Monday, July 21, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 358

కుయ్యిడ 


1-281-ఉ.
కుయ్యడ శక్తి లే దుదరగోళములోపల నున్నవాఁడ ది
క్కెయ్యది ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నే
డి య్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్నుఁ గావ నే
యయ్య గలండు? గర్భజని తాపద నెవ్వఁ డెఱుంగు దైవమా!
          ఏడ్వటానికైనా ఓపిక లేదు; తల్లిగర్భంలో తల్లడిల్లుతున్నాను; దిక్కులేని దీనుణ్ణి; అనాథ నంటు అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆలకిస్తుంటాను; ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటో? ఈ అపాయంనుంచి నన్ను ఆదుకొనే తండ్రి ఎక్కడ ఉన్నాడో? తల్లి గర్భంలో నేను అనుభవించే ఈ వేదన అర్థంచేసుకొనే దైవ మెవ్వరో ఏమిటో? భగవంతుడా!
తల్లి ఉత్తర గర్భంలో అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్ర జ్వాలలకు దందహ్యమాను డగుచున్న పరీక్షిత్తు ఇలా రోదిస్తున్నాడు.
1-281-u.
kuyyaDa Sakti lae dudaragOLamulOpala nunnavaa@MDa di
kkeyyadi nanaatha nani yeppuDu@M dalli gaNiMpa viMdu nae
Di yyishuvahni vaayuTaku neyyadi maargamu nannu@M gaava nae
yayya galaMDu? garbhajani taapada nevva@M DeRuMgu daivamaa!
          కుయ్యడన్ = కుయ్ అని ఏడ్చుటకు; శక్తి = నేర్పు; లేదు = లేదు; ఉదర = కడుపులోని; గోళము = పిండము; లోపలన్ = లోపల; ఉన్నవాఁడన్ = ఉన్నవాడిని; దిక్కు = శరణు; ఎయ్యది = ఏది; అనాథను = దిక్కులేని వాడను; అని = అని; ఎప్పుడున్ = ఎప్పుడు; తల్లి = తల్లి; గణింప = ఎంచుతుండగ; విందున్ = వినుచుందును; నేడు = ఇవేళ; ఈ = ఈ; ఇషు = బాణముయొక్క; వహ్నిన్ = అగ్నిని; వాయుట = దూరము చేయుట; కున్ = కు; ఏయ్యది = ఏది; మార్గము = దారి; నన్నున్ = నన్ను; కావన్ = కాపాడుటకు; ఏ = ఏ; అయ్య = మహాత్ముడు; కలండు = ఉన్నాడు; గర్భ = గర్భములో; జనిత = కలుగుతున్న; ఆపదన్ = ప్రమాదమును; ఎవ్వఁడు = ఎవడు; ఎఱుంగున్ = తెలిసికొనగలవాడు; దైవమా = దేవుడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, July 20, 2014

తెలుగుభాగవత తేనెసోనలు -357

శ్రీకృష్ణా యదుభూషణా

1-201-శా.
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
శ్రీ కృష్ణ! యదుకులవిభూషణ! విజయమిత్ర! శృంగార రసరత్నాకర! జగత్కంటకులైన మహీపతుల వంశాలను దహించి వేసిన వాడ! జగదీశ్వర! ఆపన్నులైన అమరుల, అవనీసురుల, ఆవులమందల ఆర్తులను బాపువాడ! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకు ఈ భవబంధాలను తెంపెయ్యి.
ద్వారకకు తిరిగివెళ్తున్న శ్రీకృష్ణుని గూర్చి కుంతీదేవి చేసిన స్తుతి బహుప్రసిద్ధమైనది. ఆ స్తుతిలోని పద్య మిది.
1-201-Saa.
SreekRshNaa! yadubhooshaNaa! narasakhaa! SRMgaararatnaakaraa!
lOkadrOhinaraeMdravaMSadahanaa! lOkaeSvaraa! daevataa
neekabraahmaNagOgaNaartiharaNaa! nirvaaNasaMdhaayakaa!
neekun mrokkeda@M druMpavae bhavalatal nityaanukaMpaanidhee!
శ్రీకృష్ణా = కృష్ణా {కృష్ణ - నల్లనివాడు}; యదుభూషణా = కృష్ణా {యదు భూషణా - యదు వంశమునకు భూషణము వంటి వాడు / కృష్ణుడు}; నరసఖా = కృష్ణా {నరసఖ - అర్జునునకు సఖుడు / కృష్ణుడు}; శృంగారరత్నాకరా = కృష్ణా {శృంగార రత్నాకర -శృగార రసమునకు సముద్రము వంటివాడు / కృష్ణుడు}; లోకద్రోహినరేంద్రవంశదహనా = కృష్ణా {లోకద్రోహినరేంద్రవంశదహనా - దుష్టరాజవంశముల నాశనము చేయువాడు, కృష్ణుడు}; లోకేశ్వరా = కృష్ణా {లోకేశ్వర - లోకములకు ఈశ్వరుడు / కృష్ణుడు}; దేవత = దేవతల; అనీక = సమూహమునకును; బ్రాహ్మణ = బ్రాహ్మణులకును; గోగణ = గోవులమందకును; ఆర్తి = బాధలను; హరణా = హరించువాడా / కృష్ణా; నిర్వాణ సంధాయకా = కృష్ణా {నిర్వాణ సంధాయిక - మోక్షమును కలింగించువాడు / కృష్ణుడు}; నీకున్  నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; త్రుంపవే = తెంపుము; భవ = సంసార; లతల్ = బంధనములు; నిత్యానుకంపానిధీ = కృష్ణా {నిత్యానుకంపానిధీ -నిత్యమైన దయకు నిలయమైనవాడు / కృష్ణుడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Saturday, July 19, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 356

కల్లలేదని

10.1-1769-మత్త.
కల్ల లేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్
బ్రల్లదుం దెగఁజూచితేనియు భాగ్యవంతుల మైతి మే
మల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా
తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదు రీశ్వరా!
          ప్రభూ! మా అన్న రుక్మి యందు దోషం లేదని మనవిచేయటం లేదు. నిజమే యితను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యా డని, మేము అదృష్టవంతులం యైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు, ఇతగాడు దుష్టుడు కదా అని సంహరించే వంటే, పుత్రశోకంతో వారు పొగిలిపోతారు నాథా!
శ్రీకృష్ణుడు రాక్షసవివాహవిధానంలో రుక్మిణీదేవిని తీసుకుపోతుంటే, ఆమె అన్న రుక్మి వీరావేశంతో తరిమి ఎదిరించాడు. కృష్ణుడు ఖడ్గ మెత్తి నరకడానికి సిద్దమౌతుంటే. అడ్డం వెళ్ళి రుక్మిణీదేవి వేడుకుంటోంది.
10.1-1769-matta.
kalla laedani vinnaviMchuTa gaadu vallabha! yeetanin
bralladuM dega@Mjoochitaeniyu bhaagyavaMtula maiti mae
malluM Dayye mukuMdu@M DeeSvaru@M DaMchu mOditu laina maa
tallidaMDrulu putra SOkamu daalchi chikkudu reeSvaraa!
          కల్ల = తప్పు; లేదు = చేయలేదు; అని = అని; విన్నవించుట = చెప్పుట; కాదు = లేదు; వల్లభ = ప్రియ మైనవాడ; ఈతనిన్ = అతనిని; ప్రల్లదున్ = దుష్టుడను; తెగజూచితేనియున్ = చంపబోయితివేని; భాగ్యవంతులము = అదృష్టవంతులము; ఐతిమి = అయినాము; మేము = మేము; అల్లుఁడు = అల్లుడు {అల్లుడు - కూతురు భర్త}; అయ్యెన్ = అయ్యెను; ముకుందుడు = మోక్షము నిచ్చువాడు; ఈశ్వరుడు = ఐశ్వర్యవంతుడు, కృష్ణుడు; అంచున్ = అని; మోదితులు = సంతోషించినవారు; ఐన = అయిన; మా = మా యొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; పుత్ర = కొడుకు మరణించిన; శోకమున్ = దుఃఖమును; తాల్చి = పొంది; చిక్కుదురు = కృశింతురు; ఈశ్వరా = స్వామీ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~