Friday, February 16, 2018

నీలకంఠ వైభవం - 9

8-225-క.
కొందఱు గలఁ డందురు నినుఁ; 
గొందఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొందఱు; గలఁ డని లేఁ డని
కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

భావము:
ఓ పరమేశ్వరా! మహాప్రభూ! కొందరు నీవు ఉన్నావు అంటారు. కొందరు నీవు లేవు అంటారు. ఇంకా కొందరు నీవు సగుణరూపుడవు అంటారు. మరికొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=225

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, February 11, 2018

నీలకంఠ వైభవం - 8

8-224-సీ.
అగ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ; 
కాలంబు గతి; రత్నగర్భ పదము; 
శ్వసనంబు నీ యూర్పు; రసన జలేశుండు; 
దిశలుఁ గర్ణంబులు; దివము నాభి; 
సూర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు; 
జఠరంబు జలధులు; చదలు శిరము; 
సర్వౌషధులు రోమచయములు; శల్యంబు; 
లద్రులు; మానస మమృతకరుఁడు;
8-224.1-తే.
ఛందములు ధాతువులు; ధర్మసమితి హృదయ; 
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు; 
నయిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతి యై యొప్పునాద్య మగుచు.

భావము:
అగ్ని నీ ముఖము; జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు; కాలం నీ నడక; భూమండలం నీ పాదం; వాయువు నీ శ్వాస; వరుణుడు నా నాలుక; దిక్కులు నీ చెవులు; స్వర్గం నీ నాభి; సూర్యుడు నీ దృష్టి; నీరు నీ వీర్యం; సముద్రాలు నీ గర్భం; ఆకాశం నీ శిరస్సు; ఓషదులు నీ రోమ సమూహాలు; పర్వతాలు నీ ఎముకలగూడు; చంద్రుడు నీ మనస్సు; వేదాలు నీ ధాతువు; ధర్మశాస్త్రాలు నీ హృదయం; ఉపనిషత్తులు నీ ముఖాలు; నీ రూపం పరతత్వం; నీవు స్వయంప్రకాశుడవు; శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=224

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

నీలకంఠ వైభవం - 7

8-223-క.
నీ యంద సంభవించును
నీ యంద వసించి యుండు నిఖిల జగములున్
నీ యంద లయముఁ బొందును
నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా!

భావము:
రుద్రదేవా! అన్నిలోకాలు నీలోనే పుడతాయి; నీలోనే నివసిస్తాయి; ప్రాణులు అన్ని నీలోనే లయమవుతాయి; నీ ఉదరం ప్రాణులు అన్నిటికి అలవాలం

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=223

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, February 9, 2018

నీలకంఠ వైభవం - 6

8-222-సీ.
భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! ;
దేవ! మహాదేవ! దేవవంద్య! 
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ; 
బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; 
యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ; 
గోరి భజింతురు కుశలమతులు; 
సకల సృష్టిస్థితిసంహారకర్తవై; 
బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవ;
8-222.1-ఆ.
పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త
మంబు నీవ శక్తిమయుఁడ వీవ; 
శబ్దయోని వీవ; జగదంతరాత్మవు
నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు

భావము:
“ఓ పరమేశ్వరా! పంచ భూతాలకూ ఆత్మ అయిన వాడా! సర్వ భూతాలకూ అధినాథా! జీవులకు కారణమైన రూపమైన దేవా! ఓ దైవమా! మహాదేవా! దేవతలకు వందనీయుడా! ఈ లోకాలు అన్నిటికి ప్రభువు నీవే; సంసారబంధాలలో పడుట, మోక్షమూ ఏది అనుగ్రహించాలన్నా నీవల్లనే సాధ్యం అవుతుంది; జ్ఞానులు ఆర్తులకు శరణు ఇచ్చేవాడూ, ఆదిగురువు అయిన నిన్ను కోరి ప్రార్థిస్తారు; సృష్టి, స్థితి, సంహార కార్యాలు సమస్తమునకు కారణ భూతుడవు అయి; బ్రహ్మ విష్ణు శివ పేర్లుతో విరాజిల్లుతుంటావు; భావానికి అందని పరబ్రహ్మవు; సదసద్రూప పరమాత్మవూ నీవే; శక్తి యుక్తుడవు నీవే; శబ్దానికి జన్మస్థానం అయిన శబ్దబ్రహ్మము నీవే; లోకానికి అంతరాత్మవు నీవే; సర్వ చరాచరాలకు ప్రాణము నీవే;



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 5

8-220-క.
వారలు దీనత వచ్చుటఁ
గూరిమితో నెఱిఁగి దక్షుకూఁతురుఁ దానుం
బేరోలగమున నుండి ద
యారతుఁడై చంద్రచూడుఁ డవసర మిచ్చెన్.
8-221-వ.
అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతించిరి.

భావము:
అలా దేవతలు దుఃఖంతో వచ్చుటను దయామయుడైన చంద్రరేఖను భూషణంగా ధరించే శంకరుడు చూసాడు. అప్పుడు సతీదేవితో కలిసి పేరోలగంలో ఉన్న శివుడు దేవతలకు దర్శనం ఇచ్చి ఆదరంగా చెప్పుకోండి మీ విన్నపం అన్నాడు. అలా అవసరమిచ్చిన సర్పాలంకార భూషితుడైన శంకరునకు, బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ సాగిలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=220

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, February 6, 2018

నీలకంఠ వైభవం - 4

8-219-మ.
చని కైలాసముఁ జొచ్చి శంకరుని వాసద్వారముం జేరి యీ
శుని దౌవారికు లడ్డపడ్డఁ దల మంచుం జొచ్చి కుయ్యో మొఱో
విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు మం చంబుజా
సనముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్.


భావము:
ఆ సమయంలో బ్రహ్మాది దేవతా ప్రముఖులు అందరూ ఆర్తితో ఆశ్రయించిన వారిని కాపాడే వాడూ, సుఖప్రదాతా అయిన శంకరుని వేడుటకు కైలాసానికి వెళ్ళారు. పరమశివుని మందిరం ద్వారపాలకులు అడ్డుకున్నారు. కానీ వారిని తప్పుకోమని లోనికి ప్రవేశించి ఈశ్వరుని దర్శనం చేసుకుని “శరణు, శరణు చిత్తగించు దయతో చూడు, కాపాడు” అంటూ మొరపెట్టుకున్నారు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 3

8-217-క.
ఒడ్డారించి విషంబున
కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్
గొడ్డేఱి మ్రంది రా లన
బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా!
8-218-వ.
అప్పుడు


భావము:
ఓ రాజా! అప్పుడు ఆ విషాగ్నిని అడ్డగించే సాహసం చేసి కాపాడే మహనీయులు లేకపోయారు. పెళ్ళం పిల్లలు అనే మమకారం లేకుండా పారిపోయికూడా జనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా హాలహలం వ్యాపిస్తున్న సమయంలో. . . .



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::