Sunday, February 11, 2018

నీలకంఠ వైభవం - 8

8-224-సీ.
అగ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ; 
కాలంబు గతి; రత్నగర్భ పదము; 
శ్వసనంబు నీ యూర్పు; రసన జలేశుండు; 
దిశలుఁ గర్ణంబులు; దివము నాభి; 
సూర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు; 
జఠరంబు జలధులు; చదలు శిరము; 
సర్వౌషధులు రోమచయములు; శల్యంబు; 
లద్రులు; మానస మమృతకరుఁడు;
8-224.1-తే.
ఛందములు ధాతువులు; ధర్మసమితి హృదయ; 
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు; 
నయిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతి యై యొప్పునాద్య మగుచు.

భావము:
అగ్ని నీ ముఖము; జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు; కాలం నీ నడక; భూమండలం నీ పాదం; వాయువు నీ శ్వాస; వరుణుడు నా నాలుక; దిక్కులు నీ చెవులు; స్వర్గం నీ నాభి; సూర్యుడు నీ దృష్టి; నీరు నీ వీర్యం; సముద్రాలు నీ గర్భం; ఆకాశం నీ శిరస్సు; ఓషదులు నీ రోమ సమూహాలు; పర్వతాలు నీ ఎముకలగూడు; చంద్రుడు నీ మనస్సు; వేదాలు నీ ధాతువు; ధర్మశాస్త్రాలు నీ హృదయం; ఉపనిషత్తులు నీ ముఖాలు; నీ రూపం పరతత్వం; నీవు స్వయంప్రకాశుడవు; శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=224

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: