Friday, January 6, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౨(712)

( అవధూత సంభాషణ ) 

11-105-వ.
అని యడిగిన నయ్యాదవేంద్రుం డిట్లని పలుకం దొడంగె; “దారు మధ్యభాగంబున ననలంబు సూక్ష్మరూపంబున వర్తించు చందంబున నందంబై సకలశరీరుల యందు నచ్ఛేద్యుండు నదాహ్యుండు నశోష్యుండునైన జీవుండు వసించి యుండు” ననిన హరికి నుద్ధవుం డిట్లనియె; “సనక సనందనాది యోగీంద్రులకు యోగమార్గం బేరీతి నానతిచ్చితి, వది యేవిధం? బానతీయవే” యని యభ్యర్థించిన నతం డిట్లనియె; “వారలు చతుర్ముఖు నడిగిన నతండు, “నేనును దెలియనేర” ననిన వారలు విస్మయం బందుచుండ నేనా సమయంబున హంసస్వరూపుండ నై వారల కెఱింగించిన తెఱుంగు వినుము; పంచేంద్రియంబులకు దృష్టం బయిన పదార్థం బనిత్యంబు; నిత్యదృష్టి బ్రహ్మం బని తెలియవలయు; దేహి కర్మార్జిత దేహుండై సంసారమమతలు నిరసించి, నిశ్చలజ్ఞాన యుక్తుండై మత్పదప్రాప్తుండగు; స్వప్నలబ్ధ పదార్థంబు నిజంబు గాని క్రియఁ గర్మానుభవపర్యంతంబు కళేబరంబు వర్తించు నని సాంఖ్యయోగంబున సనకాదుల కెఱింగించిన విని, బ్రహ్మ మొదలైన దేవత లెఱింగిరి; వారివలన భూలోకంబునఁ బ్రసిద్ధం బయ్యె; నదిగావున నీవును నెఱింగికొని, పుణ్యాశ్రమంబులకుం జను; మస్మదీయ భక్తియుక్తుండును, హరిపరాయణుండునైన యతని చరణరజఃపుంజంబు తన శరీరంబు సోఁకజేయు నతండును, ముద్రాధారణపరులకును హరి దివ్యనామంబులు ధరియించు వారలకు నన్నోదకంబుల నిడు నతండును, వాసుదేవభక్తులం గని హర్షించు నతండును, భాగవతు” డని చెప్పి మఱియు “సర్వసంగపరిత్యాగంబు సేసి, యొండెఱుంగక నన్నే తలంచు మానవునకు భుక్తి ముక్తి ప్రదాయకుండనై యుండుదు” నని యానతిచ్చిన నుద్ధవుండు “ధ్యాన మార్గంబే రీతి? యానతీయవలయు” ననిన హరి యిట్లనియె; ఏకాంత మానసులై హస్తాబ్జంబు లూరుద్వయంబున సంధించి, నాసాగ్రంబున నీక్షణంబు నిలిపి, ప్రాణాయామంబున నన్ను హృదయగతుంగాఁ దలంచి, యష్టాదశ ధారణాయోగసిద్ధు లెఱింగి, యందణిమాదులు ప్రధాన సిద్ధులుగాఁ దెలిసి, యింద్రియంబుల బంధించి, మనం బాత్మయందుఁ జేర్చి, యాత్మనాత్మతోఁ గీలించిన బ్రహ్మపదంబుఁ బొందు; భాగవతశ్రేష్ఠు లితరధర్మంబులు మాని నన్నుం గాంతురు; తొల్లి పాండునందనుఁడగు నర్జునుండు యుద్ధరంగంబున విషాదంబు నొంది యిట్ల యడిగిన నతనికి నేఁ జెప్పిన తెఱం గెఱింగించెదఁ; జరాచరభూతంబయిన జగంబంతయు మదాకారంబుగా భావించి, భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబులందు జీవుండును, దుర్జయంబులందు మనంబును, దేవతలందుఁ బద్మగర్భుండును, వసువులందు హవ్యవాహుండును, నాదిత్యులందు విష్ణువును, రుద్రులందు నీలలోహితుండును, బ్రహ్మలందు భృగువును, ఋషులందు నారదుండును, ధేనువులందుఁ గామధేనువును, సిద్ధులయందుఁ గపిలుండును, దైత్యులయందుఁ బ్రహ్లాదుండును గ్రహంబులందుఁ గళానిధియును, గజంబులయం దైరావతంబును, హయంబులయం దుచ్చైశ్శ్రవంబును, నాగంబులందు వాసుకియును, మృగంబులందుఁ గేసరియు, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబును, వర్ణంబులయం దోంకారంబును, నదులందు గంగయు, సాగరంబుల యందు దుగ్ధసాగరంబును, నాయుధంబులందుఁ గార్ముకంబును, గిరు లందు మేరువును, వృక్షంబుల యందశ్వత్థంబును, నోషధుల యందు యవలును, యజ్ఞంబుల యందు బ్రహ్మయజ్ఞంబును, వ్రతంబులం దహింసయు, యోగంబులం దాత్మయోగంబును, స్త్రీల యందు శతరూపయు భాషణంబులయందు సత్యభాషణంబును, ఋతువులందు వసంతాగమంబును, మాసంబులలో మార్గశీర్షంబును, నక్షత్రంబులలో నభిజిత్తును, యుగంబులందుఁ గృతయుగంబును, భగవదాకారంబులందు వాసుదేవుండును, యక్షుల లోఁ గుబేరుండును, వానరులం దాంజనేయుండును, రత్నంబు లందుఁ బద్మరాగంబును, దానంబులలోనన్నదానంబును, దిథు లయం దేకాదశియు, నరులయందు వైష్ణవుండై భాగవతప్రవర్తనం బ్రవర్తించువాఁడును, నివియన్నియు మద్విభూతులుగా నెఱుంగు" మని కృష్ణుం డుద్ధవునకు నుపన్యసించిన వెండియు నతం డిట్లనియె.

భావము:
అలా అడిగిన ఉద్ధవుడికి యాదవ ప్రభువు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “కఱ్ఱ లోపల అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా, సకల శరీరాలలోను అచ్ఛేద్యుడు అదాహ్యుడు అశోష్యుడు అయిన జీవుడు నివసిస్తూ ఉంటాడు.” అనగా ఉద్ధవుడు మరల ఇలా అడిగాడు. “సనకుడు సనందుడు మున్నగు యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిదో నాకు చెప్పు.” అంత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “వారు మొదట ఈ విషయం గురించి బ్రహ్మదేవుడిని అడిగారు. అతడు తనకు కూడ తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, నేను ఆ సమయంలో హంస రూపం ధరించి వాళ్ళకు చెప్పాను. ఆ వివరం చెప్తాను శ్రద్ధగా విను.
పంచేంద్రియాలకూ కనిపించే పదార్థమంతా అనిత్యం. నిత్యమైనది బ్రహ్మం మాత్రమే. పూర్వజన్మ కృత కర్మలచేత లభించిన శరీరం కలవాడైన దేహి, సంసార మందు మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది, నా స్థానాన్ని ప్రాప్తిస్తాడు. కలలో దొరికిన పదార్ధం నిజం కానట్లుగా, కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది. అని సాంఖ్య యోగాన్ని సనకాదులకు చెప్పాను. అది వినిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు తెలుసుకున్నారు. ఆ యోగం వారి వలన భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి, నీవు తెలుసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. ఇంకా, నా మీద భక్తి ఆసక్తికలవారి పాదరేణువులు తన శరీరానికి సోకించుకుండేవాడు; శంఖమూ చక్రమూమొదలైన ముద్రలను ధరించేవాడు; హరిదివ్యనామాలు ధరించేవారికీ అన్నమూ నీళ్ళూ ఇచ్చేవాడు; విష్ణుభక్తులను కాంచి సంతోషించేవాడు కూడ భాగవతుడు అని తెలియుము. అన్ని సంగాలను వదలి, ఇతరము ఎరుగక, నన్నేతలచే మానవునకు భుక్తినీ, ముక్తినీ ఇస్తాను.” అని బోధించాడు. అంత, ఉద్ధవుడు ధ్యానమార్గ స్వరూపం చెప్ప మని మళ్ళీ అడిగాడు. శ్రీహరి ఇలా అన్నాడు.
“ఏకాంతంగా కూర్చుని తొడలమీద చేతులు కలిపి పెట్టుకుని, ముక్కు చివర చూపు నిలిపి, ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవాడిగా భావించి. పద్దెనిమిది విధాల ధారణా యోగసిద్ధులను తెలుసుకుని, అందు అణిమ మొదలైన వానిని ప్రధాన సిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలో చేర్చి, ఆత్మను పరమాత్మతో లగ్నంచేసి, బ్రహ్మపదాన్మి పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు.
ఇంతకుముందు పాండుకుమారుడైన అర్జునుడు రణరంగంలో విషాదం పొంది, ఇలానే అడిగితే, అతనికి చెప్పిందే నీకూ చెప్తున్నాను విను. చరచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా, నా ఆకారంగా భావించి భూతాలలో ఆధారభూతము సూక్ష్మములందు జీవుడు, దుర్జనమైన వాటిలో మనస్సు, దేవతలలో బ్రహ్మదేవుడు, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుఱ్ఱములలో ఉచ్ఛైశ్రవము, నాగులలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములలో గృహస్థాశ్రమము, వర్ణములలో ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలలో శతరూప, పలుకులలో సత్యము, ఋతువులందు వసంతము, మాసములలో మార్గశిరము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు ఇవి అన్నీ నా విభూతులుగా తెలుసుకో.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించాడు. మళ్ళీ ఉద్ధవుడు ఇలా అడిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=105

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments: