Wednesday, February 1, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౫(725)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-122-వ.
అనుచు నా దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె; “యాదవసముద్రం బడంగె; బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడం బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?” నని పలుకునవసరంబున దివ్యాయుధంబులును, దివ్య రథరథ్యంబులు నంతర్ధానంబు నొందె; నారాయణుండు వానితో“ నక్రూరవిదురులకు నీవృత్తాంతం బంతయుఁ జెప్పుము; సవ్యసాచిం గని స్త్రీ బాల గురు వృద్ధ జనంబులఁ గరిపురంబునకుం గొనిచను మనుము; పొ” మ్మనిన వాఁడును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ జెప్పె; నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె; నంత నెవ్వరికిం జనరాకయుండె నప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును, బ్రహ్మరుద్రాదిదేవతలును, జయజయశబ్దంబులతోడం గదలిరా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై యుండె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె" నని చెప్పి.

భావము:
అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది.
అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=122

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments: