Friday, July 18, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 355


శరధిమదవిరామ

10.2-1342-మా.
శరధిమదవిరామా! సర్వలోకాభిరామా!
సురరిపువిషభీమా! సుందరీలోకకామా!
ధరణివరలలామా! తాపసస్తోత్రసీమా!
సురచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!
          సముద్రుని గర్వాన్ని అణచిన వాడ! లోకాలకు సర్వానికి సుందర మైన వాడ! రాక్షసుల యెడ పరమ భయంకరమైన వాడ! సుందర స్త్రీజనాలకు మన్మథుని వంటి వాడ! రాజు లందరిలో శ్రేష్ఠమైన వాడ! తాపసులచే స్తుతింపబడు వాడ! సర్వ సుణాలకు అలవాలమైన వాడ! సూర్యవంశ మనే సముద్రానికి చంద్రుని వంటి వాడ! ఓ శ్రీరామచంద్రప్రభు!
దశమస్కంధ ద్వితీయాశ్వాసాంత ప్రార్థన యిది.
10.2-1342-maa.
Saradhimadaviraamaa! sarvalOkaabhiraamaa!
suraripuvishabheemaa! suMdareelOkakaamaa!
dharaNivaralalaamaa! taapasastOtraseemaa!
surachiraguNadhaamaa! sooryavaMSaabdhisOmaa!
          శరధిమదవిరామా = శ్రీరామా {శరధిమదవిరాముడు - శరధి (సముద్రము యొక్క) మద (గర్వమును) విరాముడు (అణచినవాడు), శ్రీరాముడు}; సర్వలోకాభిరామా = శ్రీరామా {సర్వలోకాభిరాముడు - ఎల్ల లోకములకు అభిరాముడు (మనోఙ్ఞుడు), శ్రీరాముడు}; సురరిపువిషభీమా = శ్రీరామా {సురరిపువిషభీముడు - సురరిపు (రాక్షసులు అను) విషమునకు భీముడు (శివుడు), శ్రీరాముడు}; సుందరీలోకకామా = శ్రీరామా {సుందరీలోకకాముడు - సుందర స్త్రీసమూహములకు మన్మథుడు, శ్రీరాముడు}; ధరణివరలలామా = శ్రీరామా {ధరణివరలలాముడు - ధరణివర (రాజులలో) లలాముడు (శ్రేష్ఠుడు), శ్రీరాముడు}; తాపసస్తోత్రసీమా = శ్రీరామా {తాపసస్తోత్రసీముడు - ఋషుల స్తోత్రములుకు మేర (లక్ష్యము) ఐనవాడు, శ్రీరాముడు}; సురచిరగుణధామా = శ్రీరామా {సురచిరగుణధాముడు - సు (మిక్కలి) రుచిర (మనోజ్ఞమైన) గుణ (సుగుణములకు) ధాముడు (నికిపట్టైన వాడు), శ్రీరాముడు}; సూర్యవంశాబ్ధిసోమా = శ్రీరామా {సూర్యవంశాబ్ధిసోముడు - సూర్యవంశము అను అబ్ది (సముద్రమునకు) సోముడు (చంద్రుడు), శ్రీరాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, July 17, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 354

సరసహృదయవాసా

5.1-183-మా.
సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
భరితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలఙ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా!
          సరసుల హృదయాలలో నివసించువాడా! భువనమోహిని యయిన లక్ష్మీదేవితో విహరించెడి వాడా! శుభప్రదమైన చరిత్ర కలవాడా! సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా! పోలికలకు అందని నీలమేఘశ్యామ దేహము కలవాడా! స్వచ్ఛమైన జ్ఞానంతో ఒప్పువాడా! భరించరాని సంసార బాధలను చూరంచేసెడి వాడా! గోపికల హృదయలను దోచిన వాడా! శ్రీకృష్ణా! నీకు నమస్కారము.
పంచస్కంధ ప్రథమాశ్వాశాంత ప్రార్థన
5.1-183-maa.
sarasahRdayavaasaa! chaarulakshmeevilaasaa!
bharitaSubhacharitraa! bhaaskaraabjaarinaetraa!
nirupamaghanagaatraa! nirmala~@Mnaanapaatraa!
gurutarabhavadooraa! gOpikaachittachOraa!
          సరసహృదయవాసా = శ్రీకృష్ణ {సరసహృదయవాసా - సరసుల హృదయములందు వసించెడివాడ, శ్రీకృష్ణ}; చారులక్ష్మీవిలాసా = శ్రీకృష్ణ {చారులక్ష్మీవిలాసా - చారు (అందమైన) లక్ష్మీ (లక్ష్మీకళతో) విలాసిల్లెడివాడ, శ్రీకృష్ణ}; భరితశుభచరిత్రా = శ్రీకృష్ణ {భరితశుభచరిత్రా - భరిత (నిండైన) శుభచరిత్ర కలవాడ, శ్రీకృష్ణ}; భాస్కరాబ్జారినేత్రా = శ్రీకృష్ణ {భాస్కరాబ్జారినేత్రా - భాస్కర (సూర్యుడు) అబ్జారి (పద్మములకు శత్రువైన చంద్రుడు) వంటి నేత్రా (కన్నులు కలవాడ), శ్రీకృష్ణ}; నిరుపమఘనగాత్రా = శ్రీకృష్ణ {నిరుపమఘనగాత్రా - నిరుపమ (సాటిలేని) ఘన (గొప్ప, మేఘముల వంటి) గాత్ర (శరీరము కలవాడ), శ్రీకృష్ణ}; నిర్మలజ్ఞానపాత్రా = శ్రీకృష్ణ {నిర్మలజ్ఞానపాత్రా - నిర్మల (స్వచ్చమైన) జ్ఞానముచే పాత్ర (తగినవాడ), శ్రీకృష్ణ}; గురుతరభవదూరా = శ్రీకృష్ణ {గురుతరభవదూరా - గురుతర (మిక్కిలిభారమైన) భవ (సంసారబాధలను) విదూర (తొలగించువాడ), శ్రీకృష్ణ}; గోపికాచిత్తచోరా = శ్రీకృష్ణ {గోపికాచిత్తచోరా - గోపికల చిత్తములను దొంగిలించినవాడ, శ్రీకృష్ణ}; = {గురు - గురుతరము -గురుతమము}
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Wednesday, July 16, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 353

నీ పాదకమల సేవయు

10.1-1272-క.
నీ పాదకమలసేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాపసమందార! నాకు దయచేయఁ గదే.
          ఓ తపోధనులకు కల్పవృక్ష మైనవాడా! శ్రీకృష్ణా! కమలాల వంటి నీ పాదాల పరిచర్య, నీ పాదాలను పూజించే భక్తులతో మిత్రత్వం, ప్రాణులు అన్నిటిమీద అత్యంత అపరిమతమైన దయను నాకు ప్రసాదించు.
ద్వారకలో, శ్రేష్టమైన మాలలు ఇచ్చిన మాలలమ్మే సుదామునికి, శ్రీకృష్ణుడు వరంకోరుకో మని అనుగ్రహించాడు. ఆ సుదాముడు కోరిన వరం యిది. ఒక మాలాకారుని చేత యింతటి గంభీరమైన భావగర్భితమైన పలుకులు పలికించటంలో పోతనామాత్యుల వారి విశిష్ఠత కనబడుతోంది. వారు భక్తి పారవశ్యంతో మైమరచి పద్యాలలో యిలా మధుర మకరందాన్ని స్వచ్ఛమైన ప్రపత్తిని చిలకరిస్తుంటారు.
10.1-1272-ka.
nee paadakamalasEvayu
nee paadaarchakulatODi neyyamunu nitaaM
taapaara bhootadayayunu
daapasamaMdaara! naaku dayachEya@M gadE.
నీ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల యందు; సేవయున్ = భక్తి; నీ = నీ యొక్క; పాద = పాదముల; అర్చకుల = భక్తుల; తోడి = తోటి; నెయ్యమును = స్నేహము; నితాంత = విస్తారమైన; అపార = అంతులేని; భూత = జీవుల యెడ; దయయును = దయకలిగి యుండుట; తాపసమందార = కృష్ణ {తాపసమందారుడు - తపస్సు చేయువారికి కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; నా = నా; కున్ = కు; దయచేయగదే = అనుగ్రహింపుము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~