Sunday, December 6, 2020

శ్రీ కృష్ణ విజయము - 96

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1392-సీ.
"మమ్ముఁ గంటిరిగాని మా బాల్య పౌగండ-
  కైశోర వయసులఁ గదిసి మీర
లెత్తుచు దించుచు నెలమి మన్నించుచు-
  నుండు సౌభాగ్యంబు నొంద రైతి;
రాకాంక్ష గలిగియున్నది దైవయోగంబు-
  తల్లిదండ్రుల యొద్ద తనయు లుండి
యే యవసరమున నెబ్బంగి లాలితు-
  లగుచు వర్ధిల్లుదు రట్టి మహిమ
10.1-1392.1-తే.
మాకు నిన్నాళ్ళు లే దయ్యె మఱియు వినుఁడు
నిఖిల పురుషార్థహేతువై నెగడుచున్న
మేని కెవ్వార లాఢ్యులు మీరకారె
యా ఋణముఁ దీర్ప నూఱేండ్లకైనఁ జనదు.
10.1-1393-క.
చెల్లుబడి గలిగి యెవ్వఁడు
తల్లికిఁ దండ్రికిని దేహధనముల వృత్తుల్
చెల్లింపఁ డట్టి కష్టుఁడు
ప్రల్లదుఁ డామీఁద నాత్మపలలాశి యగున్.

భావము:
“అమ్మా! నాన్నా! మమ్మల్ని కన్నారు కానీ, మా బాల్య, పౌగండ, శైశవ ప్రాయాలలో ప్రేమగా ఎత్తుకుంటూ, దింపుతూ, లాలించి పాలించే భాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండి కూడా దైవయోగము చేత అది తీరలేదు. తలితండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఎప్పుడూ బుజ్జగింప బడుతూ ఎలా ఎదుగుతారో, అలాంటి అదృష్టం మా కిన్నాళ్ళూ లేకపోయింది. ధర్మార్ధకామమోక్షము లనే పురుషార్థములు సాధించడానికి కారణమైన ఈ శరీరాలకు కర్త లెవరు? జననీజనకులైన మీరే కదా! ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి నూరేండ్లయినా సరిపోదు. ఎవడైతే సమర్థత కలిగి ఉన్నా కూడా తన శరీరంతో ధనంతో తన తల్లితండ్రులకు సేవచేయడో, అలాంటి వాడు కష్టుడు దుష్టుడు. వాడు చచ్చాక తన మాంసం తానే తింటాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1392

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, December 5, 2020

శ్రీ కృష్ణ విజయము - 95

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1390-వ.
అని విలపించుచున్న రాజవల్లభల నూరార్చి, జగద్వల్లభుండైన హరి కంసాదులకుం బరలోకసంస్కారంబులు చేయం బనిచి దేవకీ వసుదేవుల సంకలియలు విడిపించి, బలభద్ర సహితుండై వారలకుం బ్రణామంబులు జేసిన.
10.1-1391-మ.
కని లోకేశులుగాని వీరు కొడుకుల్గారంచుఁ జిత్తంబులన్
జనయిత్రీ జనకుల్ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా
జనసమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి
ట్లనియెన్ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై. 

భావము:
అలా ఏడుస్తున్న రాజు భార్యలను ఓదార్చి, లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైన వారికి ఉత్తరక్రియలు చేయమని ఆదేశించాడు. పిమ్మట, దేవకీవసుదేవులను చెర విడిపించి, బలరాముడు తను కలిసి వారికి నమస్కారాలు చేయగా తల్లితండ్రులైన దేవకీవసుదేవులు తమ పుత్రులను చూసి “వీరు సకల లోకాలకు ప్రభువులు తప్ప సాధారణ మానవులు కారు” అని ఆలోచిస్తూ తమ మనసులలో సంశయ పడసాగారు. అప్పుడు, శ్రీకృష్ణుడు జనులను సమ్మోహింప జేసే మాయాశక్తిని ప్రయోగించి, వారి ఎరుకను మరుగు పరచి, అన్న బలభద్రుడుతో కూడి వచ్చి మిక్కిలి వినయంతో ఆనందాలు పంచుతూ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1391

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 94

( కంసుని భార్యలు విలపించుట )

10.1-1388-క.
భూతముల కెగ్గుచేసిన
భూతంబులు నీకు నెగ్గు పుట్టించె వృథా
భూత మగు మనికి యెల్లను
భూతద్రోహికిని శుభము పొంద దధీశా!
10.1-1389-క.
గోపాలకృష్ణుతోడను
భూపాలక! మున్ను తొడరి పొలిసినవారిన్
నీ పాల బుధులు చెప్పరె
కోపాలస్యములు విడిచి కొలువం దగదే."

భావము:
ప్రాణులకు నీవు కీడుచేయగా, ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. ప్రాణులకు ద్రోహం చేసినవాడికి మేలు కలుగదు. బ్రతు కంతా వ్యర్థమవుతుంది. కంసమహారాజా! భూమండలాన్ని ఏలే వాడవు కదా. గోవుల పాలించే వాడైన శ్రీకృష్ణుడిని ఇంతకు ముందు ఎదిరించిన వారందరూ మరిణించిన విషయం బుద్ధిమంతులు ఎవరూ నీకు చెప్పలేదా? క్రోధము జడత్వమూ వదలిపెట్టి గోవిందుని సేవించవలసింది కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=165&padyam=1389

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, December 2, 2020

శ్రీ కృష్ణ విజయము - 93

( కంసుని భార్యలు విలపించుట )

10.1-1386-వ.
అంతం గంసాదుల కాంతలు భర్తృమరణదుఃఖాక్రాంతలై కరంబుల శిరంబులు మోదికొనుచు నశ్రుసలిలధారాపరిషిక్త వదనలై సదనంబులు వెలువడి వచ్చి వీరశయ్యా నిద్రితులైన విభులం గౌఁగిలించుకొని సుస్వరంబుల విలపించి; రందుఁ గంసు భార్య లిట్లనిరి.
10.1-1387-సీ.
"గోపాలసింహంబు గోపించి వెల్వడి-
  నిను గజేంద్రుని భంగి నేడు గూల్చె
యాదవేంద్రానిల మాభీలజవమున-
  నిను మహీజము మాడ్కి నేల వ్రాల్చె
వాసుదేవాంభోధి వారి యుద్వేలమై-
  నిను దీవి కైవడి నేడు ముంచె
దేవకీసుతవజ్రి దేవత లలరంగ-
  నినుఁ గొండ క్రియ నేడు నిహతుఁ జేసె
10.1-1387.1-తే.
హా! మనోనాథ! హా! వీర! హా! మహాత్మ!
హా! మహారాజ! నీ విట్లు హతుఁడవైన
మనుచు నున్నార మక్కట! మమ్ముఁ బోలు
కఠినహృదయలు జగతిపైఁ గలరె యెందు?

భావము:
అంతట కంసుడు మొదలగువారి భార్యలు భర్తల మృతికి శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకుంటూ కన్నీటిధారలతో తడిసిన ముఖాలతో తమ తమ మందిరాల నుండి వచ్చారు. వీరశయ్యలందు దీర్ఘనిద్ర చెంది ఉన్న తమ పతులను పరిష్వంగం చేసుకుని, చక్కటి గద్గద కంఠధ్వనులతో ఏడ్చారు. వారిలో కంసుడి భార్యలు ఇలా అన్నారు. “ఓ ప్రాణనాయకా! కోపంతో వచ్చిన గోపాలుడనే సింహం గజేంద్రుడి వంటి నిన్ను హతమార్చింది కదా. హా శూరుడా! యదునాథుడనే గాలి దారుణమైన వేగంతో వీచి మహా వృక్షము లాంటి నిన్ను నేలపై కూలగొట్టింది కదా. ఓ మహానుభావా! వాసుదేవుడనే సముద్రజలం చెలియలకట్టను దాటి పొంగి వచ్చి దీవి వంటి నిన్ను ఇప్పుడు ముంచేసింది కదా. రాజేంద్రా! దేవకీపుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండవంటి నిన్ను సంహరించాడు కదా. అయ్యో! నీవిలా చనిపోయినప్పటికీ మేము ఇంకా బ్రతుకే ఉన్నాము. అక్కటా! మా అంత కఠిన హృదయం కలవారు భూమిమీద ఎక్కడైనా ఉన్నారా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=165&padyam=1387

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 92

( కంససోదరుల వధ )

10.1-1384-క.
చేతులఁ దాళము లొత్తుచుఁ
జేతోమోదంబుతోడ సిగముడి వీడం
బాతర లాడుచు మింటను
గీతము నారదుఁడు పాడెఁ గృష్ణా! యనుచున్.
10.1-1385-క.
వారిజభవ రుద్రాదులు
భూరికుసుమవృష్టిఁ గురిసి పొగడిరి కృష్ణున్
భేరులు మ్రోసెను నిర్జర
నారులు దివి నాడి రధిక నటనముల నృపా!

భావము:
నారదమహర్షి చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడిపోగా, ఆనందంతో ఆకాశంలో “కృష్ణా!” అంటూ పాడుతూ నర్తించాడు. పరీక్షన్నరేంద్రా! బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలు కొల్లలు కొల్లలుగా పూలజల్లులు కురిపిస్తూ శ్రీకృష్ణుడిని స్తుతించారు. దేవదుందుభులు మ్రోగాయి. దేవతాంగనలు ఆకాశంలో అనేక రకాల నాట్యాలు చేశారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1385

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Tuesday, December 1, 2020

శ్రీ కృష్ణ విజయము - 91

( కంససోదరుల వధ )

10.1-1381-క.
గోపాలుఁ డొక్కఁ డద్దిర
భూపాలకుఁ జంపె వీనిఁ బొడువుం డేత
ద్రూపాలస్యము లేలని
తాపాలఘురోషు లగుచు దర్పోద్ధతులై.
10.1-1382-శా.
న్యగ్రోధుండును గహ్వుఁడున్ మొదలుగా నానాయుధానీక సా
మగ్రిం గంసుని సోదరుల్గవియుఁడున్ మాద్యద్గజేంద్రాభుఁడై
యుగ్రుండై పరిఘాయు ధోల్లసితుఁడై యొండొండఁ జెండాడి కా
లాగ్రక్షోణికిఁ బంచె రాముఁడు గరీయస్థేముఁడై వారలన్.
10.1-1383-వ.
అ య్యవసరంబున.

భావము:
“ఔరా! ఎంత ఆశ్చర్యం? ఒక గోవులు కాచుకునేవాడు ప్రభువుని చంపేసాడు. వీడిని పొడిచెయ్యండి. ఇంకా ఆలస్యం ఎందుకు?” అంటూ పరితాపంతో అగ్గలమైన కోపంతో పొగరు బోతులై న్యగ్రోధుడు, గహ్వుడూ మొదలైన కంసుడి సోదరులు అనేక రకాల ఆయుధ పరికరాలతో కృష్ణుడి మీద కలియబడ్డారు. అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తి అయి పరిఘ అనే ఆయుధం ధరించి మదించిన ఏనుగు లాగా ఒక్కొక్కరిని చెండాడి యముడి సన్నిధికి పంపాడు. అలా కంస సంహారం జరిగిన సమయంలో . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1382

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 90

( కంస వధ )

10.1-1378-శా.
మంచాగ్రంబుననుండి రంగధరణీమధ్యంబునం గూలి యే
సంచారంబును లేక చిక్కి జను లాశ్చర్యంబునుం బొందఁగా
బంచత్వంబును బొంది యున్న విమతుం బద్మాక్షుఁ డీడ్చెన్ వడిం
బంచాస్యంబు గజంబు నీడ్చు పగిదిన్ బాహాబలోల్లాసియై.
10.1-1379-క.
రోషప్రమోద నిద్రా
భాషాశన పాన గతులఁ బాయక చక్రిన్
దోషగతిఁ జూచి యైన వి
శేషరుచిం గంసుఁ డతనిఁ జెందె నరేంద్రా!
10.1-1380-వ.
ఆ సమయంబున.

భావము:
మంచెమీది నుంచి మల్లక్రీడారంగ మధ్యలోకి వచ్చి పడిన కంసుడు ఎలాంటి కదలికలు లేక కట్టెలాగ బిగుసుకు పోయి అక్కడికక్కడే మరణించాడు. అక్కడి జనుల ఆ దుర్మతి సంహారాన్ని అబ్బురపడుతూ చూసారు. సింహం ఏనుగును ఎలా ఈడుస్తుందో అలా కలువ కన్నులున్న కృష్ణుడు భుజబలవిజృంభణంతో కంసుడిని ఈడ్చాడు. ఓ మహారాజా పరీక్షిత్తూ! కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, మాటలు మాట్లాడుతున్నప్పుడు, తిండి తింటున్నప్పుడు, నీరు త్రాగుతున్నప్పుడు, చక్రాయుధు డైన శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే దోషబుద్ధితోనే అయినప్పటికీ వదలకుండా తలచి తలచి అతడు భగవంతుడిని పొంది ఉత్తమగతి అందుకున్నాడు. అలా కంసుని సంహరించిన సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1378

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :