Saturday, July 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౬(586)

( శ్రుతి గీతలు ) 

10.2-1220-వ.
అట్టి నిన్నుఁ బరమాణుకారణవాదులైన కణ్వ గౌతమాదులును, బ్రకృతి కారణవాదులయిన సాంఖ్యులును, దేహాత్మవాదులయిన బౌద్ధులును, వివిధంబులైన కుతర్కంబులచేతం బరస్పరావ్యాహతంబులైన మతంబులు దమతమ కుతర్కవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు; మహాభాగ్యవంతులయిన యోగీంద్రులకు నీవు ప్రత్యక్షం బైన నివి యన్నియు నసత్యంబు లని కానవచ్చు; వెండియుఁ గొందఱీ సచరాచర వస్తుజాతంబులకు నంతర్యామివై సర్వంబు నీవ యగుటం దెలియలేక నిత్యం బనియు, ననిత్యం బనియు విపరీతబుద్ధిం దెలియుదురు; గాని భవదీయ దివ్యతత్త్వంబు నిక్కంబుగఁ దెలియజాలరు; కొందఱు జగచ్ఛరీరుండవుగాన జగద్రూపకుండవైన నిన్నుం గటకమకుటకర్ణికాది వివిధ భూషణభేదంబులం గనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు చందంబున జగద్వికారానుగతుండ వయ్యును నిఖిల హేయప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుండుదు వని యాత్మ విదులయిన వారు దెలియుదు; రదియునుం గాక.

భావము:
పరమాణువులే ఈ సృష్టికి కారణమని భావించే కణ్వ గౌతమాదులు, ప్రకృతే కారణమని వాదించే సాంఖ్యులు, దేహాత్మ వాదులు అయిన బౌద్ధులు మున్నగు వారు తమ తమ పరస్పర విరుద్ధము లైన కుతర్కాలతో కొట్టుమిట్టు లాడుతూ అట్టి సచ్చిదానంద స్వరూపుడవైన నిన్ను తెలుసుకోలేరు; నిన్ను సాక్షాత్కరించుకున్న మాహా భాగ్యవంతులు అయిన పరమ యోగులకు ఈ సృష్టిలో నీవు తప్ప ఇతర పదార్థాలు సమస్తము అసత్యాలు అనిపిస్తాయి; చరాచర ప్రపంచం అంతటా ఉండే నిన్ను సక్రమంగా తెలుసుకోలేక కొందరు విపరీత బుద్ధులతో నిత్యానిత్య వాదాలు వాదించుకుంటూ ఉంటారే తప్ప నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు; కటక కంకణ కిరీటాది నానావిధ భూషణాలలో సువర్ణం తన స్వరూపాన్ని విడువక వర్తించునట్లు నీవు విశ్వాత్ముడవు, సమస్త కల్మషాలకు అతీతుడవు, శుభరూపుడవు, కల్యాణ గుణాత్మకుడవు అని ఆత్మతత్వం తెలిసినవారే తెలుసుకుంటారు. అంతేకాకుండా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1220

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, July 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౫(585)

( శ్రుతి గీతలు ) 

10.2-1218-చ.
యమ నియమాది యోగమహితాత్మకులైన మునీంద్రులున్ విరో
ధమునఁ దలంచు చైద్యవసుధావర ముఖ్యనృపుల్‌ ఫణీంద్ర భో
గము లన నొప్పు బాహువులు గల్గిన నిన్ను భజించు గోపికల్‌
క్రమమున నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదరా!
10.2-1219-మ.
అరవిందాక్ష! భవత్స్వరూప మిలఁ బ్రత్యక్షంబునం గాన నె
వ్వరికిం బోలదు శాస్త్రగోచరుఁడవై వర్తింతు వీ సృష్టి ముం
దర సద్రూపుఁడవైన నీ వలననే ధాత్రాద్యమర్త్యుల్‌ జనిం
చిరి నిన్నంతకు మున్నెఱుంగఁ గలమే చింతింప నేమచ్యుతా!

భావము:
జితేంద్రియులూ పరమశాంతమూర్తులూ అయిన యోగులూ; శత్రుభావంతో నిన్ను తలపోసే శిశుపాలాది రాజన్యులూ; ఆదిశేష నాగుని పోలిన బాహువులతో నిండైన నిన్ను భక్తితో ఆరాధించే గోపికలూ; తరువాత మేమూ; నీ దివ్యమైన కృపకు సమానంగా పాత్రులం కావటంలో సందేహం లేదు. అంబుజాక్ష! ఈ లోకంలో ఎవరికీ నీ అసలైన స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడటం సాధ్యం కాదు. నీవు శాస్త్రగోచరుడవు అయి ఉంటావు. ఈ సృష్టికి పూర్వం సత్తు రూపంలో వెలుగొందు పరమాత్మ స్వరూపుడవైన నీ వలననే బ్రహ్మాది దేవతలు ప్రభవించారు. అటువంటి బ్రహ్మాదుల సృష్టికి ముందరి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మేము తెలుసుకోలేము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1219

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, July 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౪(584)

( శ్రుతి గీతలు ) 

10.2-1216-సీ.
అనఘ! దుర్గమమైన యాత్మతత్త్వంబు ప్ర-
  వర్తించుకొఱకు దివ్యంబులైన
యంచిత రామకృష్ణాద్యవతారముల్‌-
  భజియించియున్న నీ భవ్యచరిత
మను సుధాంభోనిధి నవగాహనము సేసి-
  విశ్రాంతచిత్తులై వెలయుచుండి
మోక్షంబు బుద్ధినపేక్షింపనొల్లరు-
  మఱియుఁగొందఱు భవచ్చరణపంక
10.2-1216.1-ఆ.
జములఁ దగిలి పుణ్యతము లైన హంసల
వడువు నొంది భాగవతజనముల
నొనరువారు ప్రకట యోగిజనప్రాప్య
మైన ముక్తిఁ గోర రాత్మ లందు.
10.2-1217-ఉ.
కొందఱు నీ శరీరము లకుంఠితభక్తి భవద్వశంబులై
చెందఁగ నీ పదాబ్జములు సేరి భజించుచుఁ దత్సుఖాత్ములై
యుందురు కొందఱీ తనువు లోలి ధరించి భవత్పదాబ్జముల్‌
పొందుగఁ గొల్వలేక నిలఁ బుట్టుచుఁ జచ్చుచు నుందు రవ్యయా!

భావము:
పుణ్యాత్మా! నీ ఆత్మతత్వం తెలియుట బహుళతర కష్టసాధ్యమైనది. అట్టి ఆ ఆత్మతత్వం వ్యక్తమయ్యేలా రామకృష్ణాది అవతారాలు ధరిస్తావు. అటువంటి నీ దివ్యచరిత్ర అనే అమృతసాగరంలో స్నానమాడినవారు శాంతించిన చిత్తములు పొందుతారు. వారు ముక్తిని కూడా కోరరు. నీ పాదపద్మాలనే ధ్యానిస్తూ పరమహంసల్లా ప్రవర్తించే భాగవతశిఖామణులు కొందరు మహా యోగి వరేణ్యులు పొందే మోక్షమును ఆశించను కూడ ఆశించరు. అవ్యయా! భగవంతుడ! శరీరధారులు సర్వులూ నీ అంశభూతములే యని ఎఱిగిన కొందరు సదా నీ పాదపద్మాలను సేవిస్తూ పరమానందం చెందుతారు. మఱికొందరు శరీరధారులు నీ పాదపద్మాలను భజించలేక ఈ లోకంలో పుడుతూ చస్తూ ఉంటారు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1216

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, July 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౩(583)

( శ్రుతి గీతలు ) 

10.2-1215-వ.
మఱియు వివిధకాష్ఠాంతర్గతుం డయిన వాయుసఖుండు తద్గత దోషంబునం బొరయక నిత్యశుద్ధుఁడై తరతమభావంబున వర్తించు చందంబున స్వసంకల్పకృతంబులయిన విచిత్రశరీరంబులయందు నంతర్యామివై ప్రవేశించి తత్తద్విచిత్రయోనిగతంబైన హేయంబులం బొరయక సకలాత్మ సమంబై బ్రహ్మంబయిన నిన్ను నైహికాముష్మిక ఫలసంగమంబు లేక విగతరజోగుణంబులందగిలి కొందఱు భజియించుచుండుదు; రదియునుం గాక, దేవా! భవదీయ సంకల్పాధీనంబులయిన శరీరంబులం బ్రవేశించియున్న జీవసమూహంబు నీకు శేషభూతం బని తెలిసి కొందఱు భవనివారకం బయిన శ్రీమత్త్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థులగుదురు మఱియును.

భావము:
దేవా! కఱ్ఱకు ఎన్ని వంకరలు ఉన్నా, కఱ్ఱలో అంతర్గతంగా ఉండే అగ్నిహోత్రునికి ఆ వంకరలు అంటవు కదా అలాగే. నీవు నీ సంకల్పానికి అనుగుణంగా విశిష్ఠంగా చిత్రించి ఆ శరీరాలలో అంతర్యామిగా ఉన్నప్పటికీ, ఆయా శరీరుల పాపాలు నీకు సోకవు. అటువంటి సర్వాంతర్యామివై సాక్షాత్తు పరబ్రహ్మమైన నిన్ను నిష్కాములై ఫలాపేక్షలేక రజోగుణాన్ని వదలిన కొందరు మహాత్ములు సేవిస్తూ ఉంటారు. తమ తమ ప్రాణదేహాలు నీ ఆధీనాలని తెలిసినవారు భగవంతుడవైన నీ పాదపద్మాలను ధ్యానించి భవరోగాలకు దూరులౌతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1215

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Monday, July 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౨(582)

( శ్రుతి గీతలు ) 

10.2-1213-ఆ.
నిన్ను ననుసరింప నేరని కుజనులు
పవనపూర్ణ చర్మభస్త్రి సమితి
యోజఁ జేయుచుందు రుచ్ఛ్వసనంబులు
బలసి యాత్మదేహభజను లగుచు.
10.2-1214-సీ.
దేవ! కొందఱు సూక్ష్మదృక్కు లైనట్టి మ-
  హాత్మకు లుదరస్థుఁ డైన వహ్ని
గా మదిఁ దలఁతురు కైకొని మఱికొంద-
  ఱారుణు లనుపేర నమరు ఋషులు
లీల సుషుమ్ననాడీ మార్గగతుఁడవై-
  హృత్ప్రదేశమునఁ జరించుచున్న
రుచి దహరాకాశ రూపిగా భావింతు-
  రట్టి హృత్పద్మంబునందు వెడలి
10.2-1214.1-తే.
వితతమూర్ధన్యనాడికాగతుల నోలి
బ్రహ్మరంధ్రంబుఁ బ్రాపించి పరమపురుష!
సుమహితానందమయ పరంజ్యోతిరూపి
వైన నినుఁ బొంది మఱి పుట్ట రవని యందు.

భావము:
గాలితో నిండిన తోలుతిత్తి లాంటి తమ శరీరం మీది మమకారంతో, నిన్ను సేవించని దుష్ట మానవులు, ఉచ్ఛ్వాస నిశ్వాశాలు నింపుకుంటూ ఆ దేహాన్నే తమ ఆత్మ అనుకుని భజిస్తూ ఉంటారు. ఓ భగవంతుడా! మహితాత్మకులు “సూక్ష్మ దర్శనులు” నిన్ను గర్భంలో ఉన్న అగ్నిగా భావిస్తారు. ఋషీశ్వరులు “ఆరుణులు” సుషుమ్నానాడీ మార్గంలో సంచరిస్తూ హృదయ ప్రదేశంలో సంచరించే సూక్ష్మాకార రూపం కలవాడిగా నిన్ను తలుస్తారు. అట్టి హృదయపద్మం నుంచి వెలువడి మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేరుకుని, ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవు అయిన నిన్ను చేరి ఆ అరుణులు ముక్తులు అవుతారు. వారికి మరల జన్మ అంటూ ఉండదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1214

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Sunday, July 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౧(581)

( శ్రుతి గీతలు ) 

10.2-1211-సీ.
అనయంబు దేహి నిత్యానిత్య సద్విల-
  క్షణమునఁ బంచకోశవ్యవస్థ
నభివృద్ధిఁ బొరయుచు నందులోపల నున్న-
  ప్రాణాన్నబుద్ధి విజ్ఞానమయము
లను చతుష్కోశంబు లవ్వల వెలుఁగొందు-
  నానందమయుఁ డీవు గాన దేవ!
సురుచిర స్వప్రకాశుండవు నీ పరి-
  గ్రహము గల్గుటఁ జేసి కాదె ప్రకృతి
10.2-1211.1-తే.
మహ దహంకార పంచతన్మాత్ర గగన
పవన తేజోంబు భూ భూతపంచకాది
కలిత తత్త్వముల్‌ బ్రహ్మాండకార్య కరణ
మందు నెపుడు సమర్థంబు లగుటఁ జూడ.
10.2-1212-క.
కోరి శరీరులు భవదను
సారంబున నిహపరైక సౌఖ్యంబులఁ బెం
పారఁగ నందుచు నుందురు
ధీరజనోత్తము లనంగ దివిజారిహరా!

భావము:
ప్రాణ, అన్న, బుద్ధి, విజ్ఞాన, ఆనందమయాలనే పంచకోశాల యొక్క శాశ్వతమూ అశాశ్వతమూ అనే లక్షణాల వలన జీవులు అభివృద్ధి పొందుతూంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయకోశానికి చెంది ప్రాణమయ, అన్నమయ, బుద్ధిమయ, విజ్ఞానమయ నాలుగు కోశాలకు పరమై నీవు స్వయంప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అనుగ్రహం ఉన్నందు వలనే కదా ఈ ప్రకృతీ, మహత్తూ, అహంకారమూ; పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలూ; పంచభూతాలైన భూమీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మున్నగునవి అన్నీ ఈ సమస్త సృష్టి, స్థితి, లయ కార్యాలను సర్వ సమర్థంగా నిర్వహిస్తున్నాయి. ఓ అసుర సంహారా! నామ రూప ధారులు నిన్ను భజిస్తూ ఇహపర సౌఖ్యాలను పొంది గొప్పవారని ప్రసిద్ధులు అవుతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1212

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, July 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౦(580)

( శ్రుతి గీతలు ) 

10.2-1208-క.
లీలం బ్రాకృతపూరుష
కాలాదిక నిఖిలమగు జగంబుల కెల్లన్
మాలిన్య నివారక మగు
నీ లలితకథాసుధాబ్ధినిం గ్రుంకి తగన్.
10.2-1209-చ.
భరిత నిదాఘ తప్తుఁ డగు పాంథుఁడు శీతలవారిఁ గ్రుంకి దు
ష్కర మగు తాపముం దొఱగు కైవడి సంసరణోగ్రతాపమున్
వెరవునఁ బాయుచుండుదురు నిన్ను భజించుమహాత్మకుల్‌ జరా
మరణ మనోగదంబులఁ గ్రమంబునఁ బాయుట సెప్ప నేటికిన్?

భావము:
ప్రాకృతము, పురుషుడు, కాలములకు స్వరూప నిలయమైన ఈ ప్రపంచంలోని నిఖిల పాపాలనూ నివారించే సామర్ధ్యం కల నీ మనోహర కథామృత సముద్రంలో మునిగి ధన్యులు అవుతారు. బాటసారి తీవ్రమైన వేసవి ఎండకి కలిగే పరితాపాన్ని, చన్నీళ్ళ స్నానం చేసి పోగొట్టుకుంటాడు. అదే విధంగా నిన్ను పూజించే మహాత్ములు సంసార దుర్భర తాపాన్ని నేర్పుతో తొలగించుకుంటారు. అలాంటప్పుడు మనోవ్యధ, ముసలితనము, మరణములను పోగొట్టుకుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1209

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :