడు శూరుడుని సంహరింప వలెను. అటుల సంహరింపని వాడు నశించును.

ప్రతిపదార్థము :-
      ఉపాయ
= సామదానిది యందు, ఆంధ్రశబ్దరత్నాకరము; కుశలం = నేర్పు గలవానిని; వైద్యమ్ = పండితుని; భృత్యసందూషణే = భత్యసందూషణ యందు; రతమ్ = ఆసక్తికలవాడైన; శూరమ్ = శూరుని; ఐశ్వర్య = సంపదలపై; కామం = అమితాసక్తి కలవాడైన; చ = మఱియు; యో = ఎవరైతే; న = లేదో; హంతి = చంపుట; స = అతడు; హన్యతే = చంపబడును.

*గమనిక :-

      ;(1) ఉపాయము- రాజు శత్రువులను లొంగదీయు సాధనములైన సాధన విశేషము, చతుర్విధోపాయములైన సామదాన బేధ దండోపాయములు, (2) వైద్యుడు- వ్యుత్పత్తి. విద్యా+ అణ్, త.ప్ర., పండితుడు, చికిత్సకుడు. (3) భృత్యసందూషణము- లేనిపోనివి చెప్పి మనస్సు విరిచి, ఉద్యోగులను ప్రభువునకు ఎదురుతిరుగునట్లు చేయుట.

2.100.30.అనుష్టుప్.

కచ్చిద్ధృష్టశ్చ శూరశ్చ
      మతిమాన్ ధృతిమాన్ శుచిః।
కులీనశ్చానురక్తశ్చ
      దక్షస్సేనాపతిః కృతః॥

తాత్పర్యము :-
      వ్యవహారములు నిర్వహించుటలో ప్రతిభ కలవాడూ, శత్రువులతో యుద్దమునందు నిర్భభయుడై విజయము సాధించువాడూ, వ్యూహరచనాది సకల సైనిక కార్యము లందు సూక్ష్మబుద్ధి కలవాడూ, విపత్సమయములలో ధైర్యముతో కాగల కార్యము సాధించువాడూ, ఉపధ- ప్రలోభములైన ధర్మార్థ కామములచేత గుణములు పరీక్షించబడి శుద్ధుడుగా నిగ్గుతేలినవాడూ, మంచి వంశమున పుట్టినవాడూ, స్వామియందు రాజ్యమునందు భక్తి కలవాడూ ఐనవానినే సేనాపతిగా నియమించితివి కదా
?

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= ఎవరైతే; ధృష్టః = ప్రతిభ కలవాడు, వావిళ్ళ నిఘంటువు; చ = మఱియు; శూరః = యుద్ధమునకు భయపడనివాడు, వావిళ్ళనిఘంటువు; చ = మఱియు; మతిమాన్ = సూక్ష్మబుద్ధి; ధృతిమాన్ = ధైర్యశాలి; శుచిః = ఉపధాశుద్ధుడయిన వ్యక్తి, శబ్దరత్నాకరము; కులీనః = మంచికులమున పుట్టినవాడు; చ = మఱియు; అనురక్తః = అనురక్తి కలవాడు; చ = మఱియు; దక్షః = సమర్థుడు; సేనాపతిః = సేనాపతి; కృతః = చేయబడెను.

2.100.31.అనుష్టుప్.

బలవంతశ్చ కచ్చిత్తే
      ముఖ్యా యుద్దవిశారదాః।
దృష్టాపదానా విక్రాంతా
      త్వయా సత్కృత్యమానితాః
॥

తాత్పర్యము :-
     
శ్రేష్టమైన యుద్దతంత్రజ్ఞులను, అత్యంత బలశాలులను, ఎంతోమంది శూరులను ఓడించి ప్రసిద్ధులైన వారిని ఆదరించి గౌరవించుచుంటివి కదా?

ప్రతిపదార్థము :-
      బలవంతః
= అత్యంత బలశాలులు; చ = మఱియు; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; తే = ఆ; ముఖ్యా = శ్రేష్టమైనవారు; యుద్దవిశారదాః = యుద్ధ తంత్రము లందు నేర్పరులు; దృష్టా = వ్యక్తమైన, ప్రగల్భ; పదానా = ఓడించుట; విక్రాంతా = శూరులు కలవారు; త్వయా = నీచేత; సత్కృత్య = ఆదరించి; మానితాః = గౌరవించబడుచుంటిరి.

Tuesday, July 9, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]

2.100.26.అనుష్టుప్.

అమాత్యానుపధాతీతాన్

పితృపైతామహాంఛుచీన్।

శ్రేష్ఠాంఛ్రేష్ఠేషుకచ్చిత్వమ్

నియోజయసి కర్మసు॥


తాత్పర్యము :- 

మంత్రులు పరిశుద్ధమైన వర్తన కలవారు, వంశపారంపర్యంగా మన దగ్గరే ఉంటున్నవారు, ప్రలోభాలకు లొంగని స్వభావము కలవారు. ఆ శ్రేష్టులను ప్రధానమైన కార్యక్రమములందు నియమించుచుంటివి కదా?


ప్రతిపదార్థము :- 

అమాత్యాన్ = మంత్రులను; ఉపధా = ప్రలోభములకు; అతీతాన్ = లొంగనివారు; పితృపైతామహాన్ = వంళపారంపర్యంగా వచ్చినవారు; శుచీన్ = పరిశుద్ధ వర్తన కలవారు; శ్రేష్ఠామ్ = శ్రేష్ఠులను; శ్రేష్ఠేషు = శ్రేష్ఠమైనవాని; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; త్వమ్ = నీవు; నియోజయసి = నియమించుచుంటివి; కర్మసు = కార్యము లందు.


*గమనిక :- 

ఉపధ- ధర్మార్థ కామములచేత మంత్రి మున్నగువారి ఎంపికలో వారి గుణములు పరీక్షించుట. ఆంధ్రశబ్దరత్నాకరము. ఉపధయందు వాడునట్టి ప్రలోభములకు అతీతులు అయినవారు నెగ్గి పదవికి అర్హత పొందుదురు. కనుక వారిని ఉపధాతీతులు అందురు.


2.100.27.అనుష్టుప్.

కచ్చిన్నోగ్రేణ దండేన

భృశముద్వేజితప్రజమ్।

రాష్ట్రం తవానుజానంతి

మంత్రిణః కైకయీసుత!॥


తాత్పర్యము :- 

ఓ కైకేయిపుత్ర భరతా! ప్రజలు బెదరిపోయెడి ఉద్దండశిక్షలు విధించుటకు, నీ దేశ మంత్రులను అనుమతించవు కదా?


ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; ఉగ్రేణ = తీక్షణమైన; దండేన = శిక్షలకు; భృశమ్ = మిక్కలి; ఉద్వేజిత = వెఱపుచెందిన; ప్రజమ్ = పౌరులను; రాష్ట్రమ్ = దేశపు;  తవ = నీ; అనుజానంతి = అనుమతించుట; మంత్రిణః = మంత్రులను; కైకయీసుత = కైకేయి పుత్రుడ.

-----


శ్రీరామ రక్ష జగదభి రక్ష

Friday, April 12, 2024

మాగాయ పచ్చడి పసందు - సౌజన్యము కరుణశ్రీ

కవిసార్వభౌములవారు సహజకవీశ్వరులు బమ్మెఱ పోతనామాత్యులవారికి ఆంధ్రీకరించిన భాగవతము ఎటులున్నదో వర్ణిస్తున్నారట

మూలమునలేనియీ యందచందములు మరెవ్వరి గంటములందు నింతగా రూపొందలేదే! వరాలకు నెత్తుకెత్తుగా నా చక్కఁ దనాల పద్యములు వ్రాయుటకు నీవే తగుదువయ్యా! ఎన్ని పోకడలు పోయితివి! ఎంత చక్కఁగ నూహించితివి! ఎంత రసవత్తరముగఁ జెప్పితివి మహాకవీ!

 

సీ.

భీష్మునిపైకి కుప్పించి లంఘించు గో
పాలకృష్ణుని కుండలాలకాంతి
కరిరాజు మొరపెట్ట పఱువెత్తు కరివేల్పు
ముడివీడి మూపుపై బడిన జుట్టు
సమరమ్ము గావించు సత్య కన్నులనుండి
వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి సల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ
సందు మాగాయ పచ్చడి పసందు

తే.

ఎటుల కనుగొంటివయ్య! నీ కెవరు చెప్పి
రయ్య! ఏరాత్రి కలగంటి వయ్య! రంగు
కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు!
సహజ పాండితి కిది నిదర్శనమటయ్య

 

సస్యశ్యామలములగు సుందరక్షేత్రములలో విహరించుచు సర్వాంగ సుందరమగు నీభాగవతమహాగ్రంథమును వెలయించినావు. నన్నయతిక్కనాదులు భాగవతమును తెలిఁగింపక విడిచినది నీ కోసమే కాఁబోలు. ఈ మహాకార్యముచే నీవు ధన్యుఁడవైతివి. తెలుఁగుతల్లి ధన్యురాలైనది"

 ~ కరుణశ్రీ


Friday, February 3, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-125-క.
రాజీవసదృశనయన! వి
రాజితసుగుణా! విదేహరాజవినుత! వి
భ్రాజితకీర్తి సుధావృత
రాజీవభవాండభాండ! రఘుకులతిలకా!
11-126-మాలి.
ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కోసలక్షోణిభర్తా!
సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!

భావము:
పద్మములవంటి కన్నులు కలవాడ! ప్రకాశించే సుగుణాలు కలవాడా జనక మహారాజుచే పొగడబడినవాడ! ప్రకాశించే కీర్తి అనే అమృతంతో ఆవరించబడిన బ్రహ్మాండభాండం కలవాడ! రఘువంశానికి తిలకం వంటివాడ! శ్రీరామచంద్ర ప్రభు! భూదేవి పుత్రిక యైన సీతాదేవిని ఆనందింప జేయు వాడా! ధర్మమార్గాన్ని సదా అనుసరించిన వాడా! సాటిలేని నీతిమంతుడా! దేవతల శత్రువు లైన రాక్షసులను సంహరించిన వాడా! కోసల దేశ రాజ! దేవతల భయమును పోగొట్టిన వాడ! పండితుల హృదయాలలో విహరించు వాడ! శ్రీరామ!

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=126

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Thursday, February 2, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౬(726)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-123-క.
ఈ కథ విన్నను వ్రాసిన
బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం
జేకొని యాయువు ఘనుఁడై
లోకములో నుండు నరుఁడు లోకులు వొగడన్‌.
11-124-చ.
నగుమొగమున్‌ సుమధ్యమును నల్లని మేనును లచ్చికాటప
ట్టగు నురమున్‌ మహాభుజము లంచితకుండలకర్ణముల్‌ మదే
భగతియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁబొడసూపుఁగాతఁ గనుమూసినయప్పుడు విచ్చినప్పుడున్‌.

భావము:
ఈ కథను విన్నవారు, వ్రాసినవారు సిరిసంపదలు కీర్తి అదృష్టము కలిగి దీర్ఘాయువుతో లోకులు మెచ్చే గొప్పవారై ప్రకాశిస్తారు. నవ్వు ముఖము; చక్కని నడుము; నల్లని దేహము; లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము; పెద్ద బాహువులు; అందమైన కుండలాలు కల చెవులు; గజగమనము; నల్లనిజుట్టు; దయారసం చిందే చూపు కలిగిన విష్ణుమూర్తి నేను కనులు మూసినపుడు తెరచినపుడు పొడచూపు గాక.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=124

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, February 1, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౫(725)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-122-వ.
అనుచు నా దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె; “యాదవసముద్రం బడంగె; బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడం బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?” నని పలుకునవసరంబున దివ్యాయుధంబులును, దివ్య రథరథ్యంబులు నంతర్ధానంబు నొందె; నారాయణుండు వానితో“ నక్రూరవిదురులకు నీవృత్తాంతం బంతయుఁ జెప్పుము; సవ్యసాచిం గని స్త్రీ బాల గురు వృద్ధ జనంబులఁ గరిపురంబునకుం గొనిచను మనుము; పొ” మ్మనిన వాఁడును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ జెప్పె; నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె; నంత నెవ్వరికిం జనరాకయుండె నప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును, బ్రహ్మరుద్రాదిదేవతలును, జయజయశబ్దంబులతోడం గదలిరా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై యుండె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె" నని చెప్పి.

భావము:
అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది.
అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=122

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..