Friday, January 6, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౨(712)

( అవధూత సంభాషణ ) 

11-105-వ.
అని యడిగిన నయ్యాదవేంద్రుం డిట్లని పలుకం దొడంగె; “దారు మధ్యభాగంబున ననలంబు సూక్ష్మరూపంబున వర్తించు చందంబున నందంబై సకలశరీరుల యందు నచ్ఛేద్యుండు నదాహ్యుండు నశోష్యుండునైన జీవుండు వసించి యుండు” ననిన హరికి నుద్ధవుం డిట్లనియె; “సనక సనందనాది యోగీంద్రులకు యోగమార్గం బేరీతి నానతిచ్చితి, వది యేవిధం? బానతీయవే” యని యభ్యర్థించిన నతం డిట్లనియె; “వారలు చతుర్ముఖు నడిగిన నతండు, “నేనును దెలియనేర” ననిన వారలు విస్మయం బందుచుండ నేనా సమయంబున హంసస్వరూపుండ నై వారల కెఱింగించిన తెఱుంగు వినుము; పంచేంద్రియంబులకు దృష్టం బయిన పదార్థం బనిత్యంబు; నిత్యదృష్టి బ్రహ్మం బని తెలియవలయు; దేహి కర్మార్జిత దేహుండై సంసారమమతలు నిరసించి, నిశ్చలజ్ఞాన యుక్తుండై మత్పదప్రాప్తుండగు; స్వప్నలబ్ధ పదార్థంబు నిజంబు గాని క్రియఁ గర్మానుభవపర్యంతంబు కళేబరంబు వర్తించు నని సాంఖ్యయోగంబున సనకాదుల కెఱింగించిన విని, బ్రహ్మ మొదలైన దేవత లెఱింగిరి; వారివలన భూలోకంబునఁ బ్రసిద్ధం బయ్యె; నదిగావున నీవును నెఱింగికొని, పుణ్యాశ్రమంబులకుం జను; మస్మదీయ భక్తియుక్తుండును, హరిపరాయణుండునైన యతని చరణరజఃపుంజంబు తన శరీరంబు సోఁకజేయు నతండును, ముద్రాధారణపరులకును హరి దివ్యనామంబులు ధరియించు వారలకు నన్నోదకంబుల నిడు నతండును, వాసుదేవభక్తులం గని హర్షించు నతండును, భాగవతు” డని చెప్పి మఱియు “సర్వసంగపరిత్యాగంబు సేసి, యొండెఱుంగక నన్నే తలంచు మానవునకు భుక్తి ముక్తి ప్రదాయకుండనై యుండుదు” నని యానతిచ్చిన నుద్ధవుండు “ధ్యాన మార్గంబే రీతి? యానతీయవలయు” ననిన హరి యిట్లనియె; ఏకాంత మానసులై హస్తాబ్జంబు లూరుద్వయంబున సంధించి, నాసాగ్రంబున నీక్షణంబు నిలిపి, ప్రాణాయామంబున నన్ను హృదయగతుంగాఁ దలంచి, యష్టాదశ ధారణాయోగసిద్ధు లెఱింగి, యందణిమాదులు ప్రధాన సిద్ధులుగాఁ దెలిసి, యింద్రియంబుల బంధించి, మనం బాత్మయందుఁ జేర్చి, యాత్మనాత్మతోఁ గీలించిన బ్రహ్మపదంబుఁ బొందు; భాగవతశ్రేష్ఠు లితరధర్మంబులు మాని నన్నుం గాంతురు; తొల్లి పాండునందనుఁడగు నర్జునుండు యుద్ధరంగంబున విషాదంబు నొంది యిట్ల యడిగిన నతనికి నేఁ జెప్పిన తెఱం గెఱింగించెదఁ; జరాచరభూతంబయిన జగంబంతయు మదాకారంబుగా భావించి, భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబులందు జీవుండును, దుర్జయంబులందు మనంబును, దేవతలందుఁ బద్మగర్భుండును, వసువులందు హవ్యవాహుండును, నాదిత్యులందు విష్ణువును, రుద్రులందు నీలలోహితుండును, బ్రహ్మలందు భృగువును, ఋషులందు నారదుండును, ధేనువులందుఁ గామధేనువును, సిద్ధులయందుఁ గపిలుండును, దైత్యులయందుఁ బ్రహ్లాదుండును గ్రహంబులందుఁ గళానిధియును, గజంబులయం దైరావతంబును, హయంబులయం దుచ్చైశ్శ్రవంబును, నాగంబులందు వాసుకియును, మృగంబులందుఁ గేసరియు, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబును, వర్ణంబులయం దోంకారంబును, నదులందు గంగయు, సాగరంబుల యందు దుగ్ధసాగరంబును, నాయుధంబులందుఁ గార్ముకంబును, గిరు లందు మేరువును, వృక్షంబుల యందశ్వత్థంబును, నోషధుల యందు యవలును, యజ్ఞంబుల యందు బ్రహ్మయజ్ఞంబును, వ్రతంబులం దహింసయు, యోగంబులం దాత్మయోగంబును, స్త్రీల యందు శతరూపయు భాషణంబులయందు సత్యభాషణంబును, ఋతువులందు వసంతాగమంబును, మాసంబులలో మార్గశీర్షంబును, నక్షత్రంబులలో నభిజిత్తును, యుగంబులందుఁ గృతయుగంబును, భగవదాకారంబులందు వాసుదేవుండును, యక్షుల లోఁ గుబేరుండును, వానరులం దాంజనేయుండును, రత్నంబు లందుఁ బద్మరాగంబును, దానంబులలోనన్నదానంబును, దిథు లయం దేకాదశియు, నరులయందు వైష్ణవుండై భాగవతప్రవర్తనం బ్రవర్తించువాఁడును, నివియన్నియు మద్విభూతులుగా నెఱుంగు" మని కృష్ణుం డుద్ధవునకు నుపన్యసించిన వెండియు నతం డిట్లనియె.

భావము:
అలా అడిగిన ఉద్ధవుడికి యాదవ ప్రభువు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “కఱ్ఱ లోపల అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా, సకల శరీరాలలోను అచ్ఛేద్యుడు అదాహ్యుడు అశోష్యుడు అయిన జీవుడు నివసిస్తూ ఉంటాడు.” అనగా ఉద్ధవుడు మరల ఇలా అడిగాడు. “సనకుడు సనందుడు మున్నగు యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిదో నాకు చెప్పు.” అంత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “వారు మొదట ఈ విషయం గురించి బ్రహ్మదేవుడిని అడిగారు. అతడు తనకు కూడ తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, నేను ఆ సమయంలో హంస రూపం ధరించి వాళ్ళకు చెప్పాను. ఆ వివరం చెప్తాను శ్రద్ధగా విను.
పంచేంద్రియాలకూ కనిపించే పదార్థమంతా అనిత్యం. నిత్యమైనది బ్రహ్మం మాత్రమే. పూర్వజన్మ కృత కర్మలచేత లభించిన శరీరం కలవాడైన దేహి, సంసార మందు మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది, నా స్థానాన్ని ప్రాప్తిస్తాడు. కలలో దొరికిన పదార్ధం నిజం కానట్లుగా, కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది. అని సాంఖ్య యోగాన్ని సనకాదులకు చెప్పాను. అది వినిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు తెలుసుకున్నారు. ఆ యోగం వారి వలన భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి, నీవు తెలుసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. ఇంకా, నా మీద భక్తి ఆసక్తికలవారి పాదరేణువులు తన శరీరానికి సోకించుకుండేవాడు; శంఖమూ చక్రమూమొదలైన ముద్రలను ధరించేవాడు; హరిదివ్యనామాలు ధరించేవారికీ అన్నమూ నీళ్ళూ ఇచ్చేవాడు; విష్ణుభక్తులను కాంచి సంతోషించేవాడు కూడ భాగవతుడు అని తెలియుము. అన్ని సంగాలను వదలి, ఇతరము ఎరుగక, నన్నేతలచే మానవునకు భుక్తినీ, ముక్తినీ ఇస్తాను.” అని బోధించాడు. అంత, ఉద్ధవుడు ధ్యానమార్గ స్వరూపం చెప్ప మని మళ్ళీ అడిగాడు. శ్రీహరి ఇలా అన్నాడు.
“ఏకాంతంగా కూర్చుని తొడలమీద చేతులు కలిపి పెట్టుకుని, ముక్కు చివర చూపు నిలిపి, ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవాడిగా భావించి. పద్దెనిమిది విధాల ధారణా యోగసిద్ధులను తెలుసుకుని, అందు అణిమ మొదలైన వానిని ప్రధాన సిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలో చేర్చి, ఆత్మను పరమాత్మతో లగ్నంచేసి, బ్రహ్మపదాన్మి పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు.
ఇంతకుముందు పాండుకుమారుడైన అర్జునుడు రణరంగంలో విషాదం పొంది, ఇలానే అడిగితే, అతనికి చెప్పిందే నీకూ చెప్తున్నాను విను. చరచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా, నా ఆకారంగా భావించి భూతాలలో ఆధారభూతము సూక్ష్మములందు జీవుడు, దుర్జనమైన వాటిలో మనస్సు, దేవతలలో బ్రహ్మదేవుడు, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుఱ్ఱములలో ఉచ్ఛైశ్రవము, నాగులలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములలో గృహస్థాశ్రమము, వర్ణములలో ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలలో శతరూప, పలుకులలో సత్యము, ఋతువులందు వసంతము, మాసములలో మార్గశిరము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు ఇవి అన్నీ నా విభూతులుగా తెలుసుకో.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించాడు. మళ్ళీ ఉద్ధవుడు ఇలా అడిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=105

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Thursday, January 5, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౧(711)

( అవధూత సంభాషణ ) 

11-104-క.
"ధ్యానం బేక్రియ నిలుచును?
ధ్యానం బే రీతిఁ దగు? నుదాత్తచరిత్రా!
ధ్యానప్రకార మంత య
నూనంబుగఁ జెప్పు మయ్య యుర్వీరమణా!"

భావము:
అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలా అడిగాడు. “ఓ ఉదాత్తచరిత్రా! భూదేవీకళత్రా! ధ్యానం ఎలా నిలుబడుతుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? ఆ ధ్యానం గురించి వివరంగా నాకు చెప్పు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=104

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, January 4, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౦(710)

( అవధూత సంభాషణ ) 

11-103-వ.
మఱియు నొక్క విశేషం బయిన పురాతనపుణ్యకథ వినుము; కనకావతీపురంబున నొక్క ధరామరుని కన్యకారత్నంబు గల; దవ్వ ధూతిలకంబు రత్నసమేతంబు లగు కంకణంబులు ధరియించి బంధుజనంబులకుఁ బరమాహ్లాదంబుగా నన్నంబు గావించుట కొఱకు శాలితండులంబులు దంచునప్పుడు ముసలగ్రహణభారంబునఁ గంకణంబు లతిరావంబుగా మ్రోయుచుండ నప్పరమపతివ్రత యందులకు నసహ్యపడి యన్నియు డులిచి యొక్కటి నిలిపె; నట్లుగావునఁ దత్తఱపడక భగవదాయత్తంబైన యేకచిత్తంబునం బ్రసన్నచిత్తులై నరులు ముక్తులగుదురు; గావున నవిద్యావిద్యలు నా మాయగా విచారించి, కేవల పశుమార్గులు కాక షడ్గుణైశ్వర్య సంసన్నులైన యోగీశ్వరుల పగిది సుఖంబు గోరక యుండు వారలు ముక్తులగుదురు; సర్వంబును విష్ణుమాయగాఁ దెలియు” మని యుద్ధవునికిం జెప్పిన నతండు “దేవా! నీరూపం బేలాగునం గానవచ్చు”ననిన నతం డిట్లనియె; “భక్తిభావనపరాయణుండై కృపారస తత్పరుండై మితభాషణుండై బొంకక కర్మంబులు మదర్పణంబుగాఁ జేసిన యతండు భాగవతుఁడనం బరఁగు; మత్కథలును మజ్జన్మకర్మంబులును వినుచు మత్సేవకులైన భాగవతులం జూచి తన గృహంబునకుం గొనిపోయి, మజ్జన పూజన భోజన శయనా సనాదికంబులఁ బరితుష్టులం జేసిన యతండైనను భాగవతుండనఁ బడు; నిట్లెంతకాలంబు జీవించు, నంతకాలంబును నడపునతండు మద్రూపంబున వైకుంఠనిలయంబు నొందు; నదియునుం గాక గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబుల లక్ష్మీసమేతుండనై, శంఖ చక్ర గదాశార్‌ఙ్గాది యుక్తుఁడ నైన నన్ను శుక సనకాది యోగీంద్రులును, నంబరీష విభీషణ రుక్మాంగదులు మొదలు గాఁగల భాగవతులును, శాస్త్రాచారచోదితులు గాక భక్తి భావనావిశేషంబున నేమఱక నిత్యంబును జింతనాయత్తులై యెఱింగిరి; మధురాపురంబునకు హలాయుధ సమేతుండనై యే నరుగుచో, గోపిక లోపికలు లేక భక్తియోగంబునఁ జింతించి ముక్తలై; రిది భక్తియోగప్రకారం” బని యుద్ధవునికిం జెప్పిన.

భావము:
ఇంకొక విశేషమైన పురాతన పుణ్యకథ చెప్తాను, విను. కనకావతీనగరంలో ఒక ఉత్తమమైన బ్రాహ్మణ కన్యక ఉంది. ఆ కాంతారత్నం తన చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ధరించేది. ఒకనాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. వారికి వండిపెట్టాలి అని బియ్యం కోసం వడ్లు ఇంట్లో రోకలితో వడ్లు దంచుతూ ఉంటే, ఆమె కంకణాలు గల్లుగల్లు మని చప్పుడు చేయసాగాయి. ఆ చప్పుడుకు చీకాకు పడింది. అందుకని, ఆ పరమపతివ్రత చేతికి ఒక్క గాజు మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేసి అవతల పెట్టి, చప్పుడు కాకుండా తన పని పూర్తిచేసుకుంది. అలాగే తత్తరపడక భగవంతుడికి అర్పించిన ఏకాగ్రమైన చిత్తంతో ప్రసన్న మనస్కులై మానవులు ముక్తులవుతారు. కనుక అవిద్య విద్య రెండు నా మాయగా తెలుసుకుని కేవలం పశుమార్గులు కాకుండా ఐశ్వర్యం వీర్యం యశస్సు జ్ఞానం సిరి వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరుల లాగా, సుఖాన్ని కోరకుండా ఉండే వాళ్ళు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయ అని గ్రహించు.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అప్పుడు అతను. “దేవా! నీ రూపాన్ని ఎలా చూడగలము.” అని అడిగాడు
అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఉద్ధవా! భక్తిభావన యందు ఆసక్తి, దయారసము కలిగి; మితభాషణుడై, అబద్ధమాడక, సమస్త కర్మలు మదర్పణంగా చేసేవాడు భాగవతుడు అనబడతాడు. నా కథలు, నా జననం, నా లీలావిలాసాలు వింటూ నా సేవకులైన భాగవతులను తిలకించి. తమ ఇంటికి తీసుకుని వెళ్ళి, పూజించి స్నాన భోజన శయనాసనాదులతో వారిని సంతృప్తిపరచిన వాడు కూడ భాగవతుడు అనబడతాడు. చివరికి, జీవితాంత కాలం ఇదే విధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో నివసిస్తాడు.
అదీకాక శంఖచక్రగదాధరుడను, లక్ష్మీ సమేతుడను అయిన నన్ను; శాస్త్రంతో ఆచారంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విశేషించిన భక్తితో ఏమరుపాటు రాకుండా గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ధ్యానిస్తూ శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు; అంబరీషుడు, విభీషుణుడు, రుక్మాంగదుడు మున్నగు భాగవతులు తెలుసుకున్నారు. మధురాపురానికి బలరాముడితో కలసి నేను వెళ్ళగా నా విరహాన్ని భరించలేని గోపికలు భక్తియోగంతో నన్నే చింతించి ముక్తిపొందారు. ఇది భక్తి యోగ వివరం.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=103

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, January 2, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౦౯(709)

( అవధూత సంభాషణ ) 

11-102-క.
దేహము నిత్యము గా దని
మోహముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై
గేహము వెలువడి నరుఁడు
త్సాహమునుం జెందు ముక్తిసంపద ననఘా!

భావము:
ఓ పుణ్యాత్ముడా! ఉద్ధవా! దేహం శాశ్వతమైనది కాదని గ్రహించి, మోహాన్ని కత్తిరించి పారేసి, సిద్ధులు మునులు చరించే మార్గాన్ని అనుసరించి, సంసారం వదలిన మానవుడు మోక్షలక్ష్మిని పొందుతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=102

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, January 1, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౦౮(708)

( అవధూత సంభాషణ ) 

11-101-వ.
ఇందులకుఁ బురాతన వృత్తాంతంబు గలదు; సావధానచిత్తుండవై వినుము; మిథిలా నగరంబునఁ బింగళ యను గణికారత్నంబు గలదు; దానివలనం గొంత పరిజ్ఞానంబుఁ గంటి? నదెట్లనిన నమ్మానిని ధనకాంక్ష జేసి యాత్మసఖుని మొఱంగి ధనం బిచ్చువానిం జేకొని నిజనికేతనాభ్యంతరంబునకుం గొనిచని రాత్రి నిద్రలేకుండుచుఁ బుటభేదన విపణిమార్గంబులఁ బర్యటనంబు సలుపుచు నిద్రాలస్య భావంబున జడనుపడి, యర్థాపేక్షం దగిలి తిరిగి యలసి, యాత్మ సుఖంబు సేయునతండె భర్త యని చింతించి నారాయణు నిట్లు చింతింప నతని కైవల్యంబు సేరవచ్చు నని విచారించి, నిజశయనస్థానాదికంబు వర్జించి వేగిరంబ వాసుదేవ చరణారవింద వందనాభిలాషిణియై దేహంబు విద్యుత్ప్రకారం బని చింతించి పరమతత్త్వంబు నందుఁ జిత్తంబు గీలుకొలిసి ముక్తురాలయ్యె నని యెఱింగించి.

భావము:
దీనికొక ప్రాచీన కథ ఉంది. శ్రద్ధగా విను. మిథిలానగరంలో పింగళ అనే వేశ్యామణి ఉంది. ఆమె వలన కొంత పరిఙ్ఞానాన్ని పొందాను. ఎలాగ అంటే, ఆ వనిత డబ్బుమీది ఆశతో తన ప్రియుడిని మోసపుచ్చి ధనమిచ్చే మరొక విటుడిని మరిగింది. వాడిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. వాడితో రాత్రిళ్ళు నిద్రలేకుండా ఊర్లమ్మట, వీధులమ్మట విహరించింది. నిద్ర లేకపోవటం వలన బాగా నీరసించింది. ధనకాంక్షతో తిరిగితిరిగి అలసిపోయింది. చివరకు ఆత్మసుఖం కలిగించేవాడే భర్త అని గ్రహించుకుంది. నారాయణుడిని కనుక ఇలా చింతిస్తే కైవల్యాన్ని చెందగలను కదా, అని విచారించింది. తన శయన గృహాన్ని, సమస్త సంపదలను త్యజించింది. వాసుదేవుడి పాదపద్మాలకు నమస్కరించి తరించాలనే అభిలాష కలిగినదై, శరీరం మెరుపులా అశాశ్వతమైన దని నిశ్చయించుకుంది. పరతత్వం మీద మనస్సు లగ్నంచేసుకుని, ముక్తురాలైంది. అని శ్రీకృష్ణుడు వివరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=101

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Friday, December 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౭(707)

( అవధూత సంభాషణ ) 

11-100-క.
మోహితుఁడై వసుకాంక్షా
వాహినిలోఁ జిక్కి క్రూరవశుఁడౌ మనుజుం
డూహాపోహ లెఱుంగక
దేహము నలఁగంగఁ జేయు దీనత నెపుడున్‌.

భావము:
మోహానికి వశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకున్నవాడు, క్రూరభావాలకు లొంగిపోయే వాడు అయిన మానవుడు ఊహాపోహలు తెలియక దీనుడై శరీరాన్ని సంకటాలు పడుతూ ఉంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=100

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, December 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౬(706)

( అవధూత సంభాషణ ) 

11-99-వ.
ఇవ్విధంబున భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురంబగు పరోపకారంబును, విష్ణుపదంబువలనఁ గాలసృష్ట గుణసాంగత్యంబు లేమియు, నుదకంబువలన నిత్యశుచిత్వంబును, నసితపథునివలన నిర్మలత్వంబును, నిశాకర ప్రభాకరుల వలన నధికాల్పసమత్వజీవ గ్రహణ మోక్షణంబులును, గపోతంబులవలనఁ గళత్ర పుత్ర స్నేహంబును, నజగరంబువలన స్వేచ్ఛా విహారసమాగతాహారంబును, వననిధివలన నుత్సాహ రోషంబులును, శలభంబువలన శక్త్యనుకూల కర్మాచరణంబును, భృంగంబువలన సారమాత్రగ్రహణ విశేషంబును, స్తంబేరమంబువలనం గాంతావైముఖ్యంబును, సరఘవలన సంగ్రహ గుణంబును, హరిణంబువలనం జింతాపరత్వంబును, జలచరంబువలన జిహ్వాచాపల్యంబును, బింగళవలన యథాలాభసంతుష్టియుఁ, గురరంబువలన మోహపరిత్యాగంబును, డింభకువలన విచారపరిత్యాగంబును, గుమారికవలన సంగత్యాగంబును, శరకారునివలనం దదేకనిష్ఠయు, దందశూకంబువలనం బరగృహవాసంబును, నూర్ణనాభివలన సంసారపరిత్యాగంబును, గణుందురువలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండుటయుననంగల వీని గుణంబు లెఱింగి మఱియుఁ గామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబు లను నరిషడ్వర్గంబుల జయించి, జరామరణవిరహితంబుగా వాయువశంబు సేసి, గాత్రపవిత్రత్వంబుకొఱకు షట్కర్మ నిరతుండయి, పుర నగర గ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీర ధారణార్థంబు నియతస్వల్పభోజనుండై, ఖేద మోదంబులు సరియకా భావించి లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుం డయి నన్నె కాని యొండెఱుంగక యాత్మ నిష్ఠచేఁ బవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు గలయుం గావున.

భావము:
ఈ విధంగా, 1. భూమివలన సహనము; 2. వాయువువలన పరోపకారము; 3. ఆకాశమువలన కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవడం; 4 నీటివలన ఎప్పుడు శుచిగా ఉండటం; 5. అగ్నివలన నిర్మలంగా ఉండటం; 6. 7. చంద్ర, సూర్యులవలన సర్వసమత్వము; 8. పావురంవలన భార్యాబిడ్డల యందు స్నేహత్యాగము; 9. కొండచిలువవలన ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించటం; 10. సముద్రంవలన ఉత్సాహ రోషములు; 11. మిడుతవలన శక్తికి తగిన పనిచేయటము; 12. తుమ్మెదవలన సారమును మాత్రమే గ్రహించటం; 13. ఏనుగువలన స్త్రీ వైముఖ్యము; 14. తేనెటీగవలన సంగ్రహణము; 15. లేడివలన విచారపరత్వమ; 16. తాబేలువలన జిహ్వాచాపల్యము; 17. ముంగిసవలన దొరికిన దానితో తృప్తిపడటం; 18. లకుమికిపిట్టవలన మోహ పరిత్యాగము; 19. బాలునివలన విచార పరిత్యాగము; 20. బాలికవలన సంగ విసర్జనము; 21. బాణాలు చేసేవాని వలన ఏకాగ్రత; 22. పామువలన ఇతరుల ఇండ్ల యందు నివసించటం; 23. సాలెపురుగువలన సంసార బంధాలలో చిక్కుపడక ఉండటము; 24. కందిరీగవలన లక్ష్యజ్ఞానము విడువక ఉండుట; నేర్చుకోవాలి.
ఈ గుణాలు గ్రహించుకుని కామం, క్రోధం, లోభం, మోహం, మదం మాత్సర్యం, అనే అరిషడ్వర్గము (ఆరుగురు శత్రువులు) జయించాలి ముసలితనం రాకుండా చావు లేకుండా ప్రాణవాయువును వశం చేసుకోవాలి. శరీరము పవిత్రంగా ఉండడం కోసం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అను వాటి మీద ఆసక్తి కలగి, పట్టణాలను గ్రామాలను నగరాలను వదలి కొండల యందు అడవులయందు తిరుగుతూ ఉండాలి. దేహం నిలవటానికి సరిపడ కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సంతోషం దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్నీ మోహాన్నీ వదలాలి. ఇంద్రియాలను జయించాలి. నన్నే తప్ప మరొకటి ఎరుగక ఆత్మనిష్ఠతో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండాలి. అట్టి యోగి నన్ను చేరగలుగుతాడు నా యందే కలుస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=99

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..