Tuesday, April 7, 2015

కృష్ణలీలలు

10.1-343-ఆటవెలది
బాలమాత్రుఁడగు సలీలుని ముఖమందు
విశ్వ మెల్ల నెట్లు వెలసి యుండు
బాలు భంగి నితఁడు భాసిల్లుఁ గాని స
ర్వాత్ముఁ డాది విష్ణుఁ డగుట నిజము.
         యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసిన విభ్రాంతిలో ఇంకా ఇలా అనుకుంటోంది.
         ఇంత చిన్న పిల్లవాడి నోటిలో, ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఇమిడిపోయింది పసివాడిలాగ కనిపిస్తున్నాడు కాని ఇతడు నిజానికి సర్వమునందు ఆత్మరూపంలో ఉండే సర్వాత్మకుడు, ఆదిమూలాధారమైన సర్వవ్యాపకుడు అయిన శ్రీమహావిష్ణువే. ఇదే ముమ్మాటికీ నిజం.
10.1-343-aaTaveladi
baalamaatruM~Dagu saleeluni mukhamaMdu
vishva mella neTlu velasi yuMDu
baalu bhaMgi nitaM~Du bhaasilluM~ gaani sa
rvaatmuM~ Daadi viShNuM~ DaguTa nijamu.
          బాల = సామాన్య బాలునికి; మాత్రుడు = సమానమైనవాడు; అగు = ఐన; సలీలుని = లీలతో కూడియున్నవాని; ముఖము = ముఖము; అందున్ = లో; విశ్వము = భువనభాండము; ఎల్లన్ = అంతా; ఎట్లు = ఏ విధముగ; వెలసి = విలసిల్లి; ఉండున్ = ఉండగలదు; బాలున్ = పిల్లవాని; భంగిన్ = వలె; ఇతడు = ఇతను; భాసిల్లున్ = ప్రకాశించును; కాని = కాని; సర్వాత్ముడు = నారాయణుడు {సర్వాత్ముడు - సర్వమునందు (ఆత్మగా) నుండెడి వాడు, విష్ణువు}; ఆదివిష్ణుడు = నారాయణుడు {ఆదివిష్ణుడు - మూలాదారమైన సర్వవ్యాపకుడు, విష్ణువు}; అగుటన్ = ఐ ఉండుట; నిజము = తథ్యము.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Monday, April 6, 2015

కృష్ణలీలలు

10.1-342-మత్తేభము
కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్
          కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి విభ్రాంతురాలైన యశోద ఇలా అనుకోసాగింది
          నేను కలగనటం లేదు కదా? లేకపోతే ఇదంతా విష్ణుమాయేమో? ఇదంతా నా చిత్తభ్రమా? కాకపోతే ఇదే సత్యమా? ఒకవేళ నా బుద్ధి సరిగా పనిచేయటం లేదా? అసలు నేను యశోదను అవునా కాదా? ఇది అసలు మా ఇల్లేనా మరొటా? ఈ పిల్లాడు ఎంత, వీడి నోటిలో బ్రహ్మాండం అంతా వెలుగులు చిమ్ముతూ ఉండటం ఏమిటి? ఇలా ఎలా సాధ్యం? ఆలోచించేకొద్దీ ఇదంతా మహా ఆశ్చర్యంగా ఉంది.   
10.1-342-mathethebhamu
kalayO! vaiShNava maayayO! yitara saMkalpaarthamO! satyamO!
talaM~pan nEraka yunnadaanano! yashOdaadEviM~ gaanO! para
sthalamO! baalakuM~DeMta? yeetani mukhasthaMbai yajaaMDaMbu pra
jvalamai yuMDuTa kEmi hEtuvo! mahaashcharyaMbu chiMtiMpaM~gan
          కలయో = స్వప్నమా; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; మాయయో = మాయా; ఇతరసంకల్పార్థమో = అసత్యమా, చిత్తభ్రమా {ఇతరసంకల్పార్థము - సరికాని ఆలోచనలవలన కలిగినది, అసత్యము, చిత్తభ్రమ}; సత్యమో = వాస్తవమా; తలపన్ = విచారించ; నేరక = లేక; ఉన్నదాననొ = ఉన్నానేమో; యశోదాదేవిన్ = నేనసలు యశోదాదేవిని; కానో = కాదేమో; పరస్థలమో = ఇతరమైన; స్థలమో = ప్రదేశమేమో (ఇది); బాలకుడు = పిల్లవాడు; ఎంత = ఎంతటివాడు; ఈతని = అతని యొక్క; ముఖస్థంబు = ముఖమునం దున్నది; ఐ = అయిన; అజాండంబు = విశ్వము; ప్రజ్వలము = మిక్కలి ప్రకాశిస్తున్నది; ఐ = అయ్యి; ఉండుట = ఉండుట; కున్ = కు; ఏమి = ఏమి; హేతువో = కారణమో; మహా = గొప్ప; ఆశ్చర్యంబు = వింత; చింతింపగన్ = విచారించగా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Sunday, April 5, 2015

కృష్ణలీలలు

10.1-340-కంద పద్యము
ఆ లలితాంగి గనుంగొనె
బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ                    
గోళ శిఖి తరణి శశి ది
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.
          యశోదామాత ఆ పసివాని నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు మొదలగు వాటితో భూగోళము; అగ్ని; సూర్యుడు; చంద్రుడు; అష్టదిక్పాలకులు 1తూర్పుకి ఇంద్రుడు, 2ఆగ్నేయానికి అగ్ని, 3దక్షిణానికి యముడు, 4నైఋతికి నిరృతి, 5పడమరకి వరుణుడు, 6వాయవ్యానికి వాయువు, 7ఉత్తరానికి కుబేరుడు, 8ఈశాన్యానికి శివుడు మొదలగు సమస్తముతో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తాన్ని చూసింది.
10.1-340-kaMda padyamu
aa lalitaaMgi ganuMgone
baaluni mukhamaMdu jaladhi parvata vana bhoo        
gOLa shikhi taraNi shashi di
kpaalaadi karaMDamaina brahmaaMDaMbun.
          ఆ = ఆ; లలితాంగి = సుందరి {లలితాంగి - మృదువైన శరీరము కలామె, స్త్రీ}; కనుంగొనెన్ = చూచెను; బాలుని = పిల్లవాని యొక్క; ముఖము = మోము; అందున్ = అందు; జలధి = సముద్రములు {జలధి - నీటికి నిధి, కడలి}; పర్వత = పర్వతములు {పర్వతము - సంధులు కలది, కొండ}; వన = అడవులు; భూగోళ = భూమండలము; శిఖి = అగ్ని {శిఖి - సిగలు కలది, అగ్ని}; తరణి = సూర్యుడు {తరణి - అంధకారమును తరింపజేయువాడు, సూర్యుడు}; శశి = చంద్రుడు {శశి - కుందేలు గర్తు ధరించినవాడు, చంద్రుడు}; దిక్పాల = అష్టదిక్పాలకులు {అష్టదిక్పాలకులు - 1తూర్పు ఇంద్రుడు 2ఆగ్నేయము అగ్ని 3దక్షిణము యముడు 4నైఋతి నిరృతి 5పడమర వరుణుడు 6వాయవ్యము వాయువు 7ఉత్తరము కుబేరుడు 8ఈశాన్యము శివుడు}; ఆది = మోదలగువానికి; కరండము = బరణి; ఐన = అయిన; బ్రహ్మాండంబున్ = విశ్వమంతా {బ్రహ్మాండము - ఒక పెద్ద గుడ్డు ఆకారమున ఉండు భూగోళ ఖగోళాది మొత్తము, విశ్వము}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :